నేటి లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శనివారం నాడు చెన్నైలోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును 120 పరుగుల తేడాతో భారత జట్టు ఓడించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
వాలెన్సియాలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టును 1-0 గోల్స్‌తో ఓడించింది.
ఈ గెలుపుతో భారత మహిళల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ 2023-24 కు అర్హత సాధించింది.
భారత జట్టులో గుర్జీత్ కౌర్ ఐదో నిమిషంలో గోల్ సాధించింది.
ఆ తర్వాత ఆతిథ్య జట్టు పలుమార్లు గోల్ చేయటానికి ప్రయత్నించినప్పటికీ భారత డిఫెన్స్‌ను ఛేదించటంలో విఫలమైంది.
ఈ ఏడాది బర్మింఘామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు కాంశ్య పతకం గెలిచింది.
అంధుల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భారత జట్టు విజేతగా నిలిచింది.
భారత అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవటం ఇది మూడోసారి.
శనివారం నాడు చెన్నైలోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును 120 పరుగుల తేడాతో భారత జట్టు ఓడించింది.
భారత జట్టు 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, బ్యాట్స్‌మన్ సునీల్ రమేష్‌లు సెంచరీలు చేశారు.
ఈ టోర్నమెంటు మొత్తం మీద భారత జట్టు ఓటమి లేకుండా అజేయంగా జైత్రయాత్ర సాగించింది.
బి3 కేటగిరీలో సునీల్ రమేష్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ప్రకటించారు.
బి2 కేటగిరీలో అజయ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎంపికవగా, బీ1 కేటగిరీలో బంగ్లా క్రికెటర్ మొహమ్మద్ మహమూద్ మ్యాన్ ఆఫ్ ది సరీస్‌గా నిలిచారు.
అంధుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంటులో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జట్టు పట్ల దేశం గర్విస్తోందని చెప్పారు.
తాజాగా కొందరు జర్నలిస్టుల ట్విటర్ ఖాతాలను నిలిపివేసిన ఎలాన్ మస్క్, మళ్లీ వాటిని పునరుద్ధరించారు.
తన ‘వ్యక్తిగత వివరాలను బయట పెడుతున్నారు’ అంటూ వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌ఎన్ వంటి సంస్థలకు చెందిన కొందరు జర్నలిస్టుల ఖాతాలను ట్విటర్ బాస్ నిలిపివేశారు.
అయితే ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ నేపథ్యంలో సస్పెండ్ చేసిన ఖాతాలను మళ్లీ ట్విటర్ పునరుద్ధరించింది.
నరేంద్ర మోదీ మీద పాకిస్తాన్ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
జమ్మూ, ఒడిశా, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు, ‘పాకిస్తాన్ క్షమాపణలు’ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు. కానీ గుజరాతీల ప్రాణాలు తీసిన వ్యక్తి మాత్రం బతికే ఉన్నాడు. ఆయనే భారత ప్రధాని.
ఆయన ప్రధాని అయ్యేంత వరకు తమ దేశంలోకి అడుగుపెట్టనియ్యకుండా అమెరికా నిషేధించింది’ అంటూ బిలావల్ బుట్టో అన్నారు.
‘పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రం’ అంటూ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ అన్న నేపథ్యంలో బిలావల్ బుట్టో ఆ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌కు చెందిన సోషల్ మీడియా యాప్ ‘కూ’ ఖాతాను ట్విటర్ శుక్రవారం నిలిపివేసింది.
కూకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే @kooeminence అనే ట్విటర్ హ్యాండిల్‌ను సస్పెండ్ చేసినట్లు ఆ సంస్థ కొ-ఫౌండర్ మయాంక్ బిదవత్కా తెలిపారు.
తాజాగా వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌ఎన్ వంటి ప్రతికలకు చెందిన కొందరు జర్నలిస్టుల ఖాతాలను సైతం ట్విటర్ నిలిపివేసింది.
ట్విటర్ తీసుకున్న ఈ నిర్ణయాలను ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి.
బిల్కిస్ బానో రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయడం మీద వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
1992 నాటి రెమిషన్ ఆఫ్ కన్విక్ట్స్ విధానం కింద దోషులను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గతంలో గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఆ తరువాత జీవితకాల శిక్ష అనుభవిస్తున్న దోషులను ‘మంచి నడవడిక’ ప్రాతిపదికన విడుదల చేస్తూ గుజరాత్ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.
మాచర్లలో జరిగిన ఘటనకునిరసనగా పల్నాడు జిల్లాలో తెలుగు దేశం(టీడీపీ) పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి.
వినుకొండ తెలుగు దేశం పార్టీ కార్యాలయం వద్ద పోలీసులకు ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది.
తెలుగుదేశం పార్టీ నేత, వినుకొండ మాజీ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు రోడ్డుపై బైఠాయించారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఇప్పటికే మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా డీఐజీ త్రివిక్రమ్‌ను మాచర్లకు పంపారు.
శుక్రవారం రాత్రి మాచర్లలో వైసీపీ, తెలుగుదేశంపార్టీ కార్యకర్తల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రిసుమారు 1-2 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు బాలికలు ఉన్నారు.
మందమర్రి పోలీసులు అందించిన వివరాల ప్రకారం...
రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇంట్లో నుంచి మంటలు రావడం చూసి చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా మంటలు ఇల్లంతా వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు మంటల్లో కాలిపోయారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
మృతుల్లో ఇంటి యజమాని మాసు శివయ్య(50),అతని భార్య పద్మ , కూతురు వరుస అయ్యే సమీప బంధువు మౌనిక(35), ఆమె కూతుర్లు హిమబిందు(2), స్వీటీ(4)లతో పాటు శాంతయ్య అనే మరో వ్యక్తి ఉన్నారు.
ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావ్: శివయ్య భార్య పద్మకు శాంతయ్యకు వివాహేతర సంబంధం ఉంది
‘తెల్లవారు జాము ఒంటి గంట ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా బయటి నుంచి ఇంటికి ఎవరైనా నిప్పు పెట్టారా అనేది తేలాల్సి ఉంది. దర్యాప్థు కొనసాగుతోంది.గూనపెంకులు, కలప తో నిర్మించిన ఇల్లు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంట్లో దీపాల వల్ల మంటలు అంటుకున్నాయా అన్న కోణంలోనూ విచారిస్తున్నాం.
ఇంటి యజమాని శివయ్య కు పాత పగలు లేవని ప్రాథమికంగా తేలింది. విచారణ కొనసాగుతోంది’ అని మందమర్రి పోలీస్ స్టేషన్ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావ్ బీబీసీకి తెలిపారు.
‘శివయ్య భార్య పద్మకు, శాంతయ్యకు కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. కొంతకాలంగా శాంతయ్య పద్మ కుటుంబంతోనే ఉంటున్నారు.
శాంతయ్య భార్యకు శివయ్య కుటుంబానికి నేరుగా అయితే ఎటువంటి గొడవలు లేవు. కానీ పద్మతో ఉన్న సంబంధం వల్ల శాంతయ్యకు ఆయన భార్యకు గొడవలు జరుగుతున్నాయి. శాంతయ్యను వెనక్కి తీసుకెళ్లాలని ఆయన భార్య ప్రయత్నిస్తోంది.
ఈ కోణంలో కూడా విచారిస్తున్నాం’ అని ప్రమోద్ రావ్ అన్నారు.
ఈ ఘటన మీద మందమర్రి పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండంపేటకు చెందిన మౌనిక గత మూడు రోజుల క్రితం తన పిన్ని ఇంటికి వచ్చింది. ఈ ప్రమాదంలో తన ఇద్దరు కూతుళ్లతో సజీవ దహనమయ్యారు.
ప్రమాదంలో మరణించిన శాంతయ్య సింగరేణి కార్మికుడుగా పనిచేస్తున్నారు.
మాచర్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ‘ఛలో మాచర్ల’కు పిలుపునిచ్చిన టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనేక మంది నేతలను ముందస్తుగానే నిర్బంధంలోకి తీసుకుంటున్నారు.
కొందరు జర్నలిస్టుల ఖాతాలను ట్విటర్ నిలిపివేయడాన్ని ఐక్యరాజ్యసమితి విమర్శించింది.
‘ఎలాన్ మస్క్’ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడిస్తున్నారనే ఆరోపణలతో న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రిలకు చెందిన కొందరి జర్నలిస్టుల ఖాతాలను ట్విటర్ నిలిపివేసింది.
దీన్ని తప్పుపట్టిన ఐక్యరాజ్యసమితి, మీడియా స్వేచ్ఛ అనేది ‘ఆడుకునే బొమ్మ కాదు’ అంటూ ట్వీట్ చేసింది. మీడియా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య సమాజాల్లో ఎంతో ముఖ్యమని ఐక్యరాజ్యసమితికి చెందిన మెలిస్సా ఫ్లెమింగ్ అన్నారు.
ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కూడా ట్విటర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది.
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం సాయంత్రం టీడీపీ , వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 'ఇదేం ఖర్మ' కార్యక్రమాన్ని మాచర్లలో పాలక పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఘర్షణ చెలరేగింది.
నేడు కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ విధించారు. అదనపు బలగాలను రంగంలో దింపారు. స్వయంగా జిల్లా ఎస్పీ కూడా మాచర్లలో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మాచర్ల రింగ్ రోడ్డు నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి నాయకత్వంలో సాగుతున్న ప్రదర్శనను వడ్డెర కాలనీవైపు రానిచ్చేది లేదంటూ మొండికేశారు. దాంతో, టీడీపీ కార్యకర్తలు ఎదురుతిరిగారు. తమ కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదంటూ నిరసనకు దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లతో కొట్టుకున్నారు. కొందరు కార్యకర్తలు గాయపడ్డారు.
ఆ సమయంలో పోలీసుల తీరుని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. చోద్యం చూడడం తప్ప శాంతియుతంగా సాగుతున్న తమ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవకాశం కల్పించలేదని టీడీపీ నాయకుడు బ్రహ్మారెడ్డి ఆరోపించారు. అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు.
కొద్దిసేటికి టీడీపీ నేత బ్రహ్మారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత ఘర్షణ మరింత తీవ్రమయ్యింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు. రాత్రి 8 గంటల సమయంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. టీడీపీ ఆఫీసుకి నిప్పుపెట్టారు. దాంతో, మాచర్ల పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదంతా ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగిన గొడవలంటూ పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు ముడిపెట్టవద్దన్నారు. 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఫ్యాక్షన్ ఆధిపత్య పోరులో వివాదం తలెత్తగానే, తాము జోక్యంచేసుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చామని అన్నారు.
మాచర్ల ఘటనను టీడీపీ తీవ్రంగా ఖండించింది. నరసరావుపేటలో ఆందోళనకు సిద్ధమవుతోంది. మరోవైపు టీడీపీ కార్యకర్తలే చంద్రబాబు ఆదేశాలతో మాచర్లలో ఘర్షణలకు దిగుతున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
శనివారం ఉదయం పట్టణంలో 144సెక్షన్ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు. పట్టణంలో అన్ని కూడళ్లలోనూ పోలీసులు కనిపిస్తున్నారు.