You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పాకిస్తాన్‌ సుప్రీంకోర్టులో ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ

నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి గత ఆదివారం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పాకిస్తాన్ సుప్రీంకోర్టు పేర్కొంది. అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. నేటి ముఖ్యాంశాలు...

    • పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ రాజ్యాంగ విరుద్ధమని పాకిస్తాన్ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ప్రకటించింది. శనివారం (ఏప్రిల్ 9వ తేదీ) ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని పాకిస్తాన్ జియో న్యూస్‌ను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
    • యుక్రెయిన్‌లోని బుచా నగరంలో మానవ హక్కుల ఉలంఘనలకు సంబంధించి.. రష్యాను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేస్తూ ఐరాస సర్వసభ్య సభ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.
    • ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని వారంతా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సీఎం జగన్‌కి అందించారు. 11వ తేదీన కొత్త క్యాబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుంది. 10వ తేదీన అధికారికంగా కొత్త మంత్రుల పేర్లు వెల్లడించబోతున్నారు.
    • కొరియా ఓపెన్‌లో పీవీ సింధూ, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ జోడి సత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ షెట్టీ కూడా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.
    • వరి ధాన్యం సమస్యను చక్కదిద్దడం చేత కాకుంటే అధికారం నుంచి దిగిపొమ్మని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ వంటి సమర్థుడైన నాయకునికి అధికారం అప్పచెబితే వారం పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

    ఇవి ఈ నాటి ముఖ్యాంశాలు. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలోకండి.

  2. పాకిస్తాన్: రాజ్యాంగ, ప్రజాస్వామ్య విజయం - సుప్రీంకోర్టు తీర్పుపై ప్రతిపక్షం

    పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పాక్ సుప్రీంకోర్టు ప్రకటించటాన్ని పాక్ ప్రతిపక్ష నేతలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు.

    సుప్రీంకోర్టు తీర్పుతో పాక్ జాతీయ అసెంబ్లీ పునరుద్ధరణ అయింది.

    షాబాజ్ షరీఫ్

    సుప్రీంకోర్టు తీర్పు కేవలం పాకిస్తాన్ రాజ్యాంగాన్నే కాక.. పాకిస్తాన్ ప్రజలను కూడా కాపాడిందని షాబాజ్ షరీఫ్ కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశారు. ఈ తీర్పు పార్లమెంటు ఔన్నత్యాన్ని పునరుద్ధరించిందన్నారు.

    బిలావల్ భుట్టో

    బిలావల్ భుట్టో ట్విటర్‌లో స్పందిస్తూ ‘‘ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రతీకారం’’ అని వ్యాఖ్యానించారు.

    మరియం నవాజ్ షరీఫ్

    మరియం నవాజ్ షరీఫ్ ఇది రాజ్యాంగ విజయమని అభివర్ణించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వారి కథ ముగిసిందని వ్యాఖ్యానించారు.

    అధికార పీటీఐ పార్టీ నేత జావేద్ ఖాన్.. ఇమ్రాన్ ఖాన్ ప్రజల కోసం గట్టిగా పోరాడుతారని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ త్వరలో ప్రకటన చేస్తారని ట్వీట్ చేశారు.

  3. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యా సస్పెన్షన్

    ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐరాస సర్వసభ్య సభ నిర్ణయం తీసుకుంది.

    యుక్రెయిన్‌లోని బుచా నగరంలో మానవ హక్కుల ఉలంఘనలకు సంబంధించి ఐరాస గురువారం నాడు ఈ నిర్ణయం తీసుకుంది.

    యూఎన్‌హెచ్‌సీఆర్ నుంచి రష్యాను సస్పెండ్ చేయాలన్న తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో.. 93 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, 24 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 58 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.

    ఈ ఓటింగ్‌కు కూడా ఇండియా దూరంగా ఉంది. ఐరాసలో రష్యాకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్ ఇప్పటివరకూ దూరంగా ఉంది.

  4. బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్: ‘ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై శనివారం అవిశ్వాస తీర్మానం’

    పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ రాజ్యాంగ విరుద్ధమని పాకిస్తాన్ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఏకగ్రీవ తీర్పులో వెల్లడించింది.

