You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక - షెడ్యూల్ విడుదల

టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన బండ ప్రకాశ్ రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. 2018 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2021 డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆ స్థానానికి పదవీ కాలం 2024 ఏప్రిల్ 2 వరకు ఉండడంతో ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల చేసింది.

లైవ్ కవరేజీ

  1. నేటి ముఖ్యాంశాలు

    హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో అబ్బాయిని హత్య చేశారు. బుధవారం రాత్రి సరూర్ నగర్‌లో బైకు మీద వెళ్తున్న సమయంలో అమ్మాయి బంధువులు అబ్బాయి మీద దాడి చంపేశారని పోలీసులు వెల్లడించారు.ఇది కులహంకార హత్యలా అనిపిస్తోందని పోలీసులు అన్నారు.

    యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత్, ఫ్రాన్స్ మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాల మీద ఇద్దరు నేతలు చర్చించారు.

    యుక్రెయిన్‌లోని మరియుపోల్‌లో మూడు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు రష్యా ప్రకటించింది. యుక్రెయిన్ సైనికులు, పౌరులు ఈ స్టీల్ ప్లాంట్‌లో చిక్కుకుని పోయారు.

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,275 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా 55 మంది మరణించారు.

    ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేశారు. 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను జమ చేశారు.

    కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. అయితే, చాలా దేశాలు కోవిడ్ మరణాల సంఖ్యను తక్కువగా చూపించాయని ఈ సంస్థ భావిస్తోంది.

    రాజ్యసభలో తెలంగాణ నుంచి ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న ఈ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

    ఇంతటితో బీబీసీ లైవ్ పేజీని ముగిస్తున్నాం.

  2. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక - షెడ్యూల్ విడుదల

    రాజ్యసభలో తెలంగాణ నుంచి ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసింది.

    మే 12న ఈ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

    నామినేషన్లకు తుదిగడువు మే 19 కాగా మే 30న పోలింగ్ నిర్వహిస్తారు.

    మే 30 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 1న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

    టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన బండ ప్రకాశ్ రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది.

    2018 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2021 డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆ స్థానానికి పదవీ కాలం 2024 ఏప్రిల్ 2 వరకు ఉండడంతో ఎలక్షన్ కమిషన్ ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల చేసింది.

    బండ ప్రకాశ్‌కు తెలంగాణ శాసన మండలిలో సభ్యత్వం ఇవ్వడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు.

  3. భారత్‌లో 47 లక్షల మంది కోవిడ్‌తో చనిపోయారంటున్న డబ్ల్యూహెచ్‌వో, అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న ప్రభుత్వం

    కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది.

    అయితే, చాలా దేశాలు కోవిడ్ మరణాల సంఖ్యను తక్కువగా చూపించాయని ఈ సంస్థ భావిస్తోంది.

    దేశాలు వెల్లడించిన లెక్కల ఆధారంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 54 లక్షలు.

    భారత్‌లోనే 47 లక్షల మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. అధికారిక గణాంకాల కంటే ఇది 10 రెట్లు అధికమని, ప్రపంచంలోని మొత్తం కోవిడ్ మరణాల్లో మూడో వంతు భారత్‌లోనే సంభవించాయని డబ్ల్యూహెచ్‌వో అంటోంది.

    అయితే, భారత ప్రభుత్వం ఈ అంచనాలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది.

  4. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లోని సొరంగంలో 265 అడుగుల ఆక్సిజన్ పైప్

    పాకిస్తాన్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బుధవారం గుర్తించిన సొరంగంలో 265 అడుగుల ఆక్సిజన్ పైప్ లభించింది.

    దీనిపై దర్యాప్తు జరుగుతోందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.

    సాంబ ప్రాంతంలో 2 అడుగుల వెడల్పున ఉన్న ఈ సొరంగాన్ని బుధవారం గుర్తించారు.

  5. అక్టోబర్ 2 నుంచి ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర, కొత్త పార్టీ పెట్టడం లేదని ప్రకటించిన ఎన్నికల వ్యూహకర్త

    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాను కొత్త పార్టీ పెట్టడం లేదని చెప్పారు.

    కొత్తపార్టీ విషయంలో రెండుమూడు రోజుల్లో స్పష్టత ఇస్తానని చెప్పిన ఆయన తాజాగా ఆ విషయం మాట్లాడారు.

