You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మహిళల టీ20 ప్రపంచ కప్: పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్ జట్టు మీద భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్‌పేజ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇక్కడితో ముగిస్తున్నాం.

    తిరిగి రేపు ఉదయం తాజా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో కలుద్దాం.

    అంతవరకూ సెలవు. ధన్యవాదాలు.

  2. ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?

  3. ఈ ఊరి పిల్లలు.. పెద్దల వ్యసనాలను మాన్పించారు

  4. పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

    మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్ జట్టు మీద భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది.

    దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

    భారత జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసింది.

    భారత ప్లేయర్లు తొలి వికెట్‌కు 43 పరుగులు చేశారు. పదో ఓవర్‌లో నష్రా సంధు బౌలింగ్‌లో షెఫాలీ వర్మ సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యారు.

    షెఫాలీ 25 బంతుల్లో 33 పరుగులు చేశారు. అదే ఓవర్‌లో జెమీమా రోడ్రిగ్స్ స్టంపవుట్ తప్పించుకున్నారు.

    రెండో వికెట్ పడిన తర్వాత భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులోకి దిగి వేగంగా పరుగులు చేయటం మొదలుపెట్టారు.

    అయితే 12 బంతుల్లో 16 పరుగులు చేశాక ఆమె కూడా నష్రా సంధు బౌలింగ్‌లో ఔటయ్యారు.

    అప్పటికి జట్టు స్కోరు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులుగా ఉంది.

    మిగతా పనిని జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 53 పరుగులు), రిచా ఘోష్ (20 బంతుల్లో 31 పరుగులు) పూర్తి చేశారు.

    భారత జట్టు 19 ఓవర్లలోనే 151 పరుగులు చేసి గెలుపొందింది.

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్..

    అంతకుముందు టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 10 పరుగులకు చేరుకోగానే తొలి వికెట్ కోల్పోయింది.

    అనంతరం కెప్టెన్ మరూఫ్ రన్ రేట్‌ను ముందుకు నడిపించారు. ఆమె 55 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

    పాక్ జట్టులో ఆయేషా నసీమ్ 43 పరుగులు, మునీబా అలీ 12 పరుగులు, సిద్రా అమీన్ 11 పరుగులు చేశారు. జవేరియా ఖాన్ 8 పరుగులు చేయగా, నిదా దార్ డకౌట్ అయ్యారు.

    భారత జట్టులో రాధా యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.

    పాక్ జట్టులో నష్రా సంధు 2 వికెట్లు తీయగా, సదియా ఇక్బాల్ ఒక వికెట్ తీశారు.

  5. పులులను బలి తీసుకుంటున్నది ఎవరు? ఒక్క రాష్ట్రంలోనే ఏడాదిలో 38 పులులు, 87 చిరుతల మృతి

  6. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నజీర్ నియామకం ప్రజాస్వామ్యానికి మచ్చ: సీపీఎం ఎంపీ

    ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ నజీర్‌ను నియమించడంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఎం) నేత, రాజ్యసభ ఎంపీ ఏ.ఏ రహీం తీవ్ర విమర్శలు చేశారు.

    రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఆయన నియామకం జరగలేదని రహీం అన్నారు.

    ‘‘ఈ ఆఫర్‌ను నజీర్ తిరస్కరించాలి. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఈ దేశం కోల్పోకూడదు. మోదీ ప్రభుత్వం తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తున్నాయి’’ అని రహీం తన ఫేస్‌బుక్ పోస్టులో రాసుకొచ్చారు.

    ‘‘అయోధ్య కేసులో తీర్పునిచ్చిన బెంచ్‌లో ఈయన కూడా ఒకరు. 2021 డిసెంబర్ 26న హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆల్ ఇండియా అడ్వకేట్స్ కౌన్సిల్(ఏబీఏపీ) సమావేశంలో నజీర్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇది వివాదాస్పదమైంది. ఈ కౌన్సిల్ సంఘ్ పరివార్‌కు చెందినది’’ అని తన ఫేస్‌బుక్ పోస్టులో చెప్పారు.

    కర్నాటకకు చెందిన జస్టిస్ నజీర్, జనవరి 4న పదవీ విరమణ పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు నజీర్ పలు కీలక నిర్ణయాలను తీసుకోవడంలో భాగస్వామ్యమయ్యారు.

    2019 నవంబర్‌లో అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో ఏకైక ముస్లిం జడ్జి ఈయనే.

    త్రిపుల్ తలాఖ్ చట్టవిరుద్ధమైనదిగా సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులో కూడా నజీర్ పాలుపంచుకున్నారు.

    సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, నజీర్ కర్నాటక రాష్ట్రంలో 1958, జనవరి 5న జన్మించారు.

    1983లో కర్నాటక హైకోర్టులో న్యాయవాదిగా ఆయన తన వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించారు. 2003లో కర్నాటక హైకోర్టులో అదనపు జడ్జిగా కూడా పనిచేశారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు.

