You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తమిళనాడు: తిరుపత్తూర్‌లో లోయలో పడిన ట్రక్కు.. ఏడుగురి మృతి

తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ ట్రక్కు లోయలో పడింది. దీంతో ఏడుగురు మరణించారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. కొండపైనున్న ఓ గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. ఆసిఫాబాద్ సరిహద్దుల్లో కనువిందు చేసిన ఉల్కాపాతం

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిసరాల్లో ఆకాశంలో ఉల్కాపాతం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

    నిప్పులు కక్కుతూ ఉల్కలు నేలకి జారినట్లు ఆకాశంలో దృశ్యాలు కనిపించాయి.

    మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, సిర్వంచ, వాంకిడి, కోటపల్లి ప్రాంతాల్లో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.

    మొదట ఆకాశంలో నిప్పులను చూసి‌ ప్రజలు భయాందోళనకు‌ గురయ్యారు. అయితే, వీటితో ఎలాంటి ప్రమాదంలేదని టీవీలో వార్తలు వచ్చాయి.

    తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీచూడండి. ధన్యవాదాలు.

  2. సూర్య కాశీభట్ల: నిజజీవితంలోనూ సెరెబ్రల్ పాల్సీ ఉన్న ఈ మహేశ్‌బాబు ఫ్యాన్‌కు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది?

    బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా జల్సాలో సెరెబ్రల్ పాల్సీతో జీవిస్తున్న కుర్రాడిలా కనిపించిన సూర్య కాశీభట్ల నిజ జీవితంలోనూ ఆ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన బాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన సినిమాలో అతడికి ఎలా చోటు దక్కిందో, అతడి ప్రయాణం ఎలా జరిగిందో సుధా జీ తిలక్‌తో మాట్లాడుతూ వివరించారు సూర్య.

    ఆహార ప్రియుడైన సూర్య వెజిటేరియన్. పియానో వాయిస్తాడు. క్రికెట్ కూడా ఆడతాడు. త్వరలో కంప్యూటర్ ప్రోగ్రమింగ్ కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాడు.

    టెక్సాస్‌లో ఉండే అతడికి సొంత ఇన్‌స్టా హ్యాండిల్, యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి. ప్రస్తుతం అతడి ఫాలోవర్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

    విద్యా బాలన్, షెఫాలీ షా లాంటి ప్రముఖ బాలీవుడ్ నటులతోపాటు అమెజాన్ థ్రిల్లర్‌ జల్సాలో సూర్య నటనపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

    పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  3. ప్లూటోపై మంచు పర్వతాలు ఎందుకు పగులుతున్నాయి? ఖగోళ శాస్త్రవేత్తలను తికమక పెడుతున్న ‘ఐస్ వోల్కనో’ల మిస్టరీ ఏమిటి?

    మన సౌర వ్యవస్థలో అతిపెద్ద మరుగుజ్జు గ్రహం ప్లూటో. దాని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్లూటో ఉపరితలంపై మంచు లావా పొంగిపొర్లిన జాడలు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.

    బహుశా వంద కోట్ల ఏళ్ల క్రితం ఈ లావా ఉప్పొంగి ఉండొచ్చు. అంటే ఇది జరిగి కాస్త ఎక్కువ సమయమే అయింది.

    ప్రస్తుతం అక్కడ ఐస్ వోల్కనోలు క్రియాశీలంగా ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.

    మన సౌర వ్యవస్థలో నాలుగో వంతు వయసుండే ప్లూటోపై ఈ విస్ఫోటాలకు అవసరమైన ఉష్ణం ఎక్కడి నుంచి వచ్చిందో శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు.

    2015, జులై 14న ప్లూటో పక్క నుంచి న్యూ హొరైజన్స్ వ్యోమనౌక ప్రయాణించినప్పుడు తీసిన చిత్రాలను తాజాగా కొలరాడోలోని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కెల్సీ సింగర్ నేతృత్వంలోని పరిశోధకులు విశ్లేషించారు.

    పర్వత ప్రాంతంలా కనిపిస్తున్న ‘‘రైట్ మోన్స్’’గా పిలిచే ప్రాంతంపై సింగర్ బృందం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మిగతా ప్రాంతంతో పోలిస్తే, ఇది నాలుగు నుంచి ఐదు కి.మీ. ఎత్తుగా ఉంది. దీని వెడల్పు 150 కి.మీ. వరకు ఉంది.

    పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  4. భారత్-నేపాల్‌ దేశాలను కలిపే ఈ రైల్వే లైన్ ప్రత్యేకత ఏంటి?

