ధన్యవాదాలు
ఈ పేజీలో లైవ్ అప్‌డేట్స్ ముగిశాయి.
తాజా సమాచారం, విశ్లేషణలు, ఆసక్తికరమైన కథనాల కోసం బీబీసీ న్యూస్ తెలుగును ఫాలో అవ్వండి.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మొదటి వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 111 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.
ఈ పేజీలో లైవ్ అప్‌డేట్స్ ముగిశాయి.
తాజా సమాచారం, విశ్లేషణలు, ఆసక్తికరమైన కథనాల కోసం బీబీసీ న్యూస్ తెలుగును ఫాలో అవ్వండి.
మొదటి వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 111 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సాధించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ 18.4 ఓవర్లలోనే 114 పరుగులు చేశారు.
రోహిత్ శర్మ 58 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 76 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 54 బంతుల్లో నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేశారు.
మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో ఇంగ్లండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.
అయితే, ఆ జట్టు అనూహ్యరీతిలో 25.2 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
నలుగురు బ్యాటర్లు డకౌట్ అవ్వగా, నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.
ఇంగ్లండ్ జట్టులో అత్యధికంగా కెప్టెన్ జోస్ బట్లర్ 32 బంతుల్లో ఆరు ఫోర్ల సహాయంతో 30 పరుగులు చేశాడు.
జస్‌ప్రీత్ బుమ్రా 7.2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీయగా, మొహమ్మద్ షమీ 7 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 5 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
బుమ్రా తీసిన ఆరు వికెట్లలో నాలుగు బౌల్డ్ ఔట్‌లు. వేసిన 7.2 ఓవర్లలో మూడు ఓవర్లు మెయిడెన్లు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమెకు స్వాగతం పలికారు.
గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికచేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ కూడా ఆమెకే మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్మును గెలిపిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
సామాజిక న్యాయంవైపు నిలబడిన ప్రభుత్వం తమదని, చేతల్లోనే ఆ విషయాన్ని చూపించామని, మరో అడుగు ముందుకేస్తూ ద్రౌపది ముర్మును ఎన్నుకుంటామని తెలిపారు.
ఈనెల 18వ తేదీన జరిగే ఎన్నికలో ఏ ఒక్కరూ తప్పకుండా ఓటు వేసేలా పార్టీ విప్‌లు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతూ ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల నాయకులతో భేటీ అవుతున్నారు.
ఆ క్రమంలో మంగళవారం ఆమె ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.
ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్, ఆయన భార్య భారతీ రెడ్డిలు తమ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు.
ద్రౌపది ముర్ము పర్యటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
బీమా కోరెగామ్ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు అనారోగ్య పరిస్థితుల రీత్యా మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు పొడిగించింది.
వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్‌పై జూలై 19న విచారిస్తామని జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
ఎన్ఐఏ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, ఈకేసును రేపటికి వాయిదా వేయాలని కోరారు. బాంబే హైకోర్టు, వరవరరావుకు ఇచ్చిన మెడికల్ బెయిల్ నేటితో ముగుస్తుందని, దీన్ని పొడిగించవచ్చని అన్నారు.
దీనికి రావు తరఫున వాదిస్తోన్న సీనియర్ అడ్వొకేట్ ఆనంద్ గ్రోవర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
దీంతో ఈ కేసును జూలై 19కి వాయిదా వేస్తూ సుప్రీం కోర్టు ఆయన బెయిల్‌ను పొడిగించింది.
శాశ్వత బెయిల్ కావాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను తొలుత బాంబే హైకోర్టును తిరస్కరించింది. బాంబే హైకోర్టు తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
జార్ఖండ్ గఢ్వా జిల్లాలోని ఒక పాఠశాల తాజాగా వార్తల్లో నిలిచింది. కోర్వాడీ గ్రామంలోనున్న ఈ స్కూల్ గురించి జులై 4న ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ‘‘ఇక్కడ ఉండే ప్రజల్లో 75 శాతం మంది ముస్లింలే ఉన్నారు. కాబట్టి నిబంధనలు కూడా మాకు అనుగుణంగానే ఉండాలి’’అనే శీర్షిక ఆ వార్తకు పెట్టారు.
