You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోవాలో అక్రమ బార్ వివాదంపై స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్ ఏం చెప్పారంటే..
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన రూ. 5,000 కోట్ల దోపిడీ గురించి తాను బయటపెట్టడమే తన కుమార్తె చేసిన తప్పు అని స్మృతి వ్యాఖ్యానించారు.
లైవ్ కవరేజీ
నేటి ముఖ్యాంశాలు
- గోవాలో చట్టవిరుద్ధంగా బార్ నిర్వహిస్తున్నారంటూ తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ అన్నారు.
- శివసేనలో తమకు మెజారిటీ సభ్యులు ఉన్నారని నిరూపించేందుకు సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
- వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో దిల్లీ మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొల్లు రమణ (32) అనే వ్యక్తి శుక్రవారం కోయంబత్తూరులోని పోలువంపట్టి ఈషా యోగా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం.
- భారత జావెలిన్ త్రో ప్లేయర్ అన్నూ రాణి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో స్థానంలో నిలిచింది. ఆమె విసిరిన జావెలిన్ 61.12 మీటర్ల దూరంలో పడింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ. 21 కోట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ. ఈమె ఎవరు? మమత ప్రభుత్వంలోని మంత్రికీ ఆమెకూ లింకేంటి?
ఒకపరి కొకపరి వీడియో తొలగించిన శ్రావణ భార్గవి.. ‘అన్నమయ్యపై అభిమానంతోనే వీడియోను తొలగిస్తున్నా’
గోవాలో అక్రమ బార్ వివాదంపై స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్ ఏం చెప్పారంటే..
గోవాలో చట్టవిరుద్ధంగా బార్ నిర్వహిస్తున్నారంటూ తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ అన్నారు. తాను ఎలాంటి రెస్టారెంట్‌ను నడపట్లేదని, ఆ బార్‌కు తాను యజమాని కాదని ఆమె స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆమె తరపు న్యాయవారి కీరత్ నాగ్రా, తన క్లయింట్‌పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘స్మృతి ఇరానీ రాజకీయ ప్రత్యర్థులు, తన క్లయింట్‌పై కల్పిత ఆరోపణలు చేశారు. ఆమె ఒక రాజకీయవేత్త కుమార్తె అయిన కారణంగా, ఆమె పరువుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేశారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఆరోపణలను చూపిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు మోదీ ప్రభుత్వాన్న కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంది.
‘‘కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గోవాలో ఆమె కుమార్తె నడుపుతోన్నఒక రెస్టారెంట్‌లో మద్యం అందించడం కోసం నకిలీ లైసెన్సులు తీసుకున్నారు. ‘సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్’ కోసం స్మృతి కూతురు జోయిష్, నకిలీ పత్రాలు ఉపయోగించారని ఆర్‌టీఐ వెల్లడించింది. స్మృతి ఇరానీని తక్షణమే మంత్రివర్గం నుంచి తొలిగించాలని ప్రధానిని కోరుతున్నాం’’ అని కాంగ్రెస్ ప్రకటనను విడుదల చేసింది.
తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలపై స్మృతి ఇరానీ స్పందించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన రూ. 5,000 కోట్ల దోపిడీ గురించి తాను బయటపెట్టడమే తన కుమార్తె చేసిన తప్పు అనిఆమె వ్యాఖ్యానించారు.
తన 18 ఏళ్ల కూతురు కాలేజీలో చదువుతోందని, ఆమె ఎలాంటి బార్ నడపట్లేదని ఆమె చెప్పారు.
కశ్మీర్ లోయలో భయం నీడలో జీవిస్తున్న కశ్మీరీ పండితులు, కశ్మీరేతరులు
‘ముస్లింలు మైనారిటీలుగా ఉన్న దేశాలకు వెళ్లి పిల్లల్ని కనండి’ అని పాకిస్తాన్ మంత్రి ఎందుకు అన్నారు?
పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్
ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు నోటీసులు పంపిన ఎన్నికల సంఘం
మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
శివసేనలో తమకు మెజారిటీ సభ్యులు ఉన్నారని నిరూపించేందుకు సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా ఇద్దరినీ ఎన్నికల సంఘం కోరినట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
దీనితో పాటు, 2022 ఆగస్టు 8 లోపు ఈ లేఖకు సమాధానం ఇవ్వాలని కమిషన్ కోరింది.
శివసేన ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అరవింద్ సావంత్ మాట్లాడుతూ, "కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు పంపింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు" అని చెప్పారు.
