You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రిటన్ కొత్త రాణి పట్టాభిషేకం సమయంలో ఆమె కిరీటంలో కోహినూర్ వజ్రం ఉండదు
కింగ్ చార్లెస్, ఆయన భార్య కమీలాలకు మే నెల 6వ తేదీన పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో కోహినూర్ వజ్రాన్ని ప్రదర్శించటం లేదు.
లైవ్ కవరేజీ
లైవ్‌పేజ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇక్కడితో ముగిస్తున్నాం.
తిరిగి రేపు ఉదయం తాజా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో కలుద్దాం.
అంతవరకూ సెలవు. ధన్యవాదాలు.
సిరియా భూకంపం: ఆ ఊరంతా శిథిలమైంది.. వారికి సాయం చేసే దిక్కే లేదు
బ్రిటన్ కొత్త రాణి పట్టాభిషేకంలో.. ఆమె కిరీటంలో ‘కోహినూర్’ ఉండదు
బ్రిటన్ రాజు చార్లెస్ భార్య, కొత్త రాణి కమీలా అధికారికంగా పట్టాభిషిక్తమయ్యేటప్పుడు.. ఆమె కిరీటంలో ప్రఖ్యాత కోహినూర్ వజ్రం ఉండబోదు.
కింగ్ చార్లెస్, ఆయన భార్య కమీలాలకు మే నెల 6వ తేదీన పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో కోహినూర్ వజ్రాన్ని ప్రదర్శించటం లేదు.
వివాదాస్పద వజ్రం కోహినూర్.. బ్రిటన్ చేరటానికి ముందు భారతదేశంలో చాలా మంది రాచ కుటంబాల చేతులు మారింది.
ఈ వజ్రాన్ని.. 19వ శతాబ్దానికి చెందిన ఒక రాజును మోసం చేయటం ద్వారా బ్రిటన్ సంపాదించిందని భారతదేశం వాదిస్తూ ఉంది.
కొత్త రాణి ఈ వజ్రాన్ని తన కిరీటంలో ధరించినట్లయితే.. వలస కాలపు చెడు జ్ఞాపకాలు మళ్లీ పుట్టుకొస్తాయని భారత ప్రభుత్వం పేర్కొంది.
ప్రపంచంలో అత్యంత పేరున్న, వివాదాస్పదమైన వజ్రాల్లో ఒకటి కోహినూర్. ఈ వజ్రాన్ని తిరిగి పొందటం కోసం కూడా భారత్ ప్రయత్నాలు చేస్తోంది.
హైదరాబాద్ క్రికెట్ క్లబ్ ఎన్నికల నిర్వహణకు ఏకసభ్య కమిటీ: సుప్రీంకోర్టు నియామకం, అమరేంద్ర, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీని నియమించింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సారథ్యంలో ఈ ఏకసభ్య కమిటీని నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏకసభ్య కమిటీయే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలు పర్యవేక్షించనుంది.
హెచ్‌సీఏ పాలకవర్గం పదవీకాలం గత ఏడాది సెప్టెంబర్ తోనే ముగిసింది. అయితే, ఎన్నికలు నిర్వహించకుండా అధ్యక్షుడిగా అజారుద్దీన్ కొనసాగుతున్నారని క్రికెట్ క్లబ్బులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
అలాగే హైకోర్టు నియమించిన అంబుడ్స్‌మెన్ కమిటీని రద్దు చేయాలని కోరడంతో పాటు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్నికలు సకాలంలో నిర్వహించడంతోపాటు వాటిని సజావుగా జరిపేందుకు జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ఏకసభ్య కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.
త్రిపురలో త్రిముఖ పోరు.. ఓటర్ల మొగ్గు ఎటు?
డియోడరెంట్ పీల్చటం ప్రాణాలకు ముప్పు తెస్తుందా? జాగ్రత్తగా వాడటం ఎలా?
250 విమానాలను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఎయిరిండియా
యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి కొత్తగా 250 విమానాలను కొనేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది.
ఎయిరిండియాను గత కొంత కాలం క్రితమే టాటా గ్రూప్ కొనుగోలు చేసింది.
చిన్న, పెద్దతో పాటు అన్ని రకాల మార్గాలలో తాము ప్రయాణించగలిగేలా విమానాలను సమకూర్చుకోవాలని అనుకుంటున్నట్టు ఎయిరిండియా తెలిపింది.
ఎయిర్‌బస్ ప్రత్యర్థి కంపెనీ బోయింగ్ నుంచి కూడా 220 విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా చూస్తోంది.
విమానయాన ఇండస్ట్రీ చరిత్రలో వాణిజ్యపరమైన విమానాల కొనుగోలుకు సంబంధించిన అతిపెద్ద డీల్ ఇదే.
