You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

స్వీడన్, ఫిన్‌లాండ్‌: ‘నాటోలో చేరతాం.. సభ్యత్వానికి దరఖాస్తు చేస్తాం’

తమ దేశానికి కూడా సభ్యత్వం ఇవ్వాలని నాటోకు దరఖాస్తు చేస్తామని ఫిన్‌లాండ్‌ ప్రధాన మంత్రి సనా మారిన్, అధ్యక్షుడు సౌలి నినిస్తో ప్రకటించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్వీడన్ నాటోలో చేరేందుకు మద్దతు ఇస్తామని స్వీడన్ అధికార పార్టీ ప్రకటించింది.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. నేటి ముఖ్యాంశాలు

    అంతర్జాతీయం

    • నాటోలో చేరుతామని ఫిన్‌లాండ్ ప్రకటించింది. తమ దేశానికి సభ్యత్వం ఇవ్వాలని నాటోకు దరఖాస్తు పెట్టుకుంటామని ఫిన్‌లాండ్‌ ప్రధాన మంత్రి సనా మారిన్, అధ్యక్షుడు సౌలి నినిస్తో ప్రకటించారు.
    • ఫిన్‌లాండ్‌ నాటోలో చేరితే అది పొరపాటు అవుతుందని అంతకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
    • ఫిన్‌లాండ్ ప్రకటనకు కొన్ని గంటల తరువాత, స్వీడన్ కూడా నాటోలో చేరుతామని ప్రకటించింది. స్వీడన్ నాటోలో చేరేందుకు మద్దతు ఇస్తామని ఆ దేశ అధికార పార్టీ ప్రకటించింది. అయితే, అణ్వాయుధాలు, నాటో స్థావరాలు తమ దేశంలో ఉండాలని కోరుకోవట్లేదని ఆ పార్టీ తెలిపింది.
    • పాకిస్తాన్‌లో పెషావర్‌లోని సర్బంద్ ప్రాంతంలో సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
    • ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి ఓ కారు ప్రమాదంలో చనిపోయారు.
    • అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

    జాతీయం

    • థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది. 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేసియాపై నెగ్గి, తొలిసారి ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది.
    • థామస్ కప్ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి నజరానాగా ప్రకటించారు.
    • కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో ఉన్న కనక్షన్ తెగిపోయిందని, దీన్ని అంగీకరించి, మళ్లీ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 'నవ్ సంకల్ప్ శివిర్' ముగిసింది.
    • త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ త్రిపుర అధ్యక్షుడు మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
    • గత 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 13 మంది కోవిడ్‌తో చనిపోయారు. అయితే, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 17,692కు తగ్గింది.

    స్థానికం

    • కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో అమిత్ షా పచ్చి అబద్దాలు ఆడారని విమర్శించారు.
    • సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ పరిధిలో వాహనాల తనిఖీ చేస్తుండగా, ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి ముంబైకి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు కోదాడ పట్టణ సీఐ నరసింహారావు బీబీసీకి తెలిపారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. ఉత్తర కొరియా లాక్‌డౌన్: కోవిడ్ మహమ్మారి విజృంభణ.. మహా విపత్తుగా ప్రకటించిన కిమ్‌ జోంగ్ ఉన్

  3. తెలంగాణ: ఈ మహిళల సంస్థకు పేరు కూడా లేదు, కానీ వీళ్ల ఉత్పత్తులు అమెరికా వెళ్తున్నాయి

  4. బ్రేకింగ్ న్యూస్, స్వీడన్: నాటోలో చేరడానికి మద్దతిస్తామంటున్న స్వీడన్ అధికార పార్టీ

    స్వీడన్ నాటోలో చేరేందుకు మద్దతు ఇస్తామని ఆ దేశ అధికార పార్టీ ప్రకటించింది.

    నాటోలో సభ్యత్వానికి దరఖాస్తు పెట్టుకుంటామని పొరుగు దేశం ఫిన్‌లాండ్ ప్రకటించిన కొద్దిసేపటికే స్వీడన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

    "స్వీడన్ నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే దిశగా పార్టీ పని చేస్తుందని సోషల్ డెమోక్రాట్స్ పార్టీ బోర్డు నిర్ణయించింది" అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు

    అయితే, అణ్వాయుధాలు, నాటో స్థావరాలు తమ దేశంలో ఉండాలని కోరుకోవట్లేదని సోషల్ డెమోక్రాట్స్ పార్టీ తెలిపింది.

