You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం

ఆహార పదార్థాలు, చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదల కనిపించింది. ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం మే 2014 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతంగా నమోదైంది.

లైవ్ కవరేజీ

  1. శ్రీలంక సంక్షోభం నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?

  2. నేటి ముఖ్యాంశాలు

    • తాజ్‌మహాల్‌లోని మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ వేసిన పిటీషన్‌ను అలహాబాద్ కోర్టు లఖ్‌నవూ బెంచ్ కొట్టివేసింది.
    • శ్రీలంకకు కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రి కావడం ఇది ఆరోసారి.
    • దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. గురువారం రోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌‌లో ద్రవ్యోల్బణం 7.79 శాతం కాగా, మార్చిలో అది 6.95 శాతంగా ఉంది.
    • నాటో కూటమిలో చేరాలని ఫిన్లాండ్ నేతలు నిర్ణయించుకున్నారు. ఈమేరకు సభ్యత్వం కోసం దరఖాస్తు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  3. విశాఖ: జీలకర్ర బెల్లం తలపై పెడుతుండగా పెళ్లిపీటల మీదే కుప్పకూలిన వధువు.. అసలేం జరిగింది?

  4. గాలిలో విమానం, అపస్మారక స్థితిలో పైలట్.. ఒక ప్రయాణికుడు ఏం చేశారంటే..

  5. సర్కారువారి పాట సినిమా ఎలా ఉంది?

  6. రణిల్ విక్రమసింఘే: గత ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు, కానీ దేశానికి ప్రధాని అయ్యారు

  7. ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం

    దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ రోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌‌లో ద్రవ్యోల్బణం 7.79 శాతం కాగా, మార్చిలో అది 6.95 శాతంగా ఉంది.

    ఆహార పదార్థాలు, చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదల కనిపించింది. ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం మే 2014 తర్వాత నమోదు కాలేదు. అప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతంగా నమోదైంది.

    ఇదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం రేటులో చాలా వ్యత్యాసం కనిపించింది. ఏప్రిల్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.21 శాతంగా ఉంది.

    రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా నాలుగు నెలల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థిర పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది.

    ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మార్చేందుకు అవకాశాలు పెరిగాయి. ఈ కారణంగా రాబోయే రోజుల్లో రుణాలు మరింత ప్రియం కావచ్చు.

  8. రణిల్ విక్రమసింఘే: శ్రీలంకకు ఆరోసారి ప్రధానిగా నియామకం

    శ్రీలంక రాజకీయాల్లో రణిల్ విక్రమసింఘే ఒక ప్రముఖ వ్యక్తి. గత పార్లమెంటరీ ఎన్నికల్లో రణిల్‌కు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, శ్రీలంక జాతీయ జాబితా పార్లమెంటరీ సభ్యత్వం ద్వారా ఆ పార్టీకి ఒక సీటు లభించింది.

    1949 మార్చి 24న నళిని విక్రమసింఘే, ఎస్మాండ్ విక్రమసింఘే దంపతులకు రణిల్ జన్మించారు. కొలంబోలోని రాయల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్, కొలంబో యూనివర్సిటీలో పీజీ చదివారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించిన రణిల్ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.

    రణిల్ విక్రమసింఘే తన రాజకీయ జీవితాన్ని గంపాహా జిల్లా నుంచి మొదలుపెట్టారు.

    1970లో యునైటెడ్ నేషనల్ పార్టీ కెలానియా, బియాగామా నియోజకవర్గాలకు ప్రిన్సిపల్ ఆర్గనైజర్‌గా నియమితులయ్యారు.

    బియాగామా నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన జేఆర్ జయవర్ధనే క్యాబినెట్‌లో మంత్రిపదవి దక్కించుకున్నారు. ఉపాధి, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

    దీనితర్వాతే ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రముఖ నేతగా ఎదిగారు.

    గత కొద్ది నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రజాగ్రహంతో అట్టుడుకుతోన్న శ్రీలంక సామాజిక-రాజకీయ సంక్షోభంలోకి దిగజారింది. దీంతో శ్రీలంకకు ఆరోసారి ప్రధానమంత్రిగా వ్యవహరించే అవకాశం రణిల్‌కు వచ్చింది. దీనికంటే ముందు గతంలో ఐదుసార్లు ఆయన శ్రీలంక ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.

  9. ‘యువరానర్... సాక్ష్యాధారాలను కోతులు ఎత్తుకెళ్లాయ్’

  10. బ్రేకింగ్ న్యూస్, శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం

    శ్రీలంకకు కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రి కావడం ఇది ఆరోసారి.

    గత కొద్దికాలంగా ఆర్ధిక సంక్షోభం, ప్రజాగ్రహంతో శ్రీలంక అట్టుడుకుతోంది.

    దేశ నాయకత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు, ఆందోళనలకు దిగారు. అనేక ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరగ్గా, తొమ్మిది మంది మరణించారు.

    ప్రజల నిరసనల నడుమ ప్రధాని మహింద రాజపక్స మే 9న తన పదవికి రాజీనామా చేశారు.

    ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటాబయ రాజపక్స గత రాత్రి రణిల్ విక్రమసింఘేను కలుసుకునికి ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా కోరారు. ఆయనను కొత్త ప్రధానమంత్రి‌గా రాజపక్స ప్రకటించారు.

    ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రణిల్ విక్రమసింఘే‌కు మహింద రాజపక్స శుభాకాంక్షలు తెలిపారు.

  11. వైజాగ్: జీలకర్ర బెల్లం పెడుతుండగా పెళ్లిపీటలపైనే కుప్పకూలిన వధువు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    జీలకర్ర బెల్లం తలమీద పెడుతున్న సమయంలో పెళ్లిపీటలపైనే వధువు కుప్పకూలిపోయారు. వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా...చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు చెప్పారు.

    ఈ ఘటన విశాఖపట్నం జిల్లా మధురవాడలో జరిగింది. పెళ్లి కుమారుడు శివాజి, పెళ్లికుమార్తె సృజనల వివాహం 11వ తేదీ (బుధవారం) సాయంత్రం 7 గంటలకు జరగాల్సి ఉంది. వరుడు విశాఖ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు. వివాహ వేడుకలో భాగంగా వధువు తలపై జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

    పోస్టు మార్టం కోసం మృత దేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ కేసును పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషపదార్థాన్ని సేవించడం వల్ల సృజన మరణించినట్టు చికిత్స చేసిన వైద్యులు తెలిపారని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

    ‘‘సృజనకు బుధవారం ఉదయమే కడుపు నొప్పి రాగా పేరెంట్స్ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లారు. నెలసరి సమస్యగా భావించి చికిత్స చేశారు. పోస్టు మార్టం రిపోర్టు, ఇతర వివరాలు సేకరించి...వాటి ఆధారంగా పూర్తి వివరాలతో కేసు దర్యాప్తు చేస్తామని’’ ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు. అయితే సృజన మరణంపై ఆమె తల్లితండ్రులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయడం లేదని వెల్లడించారు.

  12. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?

  13. తాజ్‌మహాల్: మూసి ఉన్న 22 గదులను తెరవాలన్న పిటిషన్ కొట్టివేత

    తాజ్‌మహాల్‌లోని మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ వేసిన పిటీషన్‌ను అలహాబాద్ కోర్టు లఖ్‌నవూ బెంచ్ కొట్టివేసింది.

    మూసి ఉన్న ఆ గదుల్లో హిందు దేవతల విగ్రహాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వాటిని తెరిచేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్ మీడియా ఇంచార్జ్ రజనీశ్ సింగ్ ఈ పిటీషన్ వేశారు.

    తాజ్‌మహాల్ ఒకప్పుడు శివాలయం అని వస్తున్న వార్తల మీద నిజనిర్ధారణ కమిటీ వేయాలని కూడా పిటీషన్‌లో అభ్యర్థించారు.

  14. ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా? ఇల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి

  15. నాటోలో చేరేందుకు సిద్ధమైన ఫిన్లాండ్

    నాటో కూటమిలో చేరాలని ఫిన్లాండ్ నేతలు నిర్ణయించుకున్నారు. ఈమేరకు సభ్యత్వం కోసం దరఖాస్తు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.

    రష్యాతో ముప్పు పొంచి ఉన్నందున తాము తప్పకుండా నాటోలో చేరాలని వారు అన్నారు.

    ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

    రష్యాతో ఫిన్లాండ్‌కు సుమారు 1,300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.

    నాటో కూటమిలోకి ఫిన్లాండ్‌ను ఆహ్వానిస్తామని డెన్మార్క్ తెలిపింది. ఫిన్లాండ్ రాకతో నాటో బలం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

    ఫిన్లాండ్ పొరుగు దేశమైన స్వీడన్‌ కూడా నాటో చేరడం మీద త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  16. శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన బంగారు రంగు మందిరం ఎక్కడిది?

    శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి తీరానికి కొట్టుకొచ్చిన ఈ బంగారు రంగు మందిరాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించారు. ఇది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది అనే విషయం తెలుసుకోడానికి మెరైన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  17. ప్రధాని మోదీ నేపాల్ పర్యటన

    ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం నేపాల్‌లో పర్యటించనున్నారు. ఈమేరకు మోదీని నేపాల్ ప్రధాని షేర్ బహదుర్ దేవుబ ఆహ్వానించినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది.

    భారత్, నేపాల్ మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాల మీద ఇద్దరు నేతలు చర్చించనున్నారు.

    మోదీ ప్రధాని అయ్యాక ఆయన నేపాల్‌కు వెళ్లడం ఇది అయిదో సారి. నేపాల్ పర్యటనలో భాగంగా లుంబినికి మోదీ వెళ్లనున్నారు.

    బుద్ధ జయంతి సందర్భంగా మోదీ అక్కడ ప్రసంగిస్తారు.

  18. కొడుకు ప్రాణాలు కాపాడేందుకు ఆ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే...

  19. ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌గా రాజీవ్ కుమార్

    ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఈ నెల 15న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

    ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర 14న పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  20. పెళ్ళిలో కరెంటు పోయింది... పెళ్ళికూతుళ్ళు మారిపోయారు