శివసేన జాతీయ కార్యవర్గం పూర్తి నివేదికను ఎన్నికల కమిషన్‌కు సమర్పించామని కూడా ఆయన చెప్పారు.
విమానంలో ప్రయాణికుడికి అత్యవసర చికిత్స చేసిన తెలంగాణ గవర్నర్
వారణాసి నుంచి తిరుగు ప్రయాణంలో దిల్లీ మీదుగా హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
గుండెల్లో నొప్పితోపాటు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆ ప్రయాణికుడు, విమానం టేకాఫ్ అయిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విమానంలో డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అని విమాన సిబ్బంది ప్రయాణికులను అడగ్గా, వెంటనే డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించి, ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.
కాసేపటికి అస్వస్థతను నుంచి కోలుకున్న ప్రయాణికుడు తనకు చికిత్స అందించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు డాక్టర్ తమిళిసై చేస్తున్న ప్రాథమిక చికిత్సను ఫొటోలు తీసి ట్విటర్‌లో షేర్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యను చదివారు.
భారత్‌లో పెరిగిన కోవిడ్ కేసులు
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 21,411 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
నిన్న ఒక్క రోజే 67మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,25,997 కి చేరుకుంది.
డైలీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉందని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి నుంచి 4,31,92,379 మంది కోలుకున్నారనీ, ప్రస్తుతం 1,50,100 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఏడో ర్యాంక్ సాధించిన అన్నూ రాణి
భారత జావెలిన్ త్రో ప్లేయర్ అన్నూ రాణి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఏడో స్థానంలో నిలిచింది. ఆమె విసిరిన జావెలిన్ 61.12 మీటర్ల దూరంలో పడింది.
ఆస్ట్రేలియా ఛాంపియన్ కెల్సీ-లీ బార్బర్ 66.91 మీటర్ల జావెలిన్ విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో అన్నూ రాణి 56.18 మీటర్ల ఆట ప్రారంభించింది. ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి మాత్రమే జావెలిన్‌ను 60 మీటర్లు దాటి విసరగలిగింది.
ఆరు ప్రయత్నాల్లో వరుసగా 56.18మీ, 61.12మీ, 59.27మీ, 58.14మీ, 59.98మీ, 58.70మీ దూరం విసిరింది.
అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో అన్నూ రాణి బుధవారం 59.60 మీటర్ల జావెలిన్ త్రో చేసి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. దీంతో, ఆమె వరుసగా రెండుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్‌కు చేరుకుంది.
'నా మీసాలు నా ఇష్టం' అంటూ మీసం మెలేస్తున్న మహిళ
తెలంగాణలో భారీ వర్షాలు.. ముంచెత్తుతున్న వరద నీరు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక పరిశ్రమ గోడ కూలి, ఇంటిపై పడడంతో ఇద్దరు బిహారీ కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లభాపూర్ గ్రామంలోని ఈదుల్ చెరువు నలుగు పారడంతో జాతీయ రహదారిపై నీరు చేరింది. హైదరాబాద్-కామారెడ్డి జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీటిలో బైక్ మీంచి పడి చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందారు.
ఏడుపాయల వద్ద మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆటో నగర్ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. దుకాణాలు నీట మునిగాయి.
ములుగు జిల్లా జనగలంచ వద్ద వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయింది. ఏటురునాగారంవైపు వెళ్లే వాహనాలను నార్లాపూర్, మేడారం మీదుగ మళ్లించారు.
మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసిన అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కోయంబత్తూర్: ఈషా యోగ్రా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు వ్యక్తి
కోయంబత్తూరులోని పోలువంపట్టిలో ఈషా సంస్థకు చెందిన యోగా కేంద్రం ఉంది. ఈ కేంద్రానికి రాష్ట్రం వెలుపల నుంచి, విదేశాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. కొందరు వలంటీర్లు ఈ యోగా కేంద్రంలోనే బస చేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొల్లు రమణ (32) అనే వ్యక్తి శుక్రవారం ఈషా యోగా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం అందింది.
రమణ గత ఆరునెలలుగా ఈషా యోగా కేంద్రంలోనే ఉంటూ, యోగాలో శిక్షణ పొందుతున్నారు.
రమణ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని అలంద్రాయి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆలంద్రాయి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని ఫాలో అవండి.
గోవాలో అక్రమ బార్ వివాదంపై స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్ ఏం చెప్పారంటే..