  7. మహిళల టీ20 ప్రపంచ కప్: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత జట్టు లక్ష్యం 150 పరుగులు

    మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

    కెప్టెన్ బిస్మా మరూఫ్ అద్భుత ప్రదర్శనతో అర్థ సెంచరీ చేశారు.

    అంతకుముందు టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 10 పరుగులకు చేరుకోగానే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ మరూఫ్ రన్ రేట్‌ను ముందుకు నడిపించారు. ఆమె 55 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

    పాక్ జట్టులో ఆయేషా నసీమ్ 43 పరుగులు, మునీబా అలీ 12 పరుగులు, సిద్రా అమీన్ 11 పరుగులు చేశారు. జవేరియా ఖాన్ 8 పరుగులు చేయగా, నిదా దార్ డకౌట్ అయ్యారు.

    భారత జట్టులో రాధా యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.

    మ్యాచ్ గెలవటానికి 150 పరుగుల టార్గెట్‌ను ఛేదించటానికి భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది.

    ఓపెనింగ్ బ్యాట్స్‌వుమన్ యస్తిక భాటియా (11), షఫాలి వర్మ (5) క్రీజులో ఉన్నారు. మూడు ఓవర్లు ముగిసే సరికి స్కోరు 17 పరుగులుగా ఉంది.

  8. టీ20 మహిళల ప్రపంచ కప్: టాస్ గెలిచి, బ్యాటింగ్ చేస్తోన్న పాకిస్తాన్

    టీ20 మహిళల ప్రపంచ కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలుచుకుని, బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌ను భారత్, పాకిస్తాన్ దేశాల జట్లు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఆడుతున్నాయి.

    భారత్ టీమ్ తరఫున హర్మాన్‌ ప్రీత్ కౌర్(కెప్టెన్), షెఫాలి వర్మ, యస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఆడుతున్నారు.

    పాకిస్తాన్ టీమ్‌లో బిస్మా మరుఫ్(కెప్టెన్), జవేరియా వాదూద్, మునీబా అలీ(వికెట్ కీపర్), నిదా దర్, సిద్రా అమిన్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమన్ అన్వర్, నశ్రు సుంధు, సదిఖ్ ఇక్బాల్ ఉన్నారు.

  9. స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్: రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్ చూస్తే కళ్లు పోతాయా? హైదరాబాద్ యువతి సమస్యపై డాక్టర్ ట్వీట్ వైరల్

  10. ఆరోగ్యవంతమైన ఆహారం: ఈ ‘సూపర్ ఫుడ్స్’ మనకు చాలా చౌకగా దొరుకుతాయి.. తింటున్నారా? లేదా?

  11. మహిళల టీ20 ప్రపంచ కప్: భారత్ – పాక్ జట్ల మధ్య తొలి మ్యాచ్ నేడు

    మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం తొలి మ్యాచ్ జరుగనుంది.

    మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. డాషింగ్ మ్యాట్స్‌వుమన్, వైస్ కెప్టెన్ స్మృతి మందన చేవి వేలికి గాయం కావటంతో ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.

    దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

    భారత్, పాకిస్తాన్ మహిళల జట్లు ఇప్పటివరకూ 13 టీ20 మ్యాచ్‌లలో తలపడ్డాయి. వీటిలో 10 మ్యాచ్‌లలో భారత జట్టు గెలిచింది. పాకిస్తాన్ మూడు సార్లు గెలిచింది.

  12. మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పనిచేశారు: అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్

  13. మహిళా క్రీడాకారుల గురించి మీకు ఎంత తెలుసు? ఈ క్విజ్ ప్రయత్నించండి

  14. భారత మహిళా క్రికెటర్ల కష్టాలు, పడే పాట్లు వింటే ఆశ్చర్యం, బాధ కలుగుతాయి

  15. తెలంగాణ: శివుడిని అవమానించారంటూ వ్యక్తిపై దాడి, అసలేం జరిగింది?

  16. తెలంగాణలోని ప్రతి నియోజ‌వర్గంలో అధునాతన మార్కెట్లు: సీఎం కేసీఆర్

    రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజక‌వర్గంలో అధునాతన మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు కేసీఆర్.

    ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

    అన్ని జిల్లాల కలెక్టర్లకు హైదరాబాద్‌లోని మోండా మార్కెట్ చూపించామని, ఆయా జిల్లాలు, మున్సిపాలిటీలో నిర్మించేలా చూడాలని కలెక్టర్లకు సూచించినట్లు కేసీఆర్ చెప్పారు.

    శాస్త్రీయ దృక్పథంతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. కనీసం రెండు లక్షల మందికి ఒక మార్కెట్ అయినా ఉండాలనేది లక్ష్యమని అన్నారు.

    కల్తీ విత్తనాలపై స్పందిస్తూ నిందితులపై ఇప్పటికే పీడీ యాక్టులు పెట్టామని వెల్లడించారు. తెలంగాణలో కల్తీ విత్తనాల బెడద లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.