    డిప్యూటీ స్పీకర్ రూలింగ్‌ను, ఆ తర్వాత జాతీయ అసెంబ్లీ రద్దు సహా చేపట్టిన పలు చర్యలను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.

    ప్రధానమంత్రి రాజ్యాంగానికి బద్ధుడై ఉండాలని, కాబట్టి అసెంబ్లీని రద్దు చేయాలంటూ అధ్యక్షుడికి ప్రధాని సలహా ఇవ్వజాలరని సుప్రీంకోర్టు పేర్కొంది.

    ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 9వ తేదీ) ఉదయం 10 గంటలకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని పాకిస్తాన్ జియో న్యూస్‌ను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద చర్చ, ఓటింగ్ జరగటానికి ముందే ఏప్రిల్ 3వ తేదీన నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ దానిని తిరస్కరించారు.

    ఆ తర్వాత జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి సూచించారు. దీంతో అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు.

    పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అసెంబ్లీ రద్దయిన 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలు నిర్వహించాలి.

    ఈలోగా డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని పాకిస్తాన్ సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. అయితే కొద్ది రోజుల పాటు ఈ విచారణ వాయిదా పడింది. దీనిపై తాజాగా తీర్పు చెప్పింది.

    పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని తప్పుపట్టాయి. అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చటానికి జరుగుతున్న విదేశీ కుట్రలో ప్రతిపక్ష నాయకులు భాగస్వాములుగా ఉన్నారని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన అధికార పార్టీ ఆరోపిస్తోంది.

  5. బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ

    నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి గత ఆదివారం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పాకిస్తాన్ సుప్రీంకోర్టు పేర్కొంది.

    వెంటనే నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది.

    నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడిని కోరలేరని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.

    శనివారం రోజు అసెంబ్లీని సమావేశ పరచాల్సిందిగా సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.

    దీంతోపాటు అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.

  6. నవరాత్రి: దిల్లీలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు?

    దేశ రాజధానిలో మాంసం దుకాణాలను మూసివేయాలని ఇద్దరు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీటిపై మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

    తొమ్మిది రోజుల నవరాత్రి వేడుకల సమయంలో మాంసం దుకాణాలను మూసి ఉంచాలని దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు పిలుపునిచ్చారు.

    ఈ విషయంలో ఆదేశాలు జారీ చేయాలంటూ దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) మేయర్ ముకేశ్ సూర్యన్.. మున్సిపల్ కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాశారు. ఏప్రిల్ 2 నుంచి 11 వరకు మాంసం షాపులు తెరవకుండా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

  7. రష్యా ‘క్రూర’ యుద్ధాన్ని ఖండించిన జీ7

    హింసించి, చంపిన మృతదేహాల దృశ్యాలు, లైంగిక హింస వార్తలు.. యుక్రెయిన్ మీద రష్యా సాగిస్తున్న క్రూర యుద్ధపు అసలు ముఖాన్ని చూపుతున్నాయి’’ అంటూ జీ7 ఖండించింది.

    జీ7 సభ్య దేశాల విదేశాంగ మంత్రులు గురువారం నాడు యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతో భేటీ అయ్యారు. అనంతరం వారంతా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

    యుక్రెయిన్‌లోని బుచా నగరంలోనూ రష్యా ఆక్రమణలో ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ సామూహిక మారణకాండలను అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలుగా పరిగణించటం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    చట్టాన్ని మరింతగా అడ్డగోలుగా ఉల్లంఘించరాదని రష్యాను జీ7 బృందం హెచ్చరించింది. సంఘర్షణ ప్రాంతాలకు సాయం అందించటానికి, పౌరులను సురక్షితంగా ఖాళీ చేయించటానికి వీలుగా మానవతా కార్యకర్తలను అనుమతించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పిలుపునిచ్చింది.

    యుక్రెయిన్ తనను తాను రక్షించుకోవటానికి ఆ దేశపు సైన్యానికి మరిన్ని డబ్బులు, సైనిక పరికరాలు అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పింది.

    ప్రపంచంలో అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా పరిగణించే ఏడు దేశాల బృందమే జీ7. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాలు ఇందులో సభ్య దేశాలు.

