రష్యాలో జర్నలిస్టుల పనిని తాత్కాలికంగా నిలిపివేసిన బీబీసీ
రష్యాలో ఫేక్ సమాచారం వ్యాప్తి చేసేవారికి 15 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే చట్టాన్ని రష్యా పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది.
రష్యాలో ఎన్నో స్వతంత్ర మీడియా అవుట్‌లెట్లను మూసివేశారు. లేదా ఆపరేషన్స్ జరగకుండా అడ్డుకున్నారు. బీబీసీ, డచ్ వెలే లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థల కార్యకలాపాలనూ పరిమితం చేశారు.
ఈ చట్టానికి స్పందనగా, ఇప్పుడు రష్యాలో పనిచేసే బీబీసీ జర్నలిస్టులందరి విధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీబీసీ డైరెక్టర్ జనరల్ చెప్పారు.
“ఈ చట్టం స్వతంత్ర జర్నలిజం అనే ప్రక్రియను నేరంగా పరిగణించేలా ఉంది” అని డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ అన్నారు.
“ఈ అవాంఛనీయ పరిణామం పూర్తి ప్రభావాల గురించి అంచనా వేసేలోపు మేం రష్యాలో పనిచేసే బీబీసీ జర్నలిస్టులు, వారి సహాయ సిబ్బంది అందరి పనినీ తాత్కాలికంగా ఆపివేయడం తప్ప వేరే దారి లేదు” అని టిమ్ డేవీ అన్నారు.
“రష్యా బయట నుంచి రష్యన్ భాషలో మా బీబీసీ సేవలు కొనసాగుతాయి.”
“మా సిబ్బంది భద్రతే మాకు ముఖ్యం. తమ ఉద్యోగాలు చేసినందుకు వారిని నేర అభియోగాలు ఎదుర్కొనే ప్రమాదంలో పడేయడానికి మేం సిద్ధంగా లేం. వారందరి ధైర్యం, సంకల్పం, వృత్తి నైపుణ్యానికి నేను వారిని ప్రశంసిస్తున్నాను.”
“మా వార్తా సేవలను ఉపయోగించే లక్షలాది రష్యన్లసహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకులకు కచ్చితమైన, స్వతంత్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి మేం కట్టుబడి ఉంటాం”
“యుక్రెయిన్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా జర్నలిస్టులు యుక్రెయిన్‌పై దాడి గురించి రిపోర్ట్ చేయడం కొనసాగిస్తారు” అని ఆయన చెప్పారు.