ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ‘కొనటానికి’ బీజేపీ ప్రయత్నం చేసిందని, ఆ ఎమ్మెల్యేలతో బీజేపీ తరఫున మాట్లాడడానికే ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని పోలీసులు ఆ సమయంలో మీడియాకు తెలిపారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి దగ్గర పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో నలుగురు కార్మికులు చనిపోయారు. వారిని బి.రాంబాబు (ఖమ్మం), రాజేప్ బాబు (గుంటూరు), ఆర్.రామకిృష్ణ (కె. కోటపాడు), మజ్జి వెంకటరావు (చోడవరం)గా గుర్తించారు.
ఫార్మాసిటీలోని లారస్ కంపెనీ యూనిట్-3 లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు కంపెనీ యాజమాన్యం చెప్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాకు ప్లాష్ ఫైర్ రూంలో రియాక్టర్ కింద నుంచి ఫైర్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ఘటనలో సతీష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

ఫొటో సోర్స్, AP Police
అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా వాటిని అమ్మడంతో పాటు.. డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకి తెలిపారు.
అనంతపురం జిల్లా ఎస్‌పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'స్పెషల్ ఆపరేషన్ టీమ్స్' ఆధ్వర్యంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బళ్లారి - అనంతపురం కేంద్రంగాబెంగళూరుకు చెందిన రౌడీ షీటర్లు, కిరాయి హంతకులు గత కొంతకాలంగా ఈ దందా కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
ఈ ముఠాలోని బెంగుళూరుకు చెందిన రౌడీ షీటర్లు జంషీద్ @ ఖాన్ @ జీషన్, ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ @ రియాజ్ షేక్‌లతో పాటు.. ఆయుధాల తయారీదారుడు, డీలర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ రాజ్‌పాల్ సింగ్, మరో ఆయుధాల సరఫరాదారుడు సుతార్‌లను అరెస్టు చేశామని డీజీపీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులపైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఆయుధాలు, మందుగుండుతో పాటు మాదక ద్రవ్యాలతో ప్రయాణిస్తున్న ఒక పాకిస్తానీ బోటును, అందులోని 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అందించిన నిఘా సమాచారం ఆధారంగా ఈ బోటును పట్టుకునట్లు తీర గస్తీ దళం వెల్లడించింది.
ఈ పాకిస్తానీ బోటులో 40 కిలోల మాదక ద్రవ్యాలు ఉన్నాయని, వాటి విలువ రూ. 300 కోట్లు అని చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఆరోపణల కేసులో తెలంగాణ హైకోర్టు కీలకతీర్పు ఇచ్చింది.
ఈ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి బదిలీ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ, ఇతరులు వేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది.
బీజేపీ, మరో వ్యక్తి వేసిన పిటిషన్లను సాంకేతిక కారణాలతో తిరస్కరించి, మిగిలిన ముగ్గురు వ్యక్తులు వేసిన పిటిషన్లపై తీర్పు ఇచ్చింది.
తక్షణం కేసుని సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ నాయకుడు రామచంద్రరావు ఈ కేసు వాదించారు.
అక్టోబర్ నెలలో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌లో.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను ఒక ఆపరేషన్ ద్వారా గుర్తించినట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ‘కొనటానికి’ బీజేపీ ప్రయత్నం చేసిందని, ఆ నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ తరఫున మాట్లాడడానికే ఆ ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని పోలీసులు ఆ సమయంలో మీడియాకు తెలిపారు.
ముందుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదు కాగా తరువాత ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుత హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
అయితే తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని సిట్ దర్యాప్తు మీద తమకు నమ్మకం లేదని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. మరో నలుగురు వ్యక్తులు కూడా ఇదే వినతితో పిటిషన్లు వేశారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ చేత కేసు దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఈ పిటిషన్ల మీద ఆదివారం నాడు విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించవద్దని తెలంగాణ ప్రభుత్వం వాదించింది.
బీజేపీ, మరో వ్యక్తి వేసిన పిటిషన్లను సాంకేతిక కారణాలతో తిరస్కరించిన హైకోర్టు.. మిగిలిన ముగ్గురు వ్యక్తులు వేసిన పిటిషన్లపై తీర్పు చెప్తూ.. కేసుని తక్షణం సీబీఐకి బదలాయించాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, DPRO/Nandyal
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో గల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరాజన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్.కె.రోజా తదితరులు కూడా రాష్ట్రపతి వెంట ఉన్నారు.
మల్లికార్జున స్వామి ఆలయంలో రాష్ట్రపతి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ దేవి ఆలయంలో కుంకుమార్చన జరపించారు.
అనంతరం రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.

ఫొటో సోర్స్, DPRO/Nandyal

ఫొటో సోర్స్, DPRO/Nandyal

ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్లపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ అమలు చేయాలని ఈ లేఖలో ఆయన కోరారు. ఎవరి కోటాలోనూ కాకుండా మిగిలి ఉన్న కోటాలో కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలని సూచించారు.
ఏపీలో కాపు రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ కోటాపై ఇటీవల పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సుశ్రీ ప్రతిమా బౌమిక్ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ అంశంతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తుచేస్తూ ముద్రగడ లేఖ రాశారు.
2019లో కాపులు జగన్ వెనుకే ఉన్నారని ఈ సందర్భంగా ముద్రగడ లేఖలో తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిల తరహాలో పేదలకు మంచి చేసి వారి ప్రేమ పొందేలా పునాదులు వేసుకోవాలని జగన్‌కు లేఖలో ముద్రగడ సూచించారు.