    భారత్-నేపాల్‌లను అనుసంధానించే రైల్వే లైన్‌ను రెండు దేశాల ప్రధానులు శనివారం ప్రారంభించారు.

    నేపాల్ భూభాగంలో భారత్ సాయంతో నిర్మించిన ఈ రైల్వే మార్గంపై మీడియాలో చర్చ జరుగుతోంది.

    జయనగర్-కుర్థాలను అనుసంధానించే ఈ రైల్వే లైన్‌ను నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేఒబా, భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సంయుక్తంగా వర్చువల్ సమావేశంలో ప్రారంభించారు.

    ఈ ప్రాజెక్టులో భాగంగా రైల్వే మార్గాన్ని భారత్ నిర్మించగా, నేపాల్ రెండు రైళ్లను కొనుగోలు చేసింది. నిర్మాణం మొదలుపెట్టిన ఏడాదిన్నద తర్వాత ఈ సేవలను మొదలుపెట్టారు.

    ఆదివారం నుంచి జయనగర్-కుర్థా రైల్వే సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. నేపాల్‌లోని ధునుషా జిల్లాను భారత్‌లోని బిహార్‌తో ఇది అనుసంధానిస్తుంది.

    పూర్తి కథనాన్ని చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

  5. ఐపీఎల్: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. దిల్లీ టార్గెట్ 172

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 2న రెండో మ్యాచ్ గుజరాత్‌, దిల్లీ జట్ల మధ్య జరుగుతోంది.

    టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి గుజరాత్ 171 పరుగులు చేసింది. ఇప్పుడు దిల్లీ 172 రన్లు తీయాల్సి ఉంది.

    గుజరాత్‌ బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్‌ (84),కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (31), రాహుల్ తెవాటియా (14), విజయ్‌ శంకర్‌ (13) పరుగులు చేశారు.

    దిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు, కుల్దీప్ యాదవ్‌ ఒక వికెట్ పడగొట్టారు.

  6. ఐపీఎల్: టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 2న గుజరాత్‌, దిల్లీజట్ల మధ్య రెండో మ్యాచ్ మొదలైంది.

    టాస్‌ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుని గుజరాత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది.

    అయితే, ఓపెనర్‌గా దిగిన మ్యాథ్యూ వేడ్ ఒక రన్ను కొట్టి అవుట్ అయ్యాడు.

    2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.

  7. ఐపీఎల్: ముంబయిపై రాజస్థాన్ విజయం

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 2న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబయిపై రాజస్థాన్ విజయం సాధించింది.

    టాస్ గెలిచిన ముంబయి.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ 193 పరుగులు చేసింది.

    అయితే, రాజస్థాన్ బౌలర్లు బౌలింగ్‌పై పట్టు ప్రదర్శించడంతో 170కే ముంబయి జట్టు పరిమితమైంది. దీంతో 23 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది.

    ముంబయి బ్యాటర్లలో తిలక్‌ వర్మ (61), ఇషాన్ కిషన్ (54) హాఫ్ సెంచరీలు చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పది రన్లు కొట్టాడు.

    మరోవైపు రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్‌ శతకం కొట్టాడు.

  8. తమిళనాడులోని తిరుపత్తూర్‌లో లోయలో పడిన ట్రక్కు.. ఏడుగురి మృతి

    తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ ట్రక్కు లోయలో పడింది. దీంతో ఏడుగురు మరణించారు. మరో 14 మందికి గాయాలయ్యాయి.

    కొండపైనున్న ఓ గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

    మలుపు తిప్పుతుండగా ట్రక్కుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని పీటీఐ వార్తా సంస్థతో ఓ పోలీసు అధికారి తెలిపారు.

    ‘‘ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. 14 మందికి గాయాలయ్యాయి. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం’’అని ఆయన వివరించారు.

    ఘటన జరిగిన ప్రాంతంలో మంచి నీళ్ల బాటిల్స్, చెప్పులు చెల్లాచెదురుగా పడివున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

  9. ఐపీఎల్: ముంబయి ముందు 194 పరుగుల లక్ష్యం ఉంచిన రాజస్థాన్

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 2న తొలి మ్యాచ్ ముంబయి, రాజస్థాన్ జట్ల మధ్య మొదలైంది.

    టాస్ గెలిచిన ముంబయి.. బౌలింగ్ ఎంచుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ప్రస్తుత సీజన్‌లోని తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవి చూసింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను రాజస్థాన్‌ ఓడించింది.