    1998లో రష్యా ఈ బృందంలో చేరినపుడు అది జీ8 గా మారింది. కానీ 2014లో రష్యా క్రిమియాను తన దేశంలో కలుపుకున్నపుడు ఈ బృందం నుంచి ఆ దేశాన్ని తప్పించారు.

    బుచా నగరంలో తమ సైనికులు అకృత్యాలకు పాల్పడ్డారనే వాదనను రష్యా తిరస్కరించింది.

  8. వైఎస్ జగన్: రాజీనామా చేసిన ఏపీ మంత్రులు, కొత్త క్యాబినెట్ ఎలా ఉండబోతోంది?

    ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని వారంతా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సీఎం జగన్‌కి అందించారు.

    11వ తేదీన కొత్త క్యాబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుంది. 10వ తేదీన అధికారికంగా కొత్త మంత్రుల పేర్లు వెల్లడించబోతున్నారు.

    జగన్ కొత్త క్యాబినెట్‌ ఎలా ఉండబోతోంది?పూర్తి వివరాలు ఈ కథనంలో..

  9. CIPET-Employment: పదో తరగతి పాస్, ఫెయిల్ అయినా.. శిక్షణ, వసతితో ఉద్యోగావకాశాలు

    పేద, వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణనిచ్చి, ఉపాధి అవకాశాలు పొందడానికి, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి సీపెట్ అండగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ టెక్నాలజీ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

  10. బ్రేకింగ్ న్యూస్, ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

    ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. మంత్రిమండలి మొత్తం రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి సమావేశం కానుంది.

  11. కొరియా ఓపెన్: క్వార్టర్స్ చేరిన పీవీ సింధూ

    కొరియా ఓపెన్‌లో పీవీ సింధూ, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ జోడి సత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ షెట్టీ కూడా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.

    మూడో ర్యాంకులో ఉన్న పీవీ సింధూ జపాన్‌కు చెందిన ఆయ ఒహోరిని ఓడించగా మిశా జిల్బర్‌మన్‌ను కిడాంబి శ్రీకాంత్ ఓడించాడు.

  12. వేసవిలో కోట్లాదిగా వచ్చే మిణుగురుల్ని చూసేందుకు చీకట్లో వెయిట్ చేస్తారు

    కేరళలోని పాలక్కడ్ జిల్లాకు వేసవి వచ్చిందంటే చాలు వేలాది మంది పర్యటకులు బారులు కడతారు. అక్కడ ఈ అద్భుతాన్ని కళ్లారా చూసేందుకు పర్యటకులు కారు చీకటిలో వేచి ఉంటారు.

  13. కేటీఆర్: ‘మీకు చేత కాకుంటే కేసీఆర్‌కు అధికారం ఇవ్వండి’

    వరి ధాన్యం సమస్యను చక్కదిద్దడం చేత కాకుంటే అధికారం నుంచి దిగిపొమ్మని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ విమర్శించారు.

    కేసీఆర్ వంటి సమర్థుడైన నాయకునికి అధికారం అప్పచెబితే వారం పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

    తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీఆర్‌ఎస్ పార్టీ నిరసన దీక్షలు చేపట్టింది. ఇందులో భాగంగా సిరిసిల్ల సభల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

    ఆ సందర్భంగా ఆయన ఇలా అన్నారు...