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత తలెత్తింది. వంగవీటి రంగా వర్థంతి కార్యక్రమం నిర్వహణ విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య వివాదం దానికి కారణం.
ఈ వివాదంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో గుడివాడలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. వివాదానికి కారణం మీరంటే మీరే కారణమంటూ ఇరు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఒకవైపు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు, మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు వర్గీయులు తలపడ్డారు. ఈ వివాదం కవరేజ్ కోసం వెళ్లిన మీడియా విలేకర్ల మీద దాడి జరగడంతో కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి.
సోమవారం రంగా వర్థంతిని రాష్ట్రమంతా నిర్వహిస్తున్నారు. దానికి సన్నాహాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలోనే ఇరు పార్టీల కార్యకర్తలు తగాదాకి దిగారు.
గుడివాడలో ఇప్పటికే పలుమార్లు ఇరు పార్టీల కార్యకర్తలు తలపడ్డారు. రంగా వర్థంతి నిర్వహించేందుకు టీడీపీ కార్యకర్తలు పూనుకోగా, వారికి అర్హత లేదంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.
ఆ క్రమంలోనే కొడాలి నాని ముఖ్య అనుచరుడు కాళీ అనే వ్యక్తి రావి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి చంపుతానని బెదిరించారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘర్షణల నేపథ్యంలో సోమవారం భారీగా పోలీస్ బందోబస్తు రంగంలో దింపారు. రంగా విగ్రహం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సెక్షన్ 30 అమలులోఉందని ప్రకటించారు. పలువురు నేతలను ముందుస్తు అరెస్టులు చేశారు.

ఫొటో సోర్స్, ANI
అమృత్‌సర్‌కు సమీపంలోని రాజతాల్ ప్రాంతంలో రాత్రి 7.40 గంటల సమయంలో ఒక డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు రక్షణ దళం బీఎస్ఎఫ్ ప్రకటించింది.
పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఫెన్సింగ్ దగ్గర ఈ డ్రోన్ తాము గుర్తించినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ డ్రోన్ క్వాడ్‌కాప్టర్ అని, ఇది చైనాలో తయారైందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ డ్రోన్‌కు కెమెరా కూడా అమర్చి ఉందని, సరిహద్దుల్లో ఎగురుతుండగా, తాము మూడు రౌండ్లు కాల్పులు జరిపి దీనిని కూల్చి వేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఇంకా ఈ ప్రాంతంలో ఇలాంటి డ్రోన్ ఉన్నాయేమో గుర్తించేందుకు తాము సోదాలు నిర్వహిస్తున్నట్లు భద్రాధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
గత 24 గంటల్లో 43 చైనా యుద్ధ విమానాలు తైవాన్ సముద్ర భూభాగం మీదుగా చక్కర్లు కొట్టి నిబంధనలు ఉల్లంఘించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
ఈ ఘటనలో మొత్తం 71 చైనా విమానాలు పాల్గొన్నట్లు తెలిపింది.
ఈ విమానాలు తైవాన్ గల్ఫ్‌ను రెండు భాగాలుగా విభజించే ఊహాత్మక మధ్యస్థ రేఖను దాటాయని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.
ఈ ఘటనపై చైనా స్పందిస్తూ తైవాన్ చుట్టుపక్కల సముద్ర, గగనతలంలో గత ఆదివారం 'స్ట్రైక్ డ్రిల్స్' నిర్వహించినట్లు స్పష్టంచేసింది. తైవాన్, అమెరికా రెచ్చగొట్టే చర్యల కారణంగా ఈ కసరత్తులు జరిగాయని చైనా పేర్కొంది. తైవాన్ తన భూభాగమని చైనా చెప్పింది.
అయితే చైనా వాదనను తైవాన్ ఖండించింది. తమ ప్రజలను భయపెట్టి, వారి శాంతికి భంగం కలిగించేలా చైనా ప్రయత్నించేటట్లు ఈ డ్రిల్స్ ఉన్నాయని తైవాన్ ఆరోపించింది. తమ దేశ సమీపంలో చైనా నేవీకి చెందిన ఏడు నౌకలు కూడా కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
చైనా యుద్ధ విమానాలు కనిపించడంతో తమ యుద్ధ విమానాలు వారిని హెచ్చరించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా క్షిపణి వ్యవస్థలను తైవాన్ సిద్ధంగా ఉంచింది.
గత కొన్నేళ్లుగా తన పాలనను అంగీకరించాలని తైవాన్‌పై చైనా ఒత్తిడి చేస్తోంది. అయితే, తాము శాంతిని కోరుకుంటున్నామని, చైనా దాడి చేస్తే తమను తాము రక్షించుకుంటామని తైవాన్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.