    తాజా మ్యాచ్‌లో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి రాజస్తాన్ 193 పరుగులు చేసింది. ముంబయి ఇప్పుడు 194 పరుగులు చేయాల్సి ఉంది.

    రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్‌ జోస్ బట్లర్‌ శతకం కొట్టారు. మరోవైపు షిమ్రోన్ హెట్‌మయర్‌ 35,సంజూ శాంసన్‌ 30 పరుగులు చేశారు.

  10. ఇప్పటివరకు ఏం జరిగింది?

    యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి ఏడు ప్రత్యేక కారిడార్లలో పౌరులను తరలించనున్నట్లు యుక్రెయిన్ డిప్యూటీ ప్రధాని ఇర్యానా వెరెష్కుక్ తెలిపారు

    మరియుపూల్‌లో చిక్కుకున్న పౌరులకు సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రెడ్ క్రాస్ తెలిపింది. దీని కోసం జాపోరిఝియా నుంచి ఒక బృందం వెళ్తోంది. శుక్రవారం నిరంతరాయంగా బాంబులు పేలడంతో ఈ బృందం మరియుపూల్ చేరుకోవడంలో అడ్డంకులు ఎదురయ్యాయి.

    మరియుపూల్‌లో ఇప్పటికీ 1,60,000 మంది చిక్కుకుపోయారని యుక్రెయిన్ వెల్లడించింది. ఆహారం, మంచి నీరు, ఔషధాల కొరత ఉన్నట్లు పేర్కొంది.

    తూర్పు యుక్రెయిన్‌లోని దోన్బస్ ప్రాంతం వైపు రష్యా బలగాలు భారీగా తరలివెళ్తున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ చెప్పారు.

    ఖార్కియెవ్‌కు ఆగ్నేయ దిశగా 115 కి.మీ. దూరంలోని ఇజుమ్ నగరం రష్యా బలగాల ఆధీనంలో ఉన్నట్లు యుక్రెయిన్ సైన్యం తెలిపింది.

    కీయెవ్ శివార్లలోని యుక్రెయిన్ ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాల నుంచి రష్యన్ బలగాలను వెనక్కి నెక్కినట్లు జెలియెన్స్‌కీ తెలిపారు. ఇక్కడ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

  11. ఇమ్రాన్ ఖాన్ చేసిన తప్పులేంటి... అందుకే ఆయనకు మిత్రులు దూరమయ్యారా?

    ఇమ్రాన్ ఖాన్‌ చాలా మంచి ఆటగాడే కావచ్చు. కానీ, మంచి రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారా? పాకిస్తాన్‌లో ఇటీవలి రాజకీయ సంక్షోభం ఆయన రాజకీయ చతురతపై సందేహాలను లేవనెత్తింది.

    మిత్రపక్షం ముత్తాహిదా ఖ్వామీ మూవ్‌మెంట్-పాకిస్తాన్ (ఎంక్యూఎం-పి) బుధవారం ఆయన దోస్తీ నుంచి విడిపోయింది. దీంతో ఆయన ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీ కోల్పోయింది.

    రాజకీయంగా ఆయన ఏకాకి అయ్యారు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సందర్భంలో ఆయన చేసిన తప్పులే ఈ పరిస్థితి కారణమన్న మాట కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఆయనేం తప్పులు చేశారు?

  12. హాస్టోమెల్ విమానాశ్రయం నుంచి రష్యా దళాల ఉపసంహరణ: యూకే ఇంటెలిజెన్స్

    హాస్టోమెల్ విమానాశ్రయం నుంచి రష్యా దళాల ఉపసంహరణ: యూకే ఇంటెలిజెన్స్

    యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హాస్టోమెల్ విమానాశ్రయంపై పట్టు సాధించేందుకు రష్యా పోరాడింది. ఇప్పుడు అక్కడి నుంచే రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయని యూకే మిలిటరీ ఇంటెలిజెన్స్ పేర్కొంది.

    ఈ విమానాశ్రయం రాజధాని కీయెవ్‌కు సమీపంలో ఉంది.

    ‘‘కీయెవ్ సమీపంలోని రష్యా దళాలు వెనక్కి వెళ్లిపోయేలా యుక్రెయిన్ బలగాల పురోగతి కొనసాగుతోంది’’ అని శనివారం ఉదయం యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    ‘‘తూర్పు వెంబడి చాలా ప్రాంతాలను యుక్రెయిన్ తిరిగి దక్కించుకుంది. భారీ పోరాటం తర్వాత తూర్పు ఖార్కియెవ్‌లో యుక్రెయిన్ బలగాలు ఒక ముఖ్యమైన దారిని ఏర్పాటు చేసుకున్నాయి’’ అని పేర్కొంది.

