You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

‘‘రైతుల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని కేంద్రం అంటోంది.. మేం చచ్చినా ఆ పని చేయం’’ – కేసీఆర్

‘‘నిరసనలు చేపడుతున్న రైతులను ఖలిస్థానీ ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. కేవలం పంజాబ్, హరియాణా, దిల్లీ, యూపీలో మాత్రమే కాదు దేశం మొత్తం రైతులు నిరసనలు చేపట్టాలని నేను కోరుతున్నాను’’అని కేసీఆర్ అన్నారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  2. నేటి ముఖ్యాంశాలు

    రైతుల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని కేంద్రం అంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వ్యాఖ్యానించారు. ‘‘చావనైనా చస్తాం కానీ, అందుకు మేం ఒప్పుకోం’’అని కేసీఆర్ చెప్పారు.

    దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో భేటీ అయ్యారు.

    పంజాబ్‌లో బోరుబావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. హోషియార్పూర్ జిల్లా బైరంపూర్ గ్రామంలో ఆరేళ్ల బాబు హృతిక్బోరుబావిలో పడిపోగా ఆయన్ను రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

    దిల్లీలోని కుతుబ్ మినార్ మూలాలు తెలుసుకునేందుకు కాంప్లెక్స్‌లో తవ్వకాలు చేపట్టాలని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)ను ప్రభుత్వం కోరినట్లు వచ్చిన వార్తలను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఖండించారు.

    అస్సాం రాష్ట్రం నౌగావ్ జిల్లాలోని బట్‌ద్రవ్ పోలీస్‌ స్టేషన్‌ను శనివారం ధ్వంసం చేసి, తగులబెట్టిన కేసులో 21 మందిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు.

  3. శ్రీలంక: చమురు అక్రమ నిల్వలపై పోలీసుల సోదాలు

    ఇంధన కొరతతో బాధపడుతున్న ప్రజలకు రాబోయే కొద్ది రోజుల్లో ఉపశమనం లభిస్తుందని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.

    విదేశాల నుంచి చమురును తీసుకొస్తున్న ట్యాంకర్లు శ్రీలంకకు చేరుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

    మరోవైపు ఇంధనం, ఎల్‌పీజీ సిలిండర్ల అక్రమ నిల్వలను నిరోధించేందుకు పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు.

    ప్రజలు, తమ అవసరాలను తీర్చుకోవడానికి బదులుగా అదనంగా పెట్రోల్, డీజిల్‌లను కొనుగోలు చేసి లాభాలకు విక్రయిస్తున్నారనే సమాచారం తమకు అందిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.

    ప్రస్తుతం శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకున్నాయి. ఇంధనం, ఆహారం, ఔషధాలు కొనుగోలు చేసేందుకు విదేశీ మారక ద్రవ్యం వారి వద్ద లేదు.

    శ్రీలంకలో విపరీతంగా కరెంటు కోత ఉండటంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసేందుకు ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది.

  4. ఇరాన్‌లో ప్రధాన సైనిక అధికారి హత్య

    ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ప్రధాన సైనిక అధికారి ఒకరు హత్యకు గురైనట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఆదివారం వెల్లడించింది.

    రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలక పదవిలోనున్న కల్నల్ సయ్యద్ ఖోదాయీ.. ఇరాక్, సిరియా యుద్ధాల్లోనూ పాల్గొన్నారు.

    టెహ్రాన్‌లోని ఆయన ఇంటి బయట గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ బైక్‌పై వచ్చి కాల్పులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

    ఇరాన్‌లోని పవిత్ర ప్రార్థనా స్థలాలకు భద్రత కల్పించే బాధ్యతను ఖోదాయీ చూసుకునేవారు.

  5. తిరుపతి సమీపంలో శేషాచలం కొండల్లో అబ్బురపరిచే తలకోన జలపాతం

  6. దోశల పెనంపై కోటింగ్ కారణంగా వీర్య కణాల ఉత్పత్తి పడిపోతుందా

  7. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే - ఏపీ మంత్రి మేరుగ నాగార్జున

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యానిది హత్యేనని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

    ‘‘దీనికి సంబంధించి ఆధారాలు కూడా దొరికాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు’’అని ఆయన అన్నారు.

    ‘‘ఎమ్మెల్సీపైనా కేసు నమోదైంది. చట్ట ప్రకారం చర్యలు తప్పవు. ఎస్సీల మీద ఎవరు దాడులకు పాల్పడిన ఉపేక్షించేది లేదు’’ అని మంత్రి అన్నారు.

    సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ఎమ్మెల్సీ చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగి ఉన్నాయని, మృతదేహంపై ఇసుక ఉందని చెబుతున్నారు.

    మృతదేహం విషయంలో బంధువులతో ఎమ్మెల్సీ తగాదా పడుతున్నట్టుగా సీసీ కెమెరా విజువల్స్‌లో కనిపించింది. కాకినాడ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ఈ పరిణామాలతో శుక్రవారం ఆందోళనలు జరిగాయి.

  8. పంజాబ్: బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడి మృతి

    పంజాబ్‌లో బోరుబావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు.

    హోషియార్పూర్ జిల్లా బైరంపూర్ గ్రామంలో ఆరేళ్ల బాబు హృతిక్బోరుబావిలో పడిపోగా ఆయన్ను రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

    హృతిక్‌ను రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు 8 గంటల పాటు శ్రమించాయి.

    ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హృతిక్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు.

  9. రైతుల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని కేంద్రం అంటోంది.. మేం చచ్చినా ఆ పని చేయం – కేసీఆర్

    రైతుల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని కేంద్రం అంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వ్యాఖ్యానించారు.

    ‘‘చావనైనా చస్తాం కానీ, అందుకు మేం ఒప్పుకోం’’అని కేసీఆర్ చెప్పారు.

    బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా మరో ఫ్రంట్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు పలు ప్రాంతీయ పార్టీల నాయకులతో కేసీఆర్ భేటీ అవుతున్నారు.

    దిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసిన తర్వాత కేసీఆర్ పంజాబ్ వెళ్లారు.

    ‘‘తెలంగాణ రాకముందు రైతులు చాలా సమస్యలతో బాధపడేవారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మేం పరిస్థితులను చక్క బెడుతున్నాం. ఇప్పుడు ఉచితంగా రైతులకు అందిస్తున్న కరెంటు నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలని కేంద్రం అంటోంది. రైతుల పొలాల్లో మీటర్లను ఇన్‌స్టల్ చేయాలని చెబుతోంది. మేం ఆ పని చేయం’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

    ‘‘నిరసనలు చేపడుతున్న రైతులను ఖలిస్థానీ ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. కేవలం పంజాబ్, హరియాణా, దిల్లీ, యూపీలో మాత్రమే కాదు దేశం మొత్తం రైతులు నిరసనలు చేపట్టాలని నేను కోరుతున్నాను’’అని కేసీఆర్ అన్నారు.

  10. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ

    దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో భేటీ అయ్యారు.

    డబ్ల్యూఈఎఫ్ హెల్త్ విభాగాధిపతి శ్యాం బిషేన్‌తోనూ జగన్ సమావేశమయ్యారు.

    రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తూ డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటుచేశారు.

    మరోవైపు సదస్సుకు వచ్చిన అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ, మహారాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేలను కూడా జగన్ కలిశారు.

  11. బోరుబావిలో పడిన ఆరేళ్ల చిన్నారి

    పంజాబ్‌లోని హోషిర్పూర్ జిల్లా బైరంపూర్ గ్రామంలో ఆరేళ్ల బాబు, బోరుబావిలో పడిపోయినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    చిన్నారిని రక్షించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు హోషిర్పూర్ డీఎస్పీ గోపాల్ సింగ్ చెప్పారు.

    ఎన్డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చామని, కాసేపట్లో వారు అక్కడికి చేరుకుంటారని, ఘటనా స్థలంలో వైద్య బృందం కూడా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

  12. ‘కిసాన్ ఆందోళన్’లో మృతిచెందిన రైతుల కుటుంబాలకు సాయం అందించిన కేసీఆర్

    గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో మృతి చెందిన సైనికులు, ‘కిసాన్ ఆందోళన్’లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ చండీగఢ్‌లో నివాళులర్పించారు.

    బాధిత కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు.

    ఆయనతో పాటు దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ కూడా ఉన్నారు.

  13. తండ్రిని చంపి, ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి పాతిపెట్టిన కొడుకు

  14. నగ్నంగా ఉండే బిలియనీర్.. సినిమాలు, విమానాలు అంటే విపరీతమైన ఇష్టం

  15. కీలక అంశాలపై కేసీఆర్, కేజ్రీవాల్ చర్చ

    తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ నివాసంలో భేటీ అయ్యారు.

    వీరిద్దరూ జాతీయ రాజకీయాలు, ఫెడరలిజం, భారత అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలు వంటి అంశాలపై చర్చించినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తమకు తెలిసిందని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

    దిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్‌తో పాటు మంతకని వి. ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, నామా నాగేశ్వర రావు, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే ఆనంద్ మెతుకు వెళ్లారు.