    • మాకు చేత కాదు. మేం అబద్ధాలు చేప్పేటొళ్లం... నమ్మించి మోసం చేసేటోళ్లం... రైతులంటే మాకు ప్రేమ లేదు. కేవలం కార్పొరేట్లు అంటేనే మాకు ప్రేమ అని అంటే, అదే మాట చెప్పండి... పక్కకు తప్పుకోండి.
    • కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకునికి అప్పచెప్పండి. వారం పది రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సమస్య పరిష్కరించే బాధ్యత మాది.
    • దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొచ్చిందని కొందరు అడుగుతున్నారు.
    • బియ్యం కొనుగోలు చేయమంటూ ఒడిశా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాయలేదా? బెంగాల్ వాళ్లు అడగడం లేదా?
    • ఇంత మంది అడుగుతుంటే ఎక్కడా సమస్య లేదని అబద్ధాలు చెబుతున్నారు.
    • ఒకనాడు ధరలు అధికంగా ఉన్నాయంటూ నిరసనలు వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నాయకులు ఇప్పుడు వాటి మీద మాట్లాడటం లేదు.
    • పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ పేదలను ఇబ్బందులు పెడుతున్నారు.
    • ప్రతి ఏటా కోటి టన్నుల ఉప్పుడు బియ్యాన్ని భారతదేశం ఎగుమతి చేస్తోంది. కానీ ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదని పీయూశ్ గోయల్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
    • తెలంగాణ రైతులకు నూకలు తినడం నేర్పించమని కేంద్రం చెబుతోంది.
    • తెలంగాణ రైతుల కష్టాలు చెప్పేందుకు మన మంత్రులు దిల్లీ వెళితే, మాటిమాటికి ఎందుకొస్తారంటూ పీయూశ్ గోయల్ విసుక్కుంటున్నారు.
    • కేంద్రం కొనడం లేదు కాబట్టి ప్రత్యమ్నాయ పంటలు వేసుకుందామని, వరి వేయకండని గతంలో రైతులకు మేం చెప్పాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేశారు.
    • కానీ కేంద్రం చేత కొనిపించే బాధ్యత మాది అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు రైతుల చేత వరి వేయించారు.
    • నాట్లు వేసే ముందే మేం రైతులకు వద్దు అని చెబితే, వారిని బీజేపీ రెచ్చగొట్టి వరి వేయించింది.
    • నేడు యాసంగిలో 30-35 లక్షల ఎకరాల్లో వరి వేశారు.
  14. కర్ణాటక: హిజాబ్, హలాల్, ఆజాన్ తర్వాత ముస్లిం పండ్ల వ్యాపారులను టార్గెట్ చేసిన హిందూ మత సంస్థ శ్రీరామసేన

    కర్ణాటకకు చెందిన హిందూ మత సంస్థ 'శ్రీరామసేన' ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

    మసీదు లౌడ్ స్పీకర్లలో అజాన్ వినిపించడంపై, హలాల్ మాంసంపై నిషేధం విధించాలని ఇదే సమూహం ఇటీవల డిమాండ్ చేసింది. ఇప్పుడు తాజాగా ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

  15. వైఎస్ జగన్: ‘మేం ప్రజలకు మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా?’

    ప్రజలకు తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ్ రెడ్డి అన్నారు.

    సంక్షేమ పథకాలతో ప్రజలకు మంచి చేస్తుంటే రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించారు.

    నరసారావు పేటలో నేడు జరిగిన గ్రామ వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

    రాష్ట్ర ఆర్థికపరిస్థితిని శ్రీలంకతో పోల్చడం మీద...

    ఈ రోజు రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెబుతున్నారు. పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను మనం అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంట.

    ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని వాళ్లకు మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందంట.

    ప్రజలకు మాలాగా మేలు చేస్తే శ్రీలంక అవుతుందంట.. వాళ్లలాగ ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే అమెరికా అవుతుందంట.

    ఇలా మాట్లాడుతున్న వారికి మనసు, నీతి, న్యాయం, ధర్మం... ఇలాంటి పదాలకు కనీసం ఏ కోశాన అయినా అర్థం తెలుసా? గతంలో దోచుకున్నారు.

    రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. మంచి చేయలేదు. ఈ రోజు మంచి చేస్తున్న ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

    ప్రధాని మోదీతో సమావేశం మీద...

    రాష్ట్ర అవసరాల కోసం నిన్న నేను దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశా.

    దాదాపు గంటకుపైగా ఆ సమావేశం మంచి వాతావరణంలో సాగింది.

    కానీ మోదీగారు జగన్‌కు క్లాస్ పీకారని యెల్లో మీడియా అంటోంది.

    ఈనాడు, రాధాకృష్ణ, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు కానీ మోదీ గారి సోఫా కిందనో లేకపోతే నా సోఫా కిందనో వీళ్లు ఎవరైనా అక్కడ ఉన్నారా అని అడుగుతున్నా.