    "స్వీడన్ సభ్యత్వాన్ని నాటో అంగీకరించినట్లయితే, తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో స్థావరాలను మోహరించడానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతాం" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

  5. సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఎందుకు వస్తుంది? ప్రతి పౌర్ణమికి ఎందుకు ఏర్పడదు?

  6. భువనేశ్వర్ నుంచి ముంబైకి అక్రమంగా గంజాయిని తరలిస్తూ కోదాడలో పట్టుబడ్డ జంట

    సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ పరిధిలో వాహనాల తనిఖీ చేస్తుండగా, ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి ముంబైకి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు కోదాడ పట్టణ సీఐ నరసింహారావు బీబీసీకి తెలిపారు.

    ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించామని, వారిద్దరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన సూరత్ సెట్టి ( 30 సం), జ్యోత్స్నా రాణి బేహారా (19 సం.) గా గుర్తించామని కోదాడ డిఎస్పి రఘ మీడియా సమావేశంలో వెల్లడించారు.

    వీరి వద్ద నుంచి 36 కెేజీల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూరత్ శెట్టి, జ్యోత్స్నా రాణి భార్యాభర్తలు. సూరత్ శెట్టికి ఈమధ్య రోడ్డు ప్రమాదంలో కాలు విర్గింది. దానికి సర్జరీ చేయించుకోడానికి డబ్బులు అవసరమై గుర్తు తెలియని ఒక వ్యక్తిని సంప్రదించారు. గంజాయిని తీసుకువెళ్లి తాను చెప్పిన అడ్రస్‌లో ఇస్తే మీ అవసరానికి సరిపడే డబ్బులు ఇస్తానని ఆ వ్యక్తి ఈ జంటకు చెప్పారు. అందుకుని ఒప్పుకుని హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే క్రమంలో కోదాడలో పట్టుబడ్డారు.

  7. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఔరంగాబాద్‌లో ఎందుకు నిర్మించారు?

  8. రాహుల్ గాంధీ: 'ప్రజలతో మనకున్న కనక్షన్ తెగిపోయింది, దానిని మనం అంగీకరించాలి'

    ఉదయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న 'నవ్ సంకల్ప్ శివిర్' ముగింపు సమావేశం ఆదివారం జరిగింది.

    ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో ఉన్న కనక్షన్ తెగిపోయిందని, దీన్ని అంగీకరించి, మళ్లీ సంబంధాల్ను పునరుద్ధరించుకోవాలని అన్నారు.

    "ఏమీ ఆలోచించకుండా ప్రజల మధ్యకు వెళ్లి కూర్చోవాలి. వాళ్ల సమస్యలు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పూర్వం కాంగ్రెస్ పార్టీకి, ప్రజలతో ఒక సంబంధం ఉండేది. ఆ కనక్షన్ ఇప్పుడు తెగిపోయింది. దీన్ని మనం అంగీకరించాలి. మళ్లీ పాత సంబంధాలను పునరుద్ధరించేందుకు కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ పని చేయగలదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలదని ప్రజలకు తెలుసు" అని రాహుల్ గాంధీ అన్నారు.

    ఇకపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి యాత్రలు చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అక్టోబరు నెలలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రజల్లోకి వెళ్లి, యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

    "షార్ట్ కట్‌లతో ఇది జరగదు. షార్ట్ కట్స్‌లో ఈ పని చేయాలనుకుంటే కుదరదు. చెమట చిందిస్తేనే ఈ పని జరుగుతుంది. ఇది చేయగల సామర్థ్యం మనలో ఉంది. మన డీఎన్ఏలో ఉంది. మరోసారి మనం ప్రజల్లోకి వెళ్లాలి" అంటూ ఆయన పిలుపునిచ్చారు.

  9. బ్రేకింగ్ న్యూస్, నాటోలో చేరతాం.. సభ్యత్వానికి దరఖాస్తు చేస్తాం – ఫిన్‌లాండ్‌ ప్రకటన

    తమ దేశానికి కూడా సభ్యత్వం ఇవ్వాలని నాటోకు దరఖాస్తు చేస్తామని ఫిన్‌లాండ్‌ ప్రధాన మంత్రి సనా మారిన్, అధ్యక్షుడు సౌలి నినిస్తో ప్రకటించారు.

    హెల్సింకీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. నాటో సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన తమ దేశ భౌగోళిక స్వరూపంలో ఎలాంటి మార్పూ రాదని సౌలి నినిస్తో తెలిపారు.