    ప్రస్తుతానికి తానేమీ పార్టీ పెట్టడం లేదని తెలిపారు.

    బిహార్ అభివృద్ధి కోసం అక్టోబర్ 2 నుంచి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు.

    రానున్న రోజుల్లో వివిధ రంగాలకు చెందిన వేలమందిని కలిసి చర్చిస్తానని, ఒకవేళ తమ సమస్యల కోసం ఒక కొత్త రాజకీయ వేదిక కావాలని బిహార్ ప్రజలు కోరితే అప్పుడు పార్టీ పెట్టే విషయం ఆలోచిస్తానని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

  6. నవనీత్ కౌర్ రాణా జైలు నుంచి విడుదల

    మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యారు.

    అక్కడి నుంచి ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం లీలావతి ఆసుపత్రికి తరలించారు.

    ఈ రోజు ఉదయం బొరివాలీ కోర్టు ఆమెను, ఆమె భర్త రవి రాణాను విడుదల చేసేందుకు వీలుగా రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్, రవి రాణాలు ప్రకటించిన నేపథ్యంలో ఏప్రిల్ 23న వారిని అరెస్ట్ చేశారు.

    అనంతరం బుధవారమే వీరికి బెయిల్ మంజూరైంది. కానీ, రిలీజ్ ఆర్డర్ రాకపోవడంతో విడుదల సాధ్యం కాలేదు.

    ఈ రోజు రిలీజ్ ఆర్డర్ రావడంతో జైలు నుంచి విడుదల చేశారు.

  7. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి: ‘మంచి చేస్తున్నాం కాబట్టే మాపై కడుపుమంట, పళ్లు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు’

    ‘‘పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు. అది దేశ చరిత్రను మార్చేస్తుంది. పిల్లల చదువులో అవినీతికి తావు లేకుండా డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలోనే వేస్తున్నాం’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

    తిరుపతి పర్యటనలో భాగంగా విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

    ‘‘ ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడగు వేస్తే, ఆయన నా కొడుకుగా నేను నాలుగు అడుగులు వేస్తున్నా. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనే రెండు పథకాల కోసం రూ. 10, 994 కోట్లు ఇవ్వగలిగామని గర్వంగా చెబుతున్నా. ఈ పథకాలు అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది.

    జగనన్న విద్యా దీవెన పథకం కింద జనవరి- మార్చి త్రైమాసికానికి రూ. 709 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం. దీని ద్వారా 10,85,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.

    గత ప్రభుత్వాలు ఇలా పిల్లల చదువు గురించి, వారి వసతి సదుపాయాల గురించి పట్టించుకోలేదు.

    విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు, పథకాలు తీసుకొచ్చాం. మా చర్యల ఫలితంగా విద్యావ్యవస్థలో మార్పు కనబడుతోంది.

    విద్యార్థులతో పాటు గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్న పిల్లల పౌష్టికాహారం కోసం సంవత్సరానికి 1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

    మేం మంచి చేస్తున్నాం కాబట్టే మాపై కడుపుమంట, పళ్లు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు’’ అని ఆయన ప్రసంగించారు.

    ప్రసంగం అనంతరం బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేశారు. 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ. 709 కోట్లను జమ చేశారు.

  8. హైదరాబాద్ హత్య కేసు: ‘అమ్మాయి సోదరులే రాడ్డుతో కొట్టి చంపారు’- ఏసీపీ శ్రీధర్ రెడ్డి

    ప్రేమ పెళ్లి చేసుకున్న నాగరాజును, అమ్మాయి సోదరులే రాడ్డుతో కొట్టి చంపారని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి చెప్పారని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

    ‘‘ఇద్దరు వ్యక్తులు కలిసి ఆయనను చంపారు. తన భార్యతో కలిసి బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన వీరిద్దరూ ఇటీవలే వివాహం చేసుకున్నారు. అమ్మాయి సోదరులే అతనిపై దాడి చేశారు. రాడ్డుతో కొట్టడంతో స్పాట్‌లోనే మరణించారు. ఆమె సోదరులు ఇద్దరిని నిందితులుగా గుర్తించాం. వారిని పట్టుకునే బాధ్యతను ప్రత్యేక బృందాలను అప్పగించారు’’ అని శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం... బల్లిపురం నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సుల్తానా తన పేరును పల్లవిగా మార్చుకున్నారు.