ఈ స్కూల్‌పై స్థానిక ముస్లింలు ఒత్తిడి తీసుకొచ్చి ప్రార్థన చేసే విధానాన్ని మార్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఇకపై చేతులు జోడించి చేసే నమస్కారానికి బదులుగా ఇక్కడి విద్యార్థులు చేతులు కట్టుకొని ప్రార్థన చేస్తారని వివరించారు.
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సుప్రీం కోర్టు పొడిగించింది.
సెప్టెంబర్ 7న జుబైర్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
జుబైర్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది.
ఒక ట్వీట్ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ మహమ్మద్ జుబైర్, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది.
మహమ్మద్ జుబైర్ ఆ ట్వీట్‌లో ముగ్గురు హిందువులను ‘ద్వేషాన్ని వెదజల్లేవారు’ అని పేర్కొన్నారు.
ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తొలి విజయం సాధించింది. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో షూటౌట్‌లో గెలుపొందింది.
షూటౌట్‌లో భారత్ తరఫున నవనీత్ కౌర్, సోనికా, నేహా గోల్స్ చేశారు. మ్యాచ్ మొత్తమ్మీద గోల్ కీపర్ సవిత ఆరు గోల్స్‌ను అడ్డుకొని అద్భుత ప్రదర్శన కనబరిచింది.
మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో విజేతను తేల్చడానికి షూటౌట్ అనివార్యమైంది.
ఇప్పటికే క్వార్టర్ అవకాశాలను కోల్పోయిన భారత జట్టు 9 నుంచి 12 స్థానాలకు జరిగే మ్యాచ్‌ల్లో తలపడుతోంది.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు కడసారి నివాళి సమర్పించడానికి మంగళవారం నాడు వేలాది మంది ప్రజలు వీధుల్లోకి తరలి వస్తున్నారు.
సమీప కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో టోక్యోలోని జోజోజి ఆలయం వద్ద షింజో అంత్యక్రియలు జరుగనున్నాయి.
టోక్యో నగరం గుండా ఆయన అంతిమయాత్ర సాగిన తరువాత బౌద్ధ ఆచారాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహిస్తారు.
67 ఏళ్ళ షింజో గత శుక్రవారం నాడు నరా నగరంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు.
షింజో అంతిమయాత్రను చూసేందుకు ప్రజల వేల సంఖ్యలో వీధుల వెంబడి బారులు తీరారు.
జపాన్‌కు అత్యంత సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్న షింజో ఒక పాలకుడిగా చెరిగిపోని ముద్ర వేశారు.
శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస తాను దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తానని బీబీసీతో చెప్పారు. పారిపోయిన దేశాధ్యక్షుడు గొటాబయ ఆ పదవి నుంచి అధికారికంగా తప్పుకున్న తరువాత తాను బరిలోకి దిగుతానని సజిత్ అన్నారు.
సజిత్ నేతృత్వంలోని సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ)పార్టీ మిత్రపక్షాలతో చర్చలు జరిపిన తరువాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు.
అనూహ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రజాందోళనలు తీవ్రంగా మారాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
దేశంలో నగదు నిల్వలు హరించుకుపోయాయి. కనీస అవసరాలైన ఆహారం, ఇంధనం, ఔషధాలు కూడా ఆ దేశం దిగుమతి చేసుకోలేకపోతోంది.
అధ్యక్షుడు రాజపక్ష తాను ఈ వారం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తదుపరి అధ్యక్షుడిని జూలై 20 ఎన్నుకుంటామని పార్లమెంట్ స్పీకర్ తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజి.
తాజా వార్తల కోసం ప్రతిరోజూ బీబీసీ తెలుగు లైవ్ పేజీని చూడండి.