    ఫిబ్రవరి 24 నుంచి హాస్టోమెల్ విమానాశ్రయం వద్ద తీవ్రమైన పోరాటాలు జరిగాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా వైమానిక దళాలు హెలికాప్టర్లలో వచ్చి దాడులు చేశాయి.

    హాస్టోమెల్ ఒక చిన్న పట్టణం. ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. యుద్ధాని కంటే ముందు ఇది ఒక కీలక వైమానిక స్థావరం. యుక్రెయిన్‌లోని అతి ముఖ్యమైన అంతర్జాతీయ కార్గో విమానాశ్రయం కూడా.

  13. యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతోంది?

    రష్యా చూపు తూర్పు యుక్రెయిన్ వైపు మళ్లిందని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వార్’ స్పష్టం చేసింది. యుద్ధంలో రష్యా తీరు తెన్నులను ఈ సంస్థ తాజాగా అంచనా వేసింది.

    ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వార్ చెప్పిన వాటిలో కొన్ని కీలక అంశాలు

    • యుద్ధం ప్రారంభమై నెల రోజులు గడిచిన తర్వాత కూడా యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌తో పాటు ఇతర నగరాలను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా... తన ప్రణాళికలను పున:సమీక్షించుకుంది.
    • తమ ప్రధాన లక్ష్యం ఎప్పుడూ తూర్పు యుక్రెయినే అని క్రెమ్లిన్ చెబుతోన్న దానిలో నిజం లేదు. తొలి నెల రోజుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే క్రెమ్లిన్ ఈ వాదనను తెరపైకి తెచ్చింది.
    • దోన్యస్క్, లూహాన్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తోన్న రష్యా ఇప్పుడు తూర్పు యుక్రెయిన్‌పై దృష్టి కేంద్రీకరించింది.
    • రష్యా రాబోయే రోజుల్లో మరియుపూల్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కానీ వారి వైపు ప్రాణనష్టం కొనసాగుతూనే ఉంటుంది.
    • కీయెవ్‌కు వాయువ్యం, తూర్పువైపున్న పెద్ద ప్రాంతాలను యుక్రెయిన్ తిరిగి చేజిక్కించుకుంది. గాయపడిన బలగాలను రష్యా సరైన సమయంలో బెలారుస్‌కు తరలించగలిగింది.
  14. అకాడమీ సభ్యత్వానికి విల్ స్మిత్ రాజీనామా

    ఆస్కార్ అవార్డుల వేదికపై క్రిస్ రాక్‌ను చెంపపై కొట్టిన నటుడు విల్ స్మిత్.. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

    ‘‘అకాడమీ క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన నోటీసుకు నేను స్పందించాను. నేను చేసిన పనికి ఎలాంటి శిక్ష వేసినా నాకు అంగీకారమే. అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై నేను చేసిన పని చాలా బాధాకరమైనది. ఏమాత్రం ఆమోదనీయం కాదు.’’

    ‘‘నేను క్రిస్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను, నా స్నేహితులను, ఆత్మీయులను, అవార్డు వేడుకను ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో వీక్షిస్తోన్న అందరినీ చాలా బాధించాను.’’

    ‘‘అకాడమీకి నమ్మకద్రోహం చేశాను. ఇతర నామినీలు, అవార్డు విజేతలను అవమానపరిచాను. దానికి నేను చాలా కలత చెందాను. అందుకే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సైస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

  15. మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి ఎందుకు పెరుగుతున్నాయి... జనరిక్ ఔషధాలతో పరిష్కారం దొరుకుతుందా?

    ఏప్రిల్ 1 నుంచి ప్రజలు తరచూ వాడే పారాసెటమాల్ సహా సుమారు 867 రకాలకు పైగా మందులు ధరలు పెరుగుతున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ), హోల్‌సేల్ పర్చేజ్ ఇండెక్స్ ఆధారంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ ( ఎన్‌ఎల్‌ఈఎం) రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.

    అయితే, ఇప్పటికే తయారైన మందుల ధరల్లో మార్పు ఉండదు. మాన్యుఫాక్ఛరింగ్ డేట్ ఏప్రిల్ 1 అని ఉండే మందుల ధరలు మాత్రమే పెరుగుతాయి.