  16. తుంబుర తీర్థం: తిరుమల కొండల్లో సాగే ఆధ్యాత్మిక, సాహస యాత్ర

    తిరుమల కొండల్లోని 108 దివ్య తీర్థాల్లో ఒకటైన తుంబుర తీర్థం దగ్గరికి 14 కిలోమీటర్ల ప్రయాణం అడుగడుగునా సవాళ్లతో సాహసయాత్రను తలపిస్తుంది. అయితే, ఈ తీర్థం దగ్గరకు వెళ్లడానికి టీటీడీ ఏడాదిలో పౌర్ణమి రోజునే ఎందుకు అనుమతిస్తోంది?

  17. తెలంగాణ: ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నిరసనలు

    తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం కేంద్రం కొనాల్సిందే అంటూ నేడు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది.

    అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేల నాయకత్వంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.

    మరొకవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ధాన్యం కొనుగోలు, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది.

  18. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసన తీర్మానం తిరస్కరణపై పాకిస్తాన్ సుప్రీం కోర్టులో విచారణ

    ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ రూలింగ్ ఇచ్చిన పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం నిర్ణయాన్ని పాకిస్తాన్ సుప్రీం కోర్టు నేడు కూడా విచారిస్తోంది.

    పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేయడం మీద కూడా విచారణ చేపట్టింది ఆ దేశ సుప్రీం కోర్టు.

    పాకిస్తాన్ అటార్నీ జనరల్ వాదనలను ఈ రోజు సుప్రీం కోర్టు విననుంది.

  19. సనత్ జయసూర్య: ‘కష్టాల్లో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు భారత్‌కు రుణపడి ఉంటాం’

    సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను భారత్ ఆదుకుంటోందంటూ ప్రశంసించారు ఆ దేశ క్రికెటర్ సనత్ జయసూర్య.

    భారత్‌ను ‘బిగ్ బ్రదర్’ అని పిలిచిన ఆయన, శ్రీలంకకు ప్రధాని నరేంద్ర మోదీ సాయం చేస్తున్న తీరును పొగిడారు.

    ‘మా పొరుగునే ఉండే పెద్దన్న, మాకు సాయం చేస్తున్నారు. ఇందుకు భారత్‌కు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మేం రుణపడి ఉంటాం.

    ప్రస్తుత పరిస్థితుల్లో మనుగడ సాగించడం మాకు అంత తేలిక కాదు. పరిస్థితులు మారతాయని నేను ఆశిస్తున్నా.

    భారత్, ఇతర దేశాల సాయంతో మేం ఈ కష్టాల నుంచి బయట పడతామనే అనుకుంటున్నా.’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ జయసూర్య అన్నారు.

    శ్రీలంకలో విద్యుత్ కోతలు నివారించేందుకు ఇప్పటి వరకు సుమారు 2.70 లక్షల టన్నుల ఇంధనాన్ని భారత్ పంపింది.

    అనేక రకాల ఔషధాలు, మందులు కూడా శ్రీలంకకు పంపుతోంది భారత్. శ్రీలంకకు మరొక బిలియన్ డాలర్ల అప్పును ఇస్తామని భారత్ ప్రకటించింది.

  20. యుక్రెయిన్: ‘దొన్బస్ ప్రాంతం మీద మళ్లీ దాడులు పెంచాలని రష్యా చూస్తోంది’

    దొన్బస్ ప్రాంతం మీద మళ్లీ పూర్తి పట్టు సాధించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.

    బలగాలను మళ్లీ ఆర్గనైజ్ చేసి, వాటిని మరింత బలోపేతం చేసి తూర్పు యుక్రెయిన్ మీద దాడులు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.

    యుక్రెయిన్ చెబుతున్న ప్రకారం...

    • దొనెత్‌స్క్ ప్రాంతాన్ని రక్షిస్తున్న యుక్రెయిన్ బలగాలను కూల్చాలని రష్యా ప్రయత్నాలు చేస్తోంది.
    • మరియూపుల్ మీద పూర్తి ఆధిపత్యం కోసం రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
    • రైల్వే లైన్ల ద్వారా రష్యా సైనికులను, ఆయుధాలను, ఆయుధ సామాగ్రిని వేగంగా తరలిస్తోంది.