ఆంధ్రప్రదేశ్: లబ్ధిదారులకు ఈరోజు నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ
లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేందుకు ఈసీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఏపీ అధికారులు బీబీసీతో చెప్పారు.
సారాంశం
ఆంధ్రప్రదేశ్‌లో డీబీటీ విధానంలో పథకాల పంపిణీకి హైకోర్టు అనుమతి, ప్రక్రియ ప్రారంభించిన అధికారులు
పంజాబ్ కింగ్స్‌పై 60 పరుగులతో ఆర్‌సీబీ గెలుపు
లైవ్ కవరేజీ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
ఫొటో సోర్స్, ANI
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు
శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఆయనకు
మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జూన్ 2న కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
కోర్టు నిర్ణయంతో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి మార్గం
సుగమమైంది. మార్చి 21 నుంచి కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు.
కేజ్రీవాల్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ
పూర్తి చేస్తామని కోర్టు తెలిపింది. త్వరలోనే ఆ కేసు విచారణ పూర్తి చేస్తామని
పేర్కొంది.
బెయిల్ షరతులకు సంబంధించి రాతపూర్వక ఆదేశాలు ఇంకా
వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్: లబ్ధిదారులకు ఈరోజు నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందంటూ ప్రభుత్వానికి ఈసీ లేఖ
ఫొటో సోర్స్, PTI
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు
ఉత్తర్వుల ప్రకారం ఈరోజు నగదు బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి
ఎలక్షన్ కమిషన్ పలు ప్రశ్నలు సంధించింది.
ఈరోజే నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందంటూ ఏపీ రాష్ట్ర
ప్రభుత్వానికి రాసిన తాజా లేఖలో ఈసీ పేర్కొంది.
జనవరి నుంచి నిధుల విడుదలలో జరిగిన జాప్యాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందంటూ లేఖలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీ ఆర్థిక పరిస్థితి
చెప్పండంటూ నిలదీసింది.
మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్: లబ్ధిదారులకు సంక్షేమ పథకాల నగదు బదిలీకి హైకోర్టు అనుమతి, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం
ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల లబ్దిదారులకు డీబీటీ విధానంలో
పథకాల పంపిణీకి ఏపీ హైకోర్టు అనుమతించింది.
అంతకుముందు ఎన్నికల కమిషన్ అధికారులు
విధించిన పరిమితిని పాక్షికంగా సడలించింది. ఎన్నికలకు ముందు నగదు పంపిణీకి
అనుమతిచ్చేది లేదంటూ ఈసీ చెప్పగా, పలువురు లబ్దిదారులు కోర్టుని
ఆశ్రయించారు.
దానిపై విచారించిన కోర్టు గురువారం సాయంత్రం తీర్పును ఇచ్చింది. ఈనెల
11నుంచి 13వరకు ఎటువంటి పథకాల పంపిణీకి
అనుమతి లేదని తెలిపింది.
10వ తేదీ ఒక్కరోజుకి
మినహాయింపునిచ్చింది. దాంతో శుక్రవారం నాడే లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే
ప్రక్రియకు ఏపీ అధికారులు శ్రీకారం చుట్టారు.
జనవరి 23నాడు బటన్ నొక్కిన ఆసరా పథకానికి రూ. 6,394 కోట్లు, ఫిబ్రవరి 28న బటన్ నొక్కిన వైఎస్సార్ షాదీ తోఫా, కళ్యాణమస్తు
పథకాలకు రూ. 78 కోట్లు, జగనన్న
విద్యాదీవెన కోసం రూ. 708 కోట్లు చొప్పున జమచేయబోతున్నారు. ఈ
పథకానికి మార్చి 1న బటన్ నొక్కారు.
ఫొటో సోర్స్, PTI
వాటితో పాటుగా రైతుల ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద మార్చి 6న బటన్ నొక్కిన దానికి రూ. 1,294 కోట్లు, వైఎస్సార్ చేయూత పథకానికి మార్చి 7న బటన్ నొక్కిన రూ. 5,060 కోట్లు,మార్చి 14న బటన్ నొక్కిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్దిదారులకు రూ. 629 కోట్లు కలిపి మొత్తం రూ. 14,165 కోట్లను జమచేసేందుకు కోర్టు అనుమతితో ఏపీ అధికారులు సన్నద్ధమయ్యారు.
అయితే ఈ పథకాల గురించి ప్రచారం గానీ, విజయోత్సవాలు గానీ జరపకూడదంటూ కోర్టు షరతు విధించింది.
కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈసీ నుంచి కూడా ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నట్టు ఏపీ ఆర్థిక శాఖ అధికారులు బీబీసీకి తెలిపారు. ఈసీ నుంచి సానుకూల స్పందన వస్తే నిధులు విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశామని అంటున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసీ ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.