ఉత్తర కొరియా తమది అణ్వాయుధ దేశమని ప్రకటించింది. ఆ మేరకు కొత్త చట్టాన్ని ఆమోదించిందని ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది.
ఈ నిర్ణయం "తిరుగులేనిది" అని, అణు నిరాయుధీకరణపై ఎటువంటి చర్చలకు అవకాశాలు లేవని ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు.
దేశ రక్షణ కోసం ముందస్తు అణు దాడి చేసే హక్కును కూడా ఈ చట్టంలో జోడించారు.
అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ నార్త్ కొరియా 2006, 2017 మధ్య ఆరు అణు పరీక్షలను నిర్వహించింది.
ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ, ఉత్తర కొరియా తమ సైన్య సామర్థ్యాలను విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా, తమ పొరుగు దేశాలను బెదిరించడానికి, అమెరికాను గురిపెట్టగల పరిధిలోకి తీసుకురావడానికి అణు పరీక్షలు జరుపుతూనే ఉంది.
కిమ్ 2019లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రెండుసార్లు సమావేశమయ్యారు కానీ, చర్చలు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. ఆ తరువాత కూడా నార్త్ కొరియా లాంగ్-రేంజ్ క్షిపణులు, అణుపరీక్షలు నిర్వహించింది. అయితే, ఇరు దేశాల మధ్య చర్చలు అక్కడితో నిలిచిపోయాయి.
నార్త్ కొరియాతో చర్చలకు సుముఖంగా ఉన్నట్టు బైడెన్ ప్రభుత్వం సూచించింది. కానీ, బైడెన్, కిమ్‌తో ముఖాముఖి సమావేశమవుతారో లేదో చెప్పలేదు.
ఇదిలా ఉండగా, అమెరికా గత ఏడాది ఉత్తర కొరియా విధానాన్ని సమీక్షించింది. కొరియా ద్వీపకల్పంలో "పూర్తి అణు నిరాయుధీకరణే" లక్ష్యమని నొక్కి చెప్పింది.
మరోవైపు, ఈ ఏడాది కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగాయి. నార్త్ కొరియా పలు బాలిస్టిక్ క్షీపణి పరీక్షలు జరిపింది. దాంతో, సౌత్, నార్త్ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
అయితే, సౌత్ కొరియా, అమెరికా సంయుక్తంగా పలు క్షిపణి పరీక్షలు, భారీ సైనిక విన్యాసాలతో ప్రతిస్పందించాయి.