ప్రపంచంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదగాలని ఎయిరిండియా భావిస్తోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చ్యువల్‌గా సమావేశమైన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువల్ మాక్రోన్ ఈ డీల్‌ను ప్రకటించారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కూడా ఈ డీల్‌ను స్వాగతించారు. ఎయిర్‌బస్ తన విమానాల రెక్కలను యూకేలోనే డిజైన్ చేసి తయారు చేస్తుంది.
బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల ‘సర్వే‘
పుల్వామా దాడికి నాలుగేళ్లు: వీర జవాన్లకు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ నివాళులు
పుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి నాలుగేళ్లు నిండాయి.
2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
ప్రధాని మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘ఫిబ్రవరి 14న పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నా నివాళులు. జవాన్ల అత్యున్నత త్యాగాన్ని మేం ఎప్పటికీ మరిచిపోలేం. భారతదేశాన్ని బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి మాకు ఆ వీర సైనికుల ధైర్య సాహసాలే స్ఫూర్తిగా నిలుస్తున్నాయి’’ అని ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు.
పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.ఆ అమరుల త్యాగాలను భారతదేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని ఆయన ట్వీట్‌లో రాశారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ, పుల్వామా దాడి ప్రదేశాన్ని సందర్శించి జవాన్లకు నివాళలు అర్పించారు. ఆ సమయంలో తీసిన ఫొటోను ఆయన షేర్ చేశారు.
పుల్వామా దాడి తర్వాత బాలాకోట్‌లో భారత్ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షలు సాయం చేసే ఈ పథకం గురించి తెలుసా?
అమెరికా: మిషిగన్ యూనివర్సిటీలో కాల్పులు, పలువురికి గాయాలు
అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం ఉదయం కాల్పులు జరిగినట్లు, పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
కొందరి పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని మిషిగన్ యూనివర్సిటీ క్యాంపస్ పోలీసులు తెలిపారు.
కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు వెదుకుతున్నారు.
‘‘అనుమానితుడు ఒక నల్లజాతి వ్యక్తి. ఆయన ఎర్రటి బూట్లు, డెనిమ్ జాకెట్ ధరించారు. టోపీ పెట్టుకున్నారు’’ అని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ పోలీసులు ట్వీట్ చేశారు.
అనుమానిత వ్యక్తి ఫోటోలను కూడా విడుదల చేశారు.
రాబోయే 48 గంటలపాటు, క్యాంపస్‌లో అన్ని రకాల కార్యకలాపాలు నిలిపేసినట్లు, క్యాంపస్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
‘నెహ్రూ’ పేరును ఇంటిపేరుగా పెట్టుకోకపోవడం గురించి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే...
గాంధీ కుటుంబ సభ్యులు తమ ఇంటిపేరులో నెహ్రూ పేరును ఉపయోగించకపోవడం గురించి పార్లమెంట్‌లో నరేంద్ర మోదీ ప్రశ్నలు సంధించారు.
పీఎం మోదీ మాట్లాడుతూ, ‘‘ఏదైనా కార్యక్రమంలో మేం నెహ్రూ పేరును విస్మరిస్తే కొందరి రక్తం మరుగుతుంది. ఆయన దేశానికి మొదటి ప్రధాని కాబట్టి ఒకవేళ మేం ఆయన పేరును విస్మరిస్తే దాన్ని సరిదిద్దుకుంటాం. కానీ ఆయన వారసత్వానికి చెందిన ఒక వ్యక్తి, ఆయన పేరును ఇంటిపేరుగా పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇంటిపేరుగా ‘నెహ్రూ’ పేరును ఉపయోగించడంలో అంత అవమానం ఏముంది?’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదైనా మాట్లాడినా లేదా ఎవరినైనా అవమానించినా నిబంధనల ప్రకారం ప్రసంగంలోని ఆ వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలిగించవచ్చు.నేను ఆధారాలు ఉన్న అంశాలనే మర్యాదపూర్వకంగా పార్లమెంట్‌లో చెప్పాను. వాటికి రుజువులు చూపించమని నన్ను అడిగారు. రుజువులతో స్పీకర్‌కు సమాధానం కూడా రాశాను.కానీ వారు నా మాటలను రికార్డులో ఉంచుతారని నేను ఆశించడం లేదు.
అదే సమయంలో ప్రధాని మోదీ నేరుగా నన్ను అవమానించారు.మీరు గాంధీ ఎందుకు అయ్యారు? నెహ్రూ ఎందుకు కాలేదు? అని అన్నారు. దేశ ప్రధాని నేరుగా నన్ను అవమానించినా, ఆయన మాటలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించరు. అయితే, ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. ఎందుకంటే నిజం ఎల్లప్పుడూ దానంతట అదే బయటకు వస్తుంది’’ అని కేరళలోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వాయనాడ్‌లో రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోదీకి గౌతమ్ అదానీకి మధ్య ఉన్న సంబంధాలపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలను, ప్రసంగంలోని ఈ భాగాన్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.