    ఫిన్‌లాండ్‌కూ, రష్యాకూ 1300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది.

    ఫిన్‌లాండ్‌, స్వీడన్‌లు నాటో సభ్యత్వం తీసుకున్నంత ఎలాంటి సమస్యలూ తలెత్తే అవకాశాలు కనిపించట్లేదని ప్రధానమంత్రి సనా మారిన్ అన్నారు.

    తమ దేశం నాటోలో చేరేందుకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

    కాగా, ఫిన్‌లాండ్‌ నాటోలో చేరితే అది పొరపాటు అవుతుందని అంతకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.

    ఫిన్‌లాండ్‌ భద్రతకు ఎలాంటి ముప్పూ లేదని ఆ దేశాధ్యక్షుడు సౌలి నినిస్తోకు పుతిన్ హామీ ఇచ్చారు.

    నాటో సభ్యత్వం తీసుకుంటామని ఫిన్‌లాండ్‌ ప్రకటించడానికి ముందు ఇరు దేశాధ్యక్షులూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

    యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేపట్టిన నేపథ్యంలో రష్యా పొరుగు దేశమైన స్వీడన్ కూడా నాటో సభ్యత్వం తీసుకోవాలని భావిస్తోంది.

    ఫిన్‌లాండ్‌ కనుక నాటోలో చేరితే ప్రతిఘటన ఉంటుందని పుతిన్ ప్రకటించలేదు. కానీ, రష్యా విదేశాంగ శాఖ మాత్రం ప్రతిఘటన తప్పదనే సంకేతాలు ఇచ్చింది.

    ఇంతకుముందే ఫిన్‌లాండ్‌కు విద్యుత్ సరఫరాను రష్యా నిలిపివేసింది.

    కాగా, చెల్లింపుల్లో సమస్యల కారణంగానే విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు రష్యా విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటించగా.. రష్యా విద్యుత్ నిలిపివేసినందువల్ల తమకేమీ ఇబ్బందులు లేవని ఫిన్‌లాండ్‌ తెలిపింది.

  10. పాకిస్తాన్: పెషావర్‌లో ఇద్దరు సిక్కులు హత్యకు గురయ్యారు

    పాకిస్తాన్‌లో పెషావర్‌లోని సర్బంద్ ప్రాంతంలో సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

    42 ఏళ్ల సర్జిత్ సింగ్, 38 ఏళ్ల రంజిత్ సింగ్‌ సర్బంద్‌లోని బాటా తాల్ బజార్‌లో మసాలాలు అమ్మే దుకాణం నడిపేవారు. గుర్తు తెలియని దుండగులు వీరిద్దరినీ బుల్లెట్లతో కాల్చారు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.

    దాడి చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

    ఈ ఘటనను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తీవ్రంగా ఖండించారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆయన అన్నారు.

    "దేశంలో మత సామరస్యానికి, జాతీయ ఐక్యతకు భంగం కలిగించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. మాది అన్ని వర్గాలకూ చెందిన పార్టీ. సిక్కులను ఒంటరిగా వదిలిపెట్టం" అంటూ బిలావల్ భుట్టో ఒక ప్రకటన విడుదల చేశారు.

    పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందిస్తూ, "పెషావర్, ఖైబర్‌పఖ్తుంఖ్వాలో సిక్కు పౌరులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్, ఈ దేశంలో నివసించేవారందరిదీ. ఈ కేసులో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. హంతకులను కచ్చితంగా శిక్షిస్తాం" అని ట్వీట్ చేశారు.

  11. ‘అమిత్ షా కాదు.. అబద్దాలకు బాద్ షా.. మిత్ షా’ - టీఆర్ఎస్ విమర్శలు

    కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర విమర్శలు చేశారు.

    తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో అమిత్ షా పచ్చి అబద్దాలు ఆడారని విమర్శించారు.

    తెలంగాణకు వచ్చే రాజకీయ టూరిస్టులు ఇక్కడి పరిస్థితి తెలియకుండా వచ్చి, ఏర్పోర్టులు పార్టీ ఆఫీసుల్లో బిర్యానీలు తిని స్థానిక నాయకులు ఇచ్చిన స్క్రిప్టు చదివి వెళ్తున్నారని విమర్శించారు కేటీఆర్. ఆ స్క్రిప్టులో నిజానిజాలు తెలుసుకోకుండా గాలి మోటార్లలలో వచ్చి గాలి మాటలు చెబుతున్నారని విమర్శించారాయన.