  16. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలను ఖండించిన కేంద్ర సాంస్కృతిక శాఖ

    దిల్లీలోని కుతుబ్ మినార్ మూలాలు తెలుసుకునేందుకు కాంప్లెక్స్‌లో తవ్వకాలు చేపట్టాలని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)ను ప్రభుత్వం కోరినట్లు వచ్చిన వార్తలను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఖండించారు.

    ‘‘అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని’’ అని కిషన్ రెడ్డి అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    దిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఉన్న కుతుబ్ మినార్, కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు భారతదేశంలో ముస్లింలు నిర్మించిన తొలి కట్టడాల్లో ఒకటి. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ తొలుత నిర్మించారు.

    కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు నిజానికి ఒక హిందూ దేవాలయమని, అక్కడ పూజలు చేసుకోవడానికి హిందువులను అనుమతించాలని కొన్ని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కోర్టులో దావా కూడా వేశాయి.

    కుతుబ్ మినార్ స్థానంలో అంతకుముందు హిందూ దేవాలయం ఉండేదా?

  17. మోదీ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ ఏమన్నారంటే...

    లండన్‌లో జరిగిన 'ఐడియా ఫర్ ఇండియా' సదస్సులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చర్చల్లో నిలిచాయి. తాజాగా ఆయన మరోసారి మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

    పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ స్పందించారు.

    ‘‘ప్రభుత్వం, ప్రజలను మోసగించడం మానేయాలి. గణనీయంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు నిజమైన ఉపశమనాన్ని కల్పించాలి. ఇక నుంచి మళ్లీ పెట్రోల్ రోజూ 0.8 రూపాయలు, 0.3 రూపాయలు పెరగవచ్చు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

    మరో కాంగ్రెస్ నేత పి. చిదంబరం కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు. చమురు ధరలను తగ్గించడం అనేది బూటకం అని ట్వీట్ చేశారు.

    ‘‘ప్రియమైన ఆర్థిక మంత్రి... మీరు ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసగిస్తారు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్‌లో రాసుకొచ్చారు.

  18. దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలో ఎందుకు నిర్మించారు?

  19. అస్సాం: పోలీస్‌ స్టేషన్‌కు నిప్పంటించిన కేసులో 21 మంది అరెస్ట్, దిలీప్ కుమార్ శర్మ బీబీసీ ప్రతినిధి

    అస్సాం రాష్ట్రం నౌగావ్ జిల్లాలోని బట్‌ద్రవ్ పోలీస్‌ స్టేషన్‌ను శనివారం ధ్వంసం చేసి, తగులబెట్టిన కేసులో 21 మందిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు.

    విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలు మోపారు.

    నిజానికి శనివారం సలానిబారి గ్రామానికి చెందిన 39 ఏళ్ల చేపల విక్రేత సఫీకుల్ ఇస్లాం, పోలీసు కస్టడీలో మరణించారు.దీంతో గ్రామస్థులు, బట్‌ద్రవ్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు.

    సామాజిక మాధ్యమాల్లో పోలీసు స్టేషన్‌పై దాడికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    ఈ కేసులో ముగ్గురు మహిళలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

    పోలీసులు లంచం డిమాండ్ చేశారని సఫీకుల్ కుటుంబం ఆరోపించింది.శుక్రవారం రాత్రి సఫీకుల్‌ను పోలీసులు తీసుకెళ్లారని, ఆ తర్వాత అతన్ని కొట్టారని, దీంతో కస్టడీలోనే ఆయన మరణించారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

    అయితే ఇవి తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు అని నౌగావ్ పోలీసులు అన్నారు.

  20. మే 23, 24 తేదీల్లో ప్రధాని మోదీ, జపాన్ పర్యటన

    భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమ, మంగళవారాల్లో జపాన్‌లో పర్యటించనున్నారని ఆదివారం ప్రధానమంత్రి కార్యాలయంను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    జపాన్ ప్రధాని ఫుమియో కుషిదా ఆహ్వానం మేరకు మోదీ అక్కడికి వెళ్లనున్నారు.

    జపాన్‌లో ఆయన క్వాడ్ నేతల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో క్వాడ్ దేశాల నేతలందరూ ఆయా దేశాల మధ్య సహాయ సహకారాలు, వాటి పురోగతి గురించి సమీక్షించనున్నారు.

    ఇండో-పసిఫిక్ రీజియన్‌లోని పరిణామాలు, పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.