    బుధవారం వీరిద్దరూ బైక్‌పై వెళుతోన్న సమయంలో నాగరాజుపై రాడ్డుతో దాడి చేశారు. ఇది కులహంకార హత్యలా అనిపిస్తోందని గురువారం పోలీసులు తెలిపినట్లుగా ఏఎన్ఐ పేర్కొంది.

  9. భారత్‌లో గత 24 గంటల్లో 3000కి పైగా కరోనా కేసులు

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,275 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా 55 మంది మరణించారు.

    మరోవైపు 3,010 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం ఆక్టివ్ కేసులు సంఖ్య 19,719 కాగా, కరోనా కారణంగా ఇప్పటివరకు ఓవరాల్‌గా 5,23,975 మంది మృతి చెందారు.

  10. యుక్రెయిన్‌: మరియుపోల్‌లో కాల్పుల విరమణకు సిద్ధమన్న రష్యా

    యుక్రెయిన్‌లోని మరియుపోల్‌లో మూడు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు రష్యా ప్రకటించింది. అజోవస్తల్ స్టీల్ ప్లాంట్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే.

    యుక్రెయిన్ సైనికులు, పౌరులు ఈ స్టీల్ ప్లాంట్‌లో చిక్కుకుని పోయారు.

    ఈ కాల్పుల విరమణతో సుమారు 200 మంది పౌరులను బయటకు తరలిస్తారని అంచనా.

    అజోవస్తల్ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా యుక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరాటం సాగుతోంది.

  11. విగ్రహారాధనను వ్యతిరేకించిన యోగి వేమనకు గుడి ఎందుకు కట్టారు?

    నెల్లూరు సమీపంలోని పల్లిపాడు గ్రామంలో ప్రజలు యోగి వేమనకు గుడికట్టి ఆయనను దేవుడుగా భావించి పూజలు చేస్తున్నారు. ఏటా మే నెలలో ఇక్కడ గ్రామోత్సవం నిర్వహిస్తారు. ప్రతి శనివారం యోగి వేమన పద్యాలు పాడుకుంటూ భజనలు కూడా చేస్తున్నారు. ఎందుకు? విగ్రహారాధన, గుడులు గోపురాలను వ్యతిరేకించిన యోగి వేమన వారికి దేవుడెలా అయ్యారు?

  12. నేడు వెస్ట్ బెంగాల్‌‌కు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు వెస్ట్ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బీఎస్‌ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రంటైర్‌ను ఆయన సందర్శించనున్నారు.

    ఆరు ఆధునిక బార్డర్ అవుట్ పోస్టులను ఆయన ప్రారంభించనున్నారు. సిలిగురిలో జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు.

  13. నేడు తిరుపతిలో వైఎస్ జగన్ పర్యటన

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు.

    టాటా క్యాన్సర్ ఆసుపత్రి, శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (స్వీకార్)లను జగన్ ప్రారంభించనున్నారు.

    ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొననున్నారు.

  14. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ను కలిసిన నరేంద్ర మోదీ

    యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షునిగా మేక్రాన్ మరొకసారి గెలిచిన విషయం తెలిసిందే.

    భారత్, ఫ్రాన్స్ మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాల మీద ఇద్దరు నేతలు చర్చించారు. ఇతర అంతర్జాతీయ అంశాలు కూడా చర్చలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

    అలాగే ఫ్రాన్స్‌ విదేశాంగశాఖ మంత్రి జీన్‌తో భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ భేటీ అయ్యారు.

  15. హైదరాబాద్: ‘అబ్బాయిని చంపేసిన అమ్మాయి బంధువులు’

    హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో అబ్బాయిని హత్య చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన బిల్లాపురం నాగరాజు, ఘనాపూర్‌కు చెందిన సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    అయితే అమ్మాయి బంధువుల నుంచి బెదిరింపులు రావడంతో కొంతకాలం వీరు విశాఖపట్నం పారిపోయారు. ఇటీవలే వారు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు.

    బుధవారం రాత్రి సరూర్ నగర్‌లో బైకు మీద వెళ్తున్న సమయంలో అమ్మాయి బంధువులు అబ్బాయి మీద దాడి చంపేశారని పోలీసులు వెల్లడించారు.

    అమ్మాయి, అబ్బాయి మతాలు వేరు కావడమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది.

  16. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.