    అమిత్ షా తన పేరును అబద్ధాల బాద్ షా గా మార్చుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆయన చెప్పినదాంట్లో ఒక్కటీ నిజం లేదని చెప్పారు. వాట్సప్ యూనివర్సిటీ విషయాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

    తమది అవినీతి ప్రభుత్వమన్న అమిత్ షా మాటలపై స్పందిస్తూ, సీఎం పదవి కోసం 2500 కోట్లు అడిగిన‌ట్లు క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ చెప్పిన విష‌యాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ ఆరోపణలను బీజేపీ అధిష్టానం ఖండించ‌లేదన్నారు.

    కర్ణాటక హిందూ మ‌ఠాల వ‌ద్ద 30 శాతం క‌మీష‌న్ తీసుకుంటున్నారని ఒక పీఠాధిప‌తి చెప్పిన విషయం గుర్తు చేశారు. అక్కడ అవినీతితో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు కేటీఆర్.

    27 ప్రశ్నలతో తాము రాసినలేఖకు అమిత్ సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు కేటీఆర్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధుల లెక్కలు వివరించారు.

    బీజేపీకి ఓ విధానం లేదనీ, నోటికొచ్చినట్లు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు

    బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు తెలంగాణ ఆరోగ్య మంత్రి టి హరీశ్ రావు.

    అమిత్ షా కాదు అబద్దాల షా.. అబద్దాలకు బాద్ షా.. మిత్ షా.. అంటూ విమర్శించారు హరీశ్.

    అమిత్ షా అలవోకగా అబద్దాలు మాట్లాడారనీ, అబద్దాలు చెప్పి వెళ్లారన్న హరీశ్, గుజరాత్ వలె తెలంగాణ అమాయకమైనది కాదన్నారు.

    అమిత్ షాకు దమ్ము, ధైర్యం ఉంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    ఆర్టికల్ ౩7౦ కి టిఆర్ఎస్ మద్దతు ఇవ్వడం, మిషన్ భగీరథకు నిధులు ఇచ్చామని చెప్పుకోవడం, ఆయుష్మాన్ భారత్ అమలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వంటి పలు అంశాలపై హరీశ్ ప్రశ్నలు సంధించారు.

    అమిత్ షా తెలంగాణ అమరవీరులకు నివాళి ఎందుకు అర్పించలేదని ప్రశ్నించారు.

    బీజేపీ తప్పులను లెక్కలతో సహా ఆధారాలతో సహా బయటపెడుతున్నామనీ, అది ఒక అబద్ధాల పార్టీ అనీ అన్నారు.

    దేశం కోసం ధర్మం కోసం అంటూ అబ్బదాలు చెప్పడమే బీజేపీ నినాదమని విమర్శించారు హరీశ్.

    మెదక్ జిల్లా తూప్రాన్ మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

  12. పల్నాడు జిల్లా రెంటచింతల: ‘ఈ గ్రామంలో మీరైతే గంటసేపు కూడా ఉండలేరు’

  13. నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?

  14. మే 18 వరకు పోలీస్ కస్టడీలో నటి కేత్కీ చితాలే

    నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో మరాఠీ నటి కేత్కీ చితాలేకు థానే కోర్టు మే 18 వరకు పోలీసు కస్టడీ విధించింది.

    ఆమెపై ఐపీసీ సెక్షన్లు 153 ఎ, 500, 501, 504, 34 కింద ఎఫ్ఐఆర్‌ నమోదైంది.

    ఇప్పటివరకు ఆమెకు వ్యతిరేకంగా ఐదు కేసులు నమోదయ్యాయి.

    శరద్ పవార్‌ను కించపరిచేలా ఫేస్‌బుక్‌లో ఆమె చేసిన పోస్టుపై ఎన్సీసీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం మహారాష్ట్రలోని థానే పోలీస్ స్టేషన్‌లో కేత్కీపై కేసు నమోదు అయింది.

    కేత్కీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని డిప్యూటీ సీఏ అజిత్ పవార్ అన్నారు. ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని, అయితే ఏదైనా మాట్లాడేముందు సమాజంపై ఆ మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

  15. బ్రేకింగ్ న్యూస్, థామస్ కప్ టోర్నీ : చాంపియన్ భారత్.. కోటి రూపాయల నజరానా

    థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది. 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేసియాపై నెగ్గి తొలిసారి ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది.

    థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత్ 3-0తో ఘన విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్ వరుస గేముల్లో నెగ్గి భారత్‌కు ఈ విజయాన్ని ఖాయం చేశాడు.

    ఆదివారం ఫైనల్లో భాగంగా మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ (భారత్) 21-15, 23-21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై 48 నిమిషాల్లో నెగ్గాడు.

    దీంతో మరో 2 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ విజేతగా అవతరించింది.

    అంతకుముందే లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడంతో భారత్ చివరి రెండు మ్యాచ్‌ల్ని ఆడాల్సిన అవసరం రాలేదు.

    విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

    ‘‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్‌ను భారత్ గెలుచుకోవడం పట్ల దేశం మొత్తం ఉప్పొంగిపోయింది. ఈ విజయం చాలా మంది భవిష్యత్ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుంది’’ అని ట్వీట్ చేశారు.

    కోటి రూపాయల నజరానా

    తొలిసారి థామస్ కప్ టైటిల్‌ను గెలుపొందిన భారత జట్టుకు కేంద్ర క్రీడాశాఖ భారీ నజరానాను ప్రకటించింది.

    ఈ అసమానమైన విజయానికిగానూ భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించడం గర్వంగా ఉందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

    టీమిండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

  16. థామస్ కప్ ఫైనల్: ఉత్కంఠ మ్యాచ్‌లో నెగ్గిన సాత్విక్-చిరాగ్ జోడి

    థామస్ కప్ పురుషుల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజయం సాధించే దిశగా మరో అడుగు ముందుకేసింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొంది ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది.

    ఇండోనేసియా జట్టుతో జరుగుతోన్న ఫైనల్లో భాగంగా పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి విజయం సాధించారు.

    గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 18-21, 23-21, 21-19తో మొహమ్మద్ అహ్‌సాన్-కెవిన్ సంజయ సుకముల్జో (ఇండోనేసియా)పై గెలుపొందింది.

    ఫైనల్లో భాగంగా 5 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక మరో మ్యాచ్ గెలిస్తే ఈ టైటిల్‌ భారత్ సొంతం అవుతుంది.

    సింగిల్స్ విభాగంలో జరిగే మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్, జొనాథన్ క్రిస్టీతో ఆడతాడు.

    ఈ టోర్నీ చరిత్రలో భారత్ తొలిసారి ఫైనల్‌కు చేరుకోగా, ఇండోనేసియా జట్టు ఇప్పటికి 14 సార్లు చాంపియన్‌గా నిలిచింది.

  17. కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిని ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులు

  18. బ్రేకింగ్ న్యూస్, థామస్ కప్ ఫైనల్: లక్ష్యసేన్ అద్భుత విజయం, తొలి మ్యాచ్‌లో భారత్ గెలుపు

    థామస్ కప్ పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టుకు ఫైనల్లోనూ శుభారంభం లభించింది.

    ఆదివారం ఫైనల్లో భాగంగా ఇండోనేసియా జట్టుతో భారత్ తలపడుతోంది.

    తొలి సింగిల్స్ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ప్రపంచ ఐదో ర్యాంకు క్రీడాకారుడు ఆంటోని జింటింగ్‌పై లక్ష్యసేన్ గెలుపొందాడు.

    గంటా 5 నిమిషాల జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోని సినిసుకా జింటింగ్‌పై విజయం సాధించాడు.

    తొలి గేమ్‌లో పూర్తిగా తేలిపోయిన లక్ష్యసేన్ రెండో గేమ్‌లో గెలిచి పోటీలో నిలిచాడు. మూడో గేమ్‌లో సరైన సమయంలో పుంజుకొని మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.

    ఈ విజయంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

    శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో డెన్మార్క్‌ను ఓడించిన భారత్ తొలిసారి ఈ టోర్నీ ఫైనల్లో అడగుపెట్టింది. మరో పార్శ్వం నుంచి ఫైనల్‌కు చేరుకున్న ఇండోనేసియా జట్టు ఈ టోర్నీలో 14 సార్లు చాంపియన్‌గా నిలిచింది.

  19. ‘హర్భజన్ సింగ్‌తో జరిగిన ఆ ఒక్క గొడవ ఆండ్రూ సైమండ్స్ కెరీర్‌నే నాశనం చేసింది’

  20. పిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే ఎంత ప్రమాదకరం.. ఏం చేయాలి, ఏం చేయకూడదు?