  17. శిధిలాల్లో నుంచి పుట్టిన సిరియా చిన్నారి అయా గురించి వైద్యులేమంటున్నారు

  18. లిథియం: జమ్మూ‌కశ్మీర్‌లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?

  19. అమెరికా: గగనతలంపైకి మరో 'అనుమానాస్పద వస్తువు', కూల్చేసిన మిలిటరీ విమానాలు

    అమెరికా గగనతలంపై మరో అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీంతో అమెరికా సైన్యం వాయువ్య కెనడాలోని యుకాన్ సమీపంలో దాన్ని కూల్చివేసింది. దీనిని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధ్రువీకరించారు.

    ఆ వస్తువు తమ గగనతల నిబంధనలు ఉల్లంఘించిందని, దీంతో యుకాన్ సమీపంలో దాన్ని కూల్చివేశారని ట్రూడో ప్రకటించారు.

    మొదట ఈ వస్తువును ట్రాక్ చేయడానికి అమెరికా, కెనడా విమానాలు రంగంలోకి దిగగా, అమెరికాకు చెందిన ఎఫ్-22 జెట్ ఆ వస్తువును కూల్చివేసింది.

    ఉత్తర అమెరికా గగనతలంలో అనుమానాస్పద వస్తువులు కనపడటం గత వారం రోజుల్లో ఇది మూడోసారి.

    గత శనివారం దక్షిణ కరోలినాలోని అట్లాంటిక్ తీరానికి సమీపంలో అమెరికా సైన్యం ఒక చైనా బెలూన్‌ను కూల్చివేసింది. శుక్రవారం అలాస్కా సమీపంలో గగనతలం నుంచి ఒక చిన్న కారు పరిమాణంలో తెలియని వస్తువు పడిపోయింది.

    హెలికాప్టర్లు, రవాణా విమానాలు బ్యూఫోర్ట్ సముద్రంలో గడ్డకట్టిన జలాలలో దాని శిథిలాల కోసం వెతికే పనిలో ఉన్నాయి.

    ఇప్పుడు కెనడా గగనతలాన్ని ఉల్లంఘించిన మరొక తెలియని వస్తువు రావడంతో అమెరికా దాన్ని నేలకూల్చింది. కెనడా సైన్యం దాని శిథిలాల కోసం వెతుకుతోంది.

  20. తుర్కియే, సిరియాలలో 28 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య, ఆహారం కోసం తుర్కియేలో అల్లర్లు

    భూకంపం కారణంగా తుర్కియే, సిరియాలో మరణించిన వారి సంఖ్య 28,000 దాటింది.

    కేవలం తుర్కియేలోనే 24,617 మంది మరణించినట్లు ఆ దేశ ఉపాధ్యాక్షుడు ఫుట్ ఓక్టే ప్రకటించారు.

    చాలామందిని రెస్క్యూ బృందాలు రక్షించినప్పటికీ మృతుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. కాగా, భూకంప ధాటికి తుర్కియేలో దాదాపు 6వేల భవనాలు నేలకూలాయి.

    అయితే కొన్ని గ్రూపుల మధ్య గొడవలు తలెత్తడంతో జర్మన్, ఆస్ట్రియన్ సైన్యాలు తమ రెస్క్యూ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఆహార సరఫరా తగ్గిపోవడంతో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని రెస్క్యూ బృంద సభ్యుడొకరు చెప్పారు.

    లూటీకి పాల్పడినందుకు దాదాపు 50 మందిని అరెస్టు చేశారని, పెద్ద ఎత్తున తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది.

    అయితే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి అత్యవసర అధికారాలను ఉపయోగిస్తానని తుర్కియే అధ్యక్షుడు హెచ్చరించారు.

    హటే ప్రావిన్స్‌లో గుర్తుతెలియని సమూహాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆస్ట్రియన్ ఫోర్సెస్ డిజాస్టర్ రిలీఫ్ యూనిట్‌కు చెందిన డజన్ల కొద్దీ సిబ్బంది ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి బేస్ క్యాంప్‌లో ఆశ్రయం పొందారని శనివారం నాడు ఆస్ట్రియన్ ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

    "తుర్కియేలో గ్రూపుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి" అని లెఫ్టినెంట్ కల్నల్ పియర్ కుగెల్వీస్ ఒక ప్రకటనలో తెలిపారు.

    ఆస్ట్రియా తన రెస్క్యూ ప్రయత్నాలను నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత తుర్కియే సైన్యం వారికి రక్షణగా రంగంలోకి దిగింది. రెస్క్యూ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు వీలు కల్పించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    జర్మనీకి చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ గ్రూప్ ఐఎస్‌ఏఆర్, జర్మనీ ఫెడరల్ ఏజెన్సీ ఫర్ టెక్నికల్ రిలీఫ్ (టీఎస్ డబ్ల్యూ) కూడా భద్రతా సమస్యలను పేర్కొంటూ కార్యకలాపాలను నిలిపివేశాయి.