ధన్యవాదాలు
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కవితకు.. దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదు కాపీలు, కేసు పత్రాలను తనకు అందించాలని కవిత తాజాగా సీబీఐకి లేఖ రాశారు.
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
‘‘నేను విఫలమైన రాజకీయవేత్తని.. ప్రస్తుతానికి...’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే తన వైఫల్యం పట్ల తను చింతించటం లేదన్నారు. ఎందుకంటే వైఫల్యమనేది విజయానికి సగం దూరమని అభివర్ణించారు.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా శనివారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పవన్ కల్యాణ్ ఇంగ్లిష్‌లో ప్రసంగించారు.
‘‘నేను ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ని... ప్రస్తుతానికి. కానీ దీని గురించి నేను బాధపడటం లేదు. ఎందుకంటే వైఫల్యమనేది విజయానికి సగం దూరం. నా వైఫల్యాలను నేను మంచిగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఏదో ఒకటి సాధించాను” అని ఆయన పేర్కొన్నారు.
‘‘సమాజంలో మార్పు చూడాలని కోరకుంటూ ఏమీ చేయకుండా కూర్చునే చాలా మంది లాగా కాదు నేను. వాళ్లు తమ సౌకర్యవంతమైన కుర్చీల్లో కూర్చుంటారు. ప్రతి పనికిరాని అంశం మీదా వారికి అభిప్రాయాలు ఉంటాయి. అన్నిటి గురించీ మాట్లాడుతుంటారు. కానీ ఏమీ చేయరు. నేను ఏదో ఒకటి చేస్తున్నాను. అయినా విఫలమవుతున్నాను. దాని గురించి నేను చింతించను. ఎందుకంటే నేను ప్రయత్నం చేశాను’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ప్రవీణ్ రాయ్ చేసిన ఫిర్యాదు కాపీలను, సంబంధిత కేసు పత్రాలను తనకు అందించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవిత శనివారం నాడు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె అయిన కవితకు.. దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.
‘‘దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అక్కడి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై దాఖలైన కేసులో వెలుగు చూసిన వాస్తవాలు కొన్ని మీకు ఈ కేసుతో సంబంధం ఉండవచ్చని సూచిస్తున్నాయి. దర్యాప్తు ప్రయోజనాల రీత్యా ఆ వాస్తవాలకు సంబంధించి మిమ్మల్ని ప్రశ్నించవలసిన అవసరం ఏర్పడింది’’ అని సీబీఐ తన నోటీసులో పేర్కొంది.
అందుకని, డిసెంబర్ 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు దిల్లీ లేదా హైదరాబాద్‌లో ఎక్కడ వీలవుతుందో దయచేసి తెలపాలని కూడా సీబీఐ కోరింది.
సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద వివరణ కోరుతూ సీబీఐ తనకు నోటీసులు జారీ చేసిందని కవిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీబీఐ కోరిన విధంగా తాను హైదరాబాద్‌లోని తన నివాసంలో డిసెంబర్ 6వ తేదీన అధికారులను కలుసుకుంటానని చెప్పినట్లు కూడా కవిత వెల్లడించారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదు వివరాలు, కేసు పత్రాలను తనకు అందించాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థకు కవిత శనివారం లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని మీడియాకు విడుదల చేశారు.
సీబీఐ ప్రశ్నలకు తాను తగిన సమాధానాలు ఇవ్వటానికి వీలుగా ఆ పత్రాలను వీలైనంత త్వరగా అందించాలని, ఆ పత్రాలు తనకు అందిన తర్వాత విచారణ సమావేశం తేదీ, సమయాలను నిర్ణయించ వచ్చునని ఆ లేఖలో కవిత కోరారు.
దేశ రాజధాని దిల్లీ నగరంలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ నిర్దోషి అని దిల్లీ కోర్టు ప్రకటించింది.
సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సందర్భంలో 2020 ఫిబ్రవరిలో దిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దిల్లీ ఈశాన్య ప్రాంతంలో జరిగిన మత అల్లర్లలో 53 మంది చనిపోయారు. మృతుల్లో 40 మంది ముస్లింలు, 13 మంది హిందువులు ఉన్నారు.
ఈ అల్లర్లకు సంబంధించి ఉమర్ ఖాలీద్, ఖాలీద్ సైఫీలను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అల్లర్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు ప్రత్యక్ష ఆధారాలేవీ లేవని దిల్లీ కడ్‌కడ్‌దూమా కోర్టు పేర్కొంది. ఈ కేసులో వీరిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.
అయితే.. కోర్టు నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ.. ఉమర్ ఖాలీద్, ఖాలీద్ సైఫీలు యూఏపీఏ కింద నమోదైన కేసులో జైలులోనే ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంటి దగ్గర జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు.
చనిపోయిన వారిలో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత రాజ్‌కుమార్ మన్నా కూడా ఉన్నారు. రాజ్‌కుమార్ సోదరుడు దేవ్ కుమార్ కూడా చనిపోయారు. శుక్రవారం రాత్రి ఈస్ట్ మెదినీపుర్ జిల్లాలోని కాంతీలో ఈ ఘటన జరిగింది.
బాంబు పేలిన ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సమావేశం శనివారం జరగాల్సి ఉంది.
ప్రతిపక్ష నేత సుభేందు అధికారి ఇల్లు కూడా ఘటనా స్థలానికి కాస్త దగ్గర్లోనే ఉంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే వన్డే సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయం కారణంగా వైదొలిగాడు.
శిక్షణ కార్యక్రమంలో షమీ భుజానికి గాయం అయినట్లు బీసీసీఐ తెలిపింది. దాంతో షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో షమీ ఉన్నాడు.
విద్యార్థిని మీద అత్యాచారానికి ప్రయత్నించారనే ఆరోపణలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
థాయిలాండ్‌కు చెందిన యువతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. హిందీ ప్రొఫెసర్ రవి రంజన్ తన మీద లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆమె గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువతి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు మాదాపుర్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు.
విద్యార్థి సంఘాల నిరసన
అయితే ఈ ఘటన మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాలకు ఆందోళనకు దిగాయి. వెంటనే ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
నిన్న రాత్రి ఘటన జరిగా ఇంత వరకు యూనివర్సిటీ యాజమాన్యం స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.
గూగుల్ సీఈఓ సుందర పిచాయ్‌కు పద్మ భూషణ్ అవార్డును అందించారు అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్.
శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆల్ఫాబెట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
‘గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్‌కు పద్మ భూషణ్ అవార్డును అందించడం చాలా సంతోషంగా ఉంది’ అని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూ అన్నారు.
‘నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన భారత్ నుంచి ఈ గౌరవం పొందడం చాలా సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను’ అని ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ అన్నారు.
ఈ ఏడాది జనవరిలో పద్మ పురస్కారాలను ప్రకటించారు. సుందర్ పిచాయ్‌తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు కూడా పద్మభూషణ్ ప్రకటించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.