  16. యుక్రెయిన్‌కు 30 కోట్ల డాలర్ల సైనిక సహాయం ప్రకటించిన అమెరికా

    యుక్రెయిన్‌కు అదనంగా రూ. 30 కోట్ల డాలర్ల భద్రతా సహాయాన్ని అందిస్తామని అమెరికా చెప్పింది.

    సైనిక సహాయంగా లేజర్ గైడెడ్ రాకెట్ వ్యవస్థలు, డ్రోన్లు, భారీ వాహనాలు, నైట్ విజన్ గాగుల్స్, మెషీన్ గన్లు, మెడికల్ సామగ్రిని అందించనుంది.

    దీంతో కలిపి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్‌కు అమెరికా అందించిన సహాయం రూ. 160 కోట్ల డాలర్లకు చేరింది.

    యుక్రెయిన్ సైనిక బలగాలకు కొత్త సామర్థ్యాన్ని అందజేసే కాంట్రాక్టు ప్రక్రియ ప్రారంభాన్ని తాజా ఫండింగ్ సూచిస్తుందని ఒక ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్’ శుక్రవారం కూడా రష్యా బెలారుస్ డిఫెన్స్, ఏరోస్పేస్, సముద్ర రంగాలకు చెందిన 120 సంస్థలపై ఆంక్షలను విధించింది.

    ‘‘యుక్రెయిన్‌పై దాడి చేయాలనే పుతిన్ నిర్ణయం ప్రపంచ వాణిజ్యం నుంచి రష్యాను దాని ఆర్థిక వ్యవస్థను ఒంటరిని చేసింది. తాజా ఆంక్షలు ఆ ఒంటరితనాన్ని మరింత పెంచుతాయి’’ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ మంత్రి గినా రైమండో అన్నారు.

  17. ఇప్పటివరకు ఏం జరిగింది?

    గత 24 గంటల్లో రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన కీలక పరిణామాలను ఇక్కడ చూద్దాం.

    • కీయెవ్ శివారు ప్రాంతాల్లో రష్యా యుద్ధ నేరాలకు సంబంధించిన రుజువులను బీబీసీ చూసింది.
    • తూర్పు వైపు నుంచి యుక్రెయిన్ దళాలను చుట్టముట్టడానికి రష్యా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కీయెవ్, ఉత్తరం వైపు నుంచి తమ దృష్టిని మరల్చుతోంది.
    • యుక్రెయిన్ దళాలు విజయవంతంగా ఎదురుదాడి చేస్తూ పలు ప్రాంతాలపై పట్టు సాధించుకుంటున్నాయి.
    • బెల్గోరోడ్ నగరంలోని ఆయిల్ డిపోపై దాడికి యుక్రెయిన్‌దే బాధ్యత అని రష్యా ఆరోపిస్తోంది. దీన్ని యుక్రెయిన్ ఖండించింది. రష్యా తమపై అకారణంగా నింద వేస్తోందని స్పష్టం చేసింది.
    • యూరప్‌కు గ్యాస్ ఎగుమతులను రష్యా నిలిపి వేయదు. రూబుళ్లలో చెల్లింపులు జరపాలనే వారి డిమాండ్‌పై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
    • మరియుపూల్ నుంచి 3000 పైగా పౌరులను శుక్రవారం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు యుక్రెయిన్ తెలిపింది. శనివారం ఇంకా ఎక్కువ మందిని తరలించే వీలుందని చెప్పింది.
    • ప్రపంచ ఆరోగ్య సంస్థ, యుద్ధ ప్రభావాన్ని కారణంగా చూపుతూ ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాను సగానికి తగ్గించింది.
  18. రసాయన దాడిని ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోన్న యుక్రెయిన్

    అమెరికా సహాయంతో రసాయన ఆయుధ దాడిని ఎదుర్కోవడానికి యుక్రెయిన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు యుక్రెయిన్‌కు అమెరికా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)‌ను పంపిస్తోంది.

    ‘‘ప్రాణాలను రక్షించే పరికరాలను, సామగ్రిని మోహరించినట్లు’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.

    పీపీఈ కిట్లలో గ్యాస్ మాస్క్‌లతో పాటు హజ్మత్ సూట్లు ఇతర మెటీరియల్ ఉంటాయి.

    అయితే ఎంత పరిమాణంలో వీటిని యుక్రెయిన్‌కు తరలిస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

    రసాయన ఆయుధాలు, బయో-ఆయుధాలను రష్యా ఉపయోగించవచ్చనే ఆరోపణలు ఉన్నాయి. రసాయన అయుధాలు ఉపయోగించడానికి రష్యా ప్రణాళికలు చేస్తోందని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.

  19. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.