You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్: ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్న వేలాది గ్రామాలు.. ఆరోగ్య సంక్షోభం రావొచ్చని హెచ్చరిస్తున్న నిపుణులు
పాకిస్తాన్‌లో కనీవినీ ఎరుగని వరద బీభత్సంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ మార్పులే ఈ ఘోర విపత్తుకు కారణమని భావిస్తున్నారు. మరోవైపు, చాలా ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలి ఆరోగ్య సంక్షోభం తలెత్తవచ్చని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ, మలేరియా, తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి పాకిస్తాన్‌కు సాయం చేయడం అంటే ఔదార్యం కాదని, ఆ దేశానికి చేయాల్సిన న్యాయమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరిస్ అన్నారు. బీబీసీ ప్రతినిధి పుమ్జా ఫిహ్లానీ అందిస్తోన్న రిపోర్ట్.
సకీనా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. తనకు గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ సోకింది. ఈ చిన్నారి డీహైడ్రేట్ అయ్యింది. ఆకలితో బాధపడుతోంది. తన బిడ్డకు వైద్యం దొరుకుతుందనే ఆశతో తల్లి మోనా తనను ఒక మొబైల్ క్లినిక్‌కి తీసుకొచ్చారు.
''నా ఇద్దరు పిల్లలూ అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ల వైద్యం కోసం నా దగ్గర డబ్బు కూడా లేదు. నాకున్నదంతా వరదల్లోనే కొట్టుకుపోయింది. ఈ క్లినిక్‌కు రాకపోయుంటే, నా బిడ్డ కచ్చితంగా చనిపోయేది. మాకూ, జబ్బుతో ఉన్న మా పిల్లలకు తినడానికి తిండి కూడా సరిగా లేదు'' అని మోనా అన్నారు.
ఈ పరిస్థితి ఒక్క మోనాదే కాదు. గడచిన కొన్ని వారాల్లో మోనా లాంటి చాలా మందిని నేను కలిశాను. వాళ్ల జీవితాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ వరద బీభత్సం మొదలై రెండు నెలలు గడుస్తోంది. ఇప్పటికీ వేలాది గ్రామాలు నీటిలో మునిగి ఉన్నాయి. వేలాది కుటుంబాలు గూడు కోల్పోయాయి.
కొందరు లాల్‌బాగ్‌లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వరద నీరు చేరని కొద్ది ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. కానీ వరదల ప్రభావం మాత్రం ఇక్కడా ఉంది. తినడానికి తిండి, తాగడానికి నీరు దొరక్కపోవడం ఒక్కటే కాదు - ముంచుకొస్తున్న ఆరోగ్య సంక్షోభం గురించి కూడా వైద్యులు ఆందోళన చెందుతున్నారు. నిరాశ్రయులైన అనేక మంది - నిలిచిపోయిన నీటి పక్కనే నివసిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ - వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సర్వం కోల్పోయిన ప్రజల్ని కలిశారు. పాకిస్తాన్ సంక్షోభానికి సత్వర పరిష్కారమేదీ లేదనేది స్పష్టం.
''ప్రపంచం చాలా చిన్నగా అవుతోంది. ప్రపంచం ఇంత చిన్నగా అవుతున్నప్పుడు, ధనికులు పేదల సమస్యలను పట్టించుకోకపోతే - పేదవాళ్లే సంపన్నులను చూసుకుంటారు. మనకు స్థిరమైన శాంతి భద్రతలతో నిండిన ప్రపంచం కావాలి. అసమానతలను తగ్గించగలగాలి. ఇటువంటి విషాద పరిస్థితుల నుంచి బయటపడగలిగేలా పాకిస్తాన్ వంటి దేశాలలకు సాయం అందించాలి'' అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరిస్ అన్నారు.
ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. నీరు వెనక్కు తగ్గి, జీవితం మళ్లీ పట్టాల మీదకు రావాలంటే మరికొన్ని నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడి ప్రజలకు అంత సమయం లేదు. వీరికి తక్షణం సాయం అందాలి. తమ బాధలను, కష్టాలను చూస్తున్న ప్రపంచ దేశాలు, ప్రజలు తమకు సాయం చేస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్ ప్రజలు.
ఇవి కూడా చదవండి:
- 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రివ్యూ: 'ప్రేక్షకులు చాలా మంచోళ్లు. చెత్త సినిమాలోనూ మంచే వెదుక్కొంటారు'
- 'క్వీన్‌పై ప్రేమ, క్యూపై అభిమానం': మర్యాదగా, ఓపికగా క్యూలో నిల్చోవడం అంటే బ్రిటిషర్లకు ఎందుకంత ఇష్టం?
- SCO సదస్సు: 'రక్తపాత యోధుడు' తైమూర్‌కు, సమర్‌కండ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అక్కడ మోదీ ఏం చేయనున్నారు?
- లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య: 'నా బిడ్డలను ఎందుకు చంపారు, అందరినీ ఉరి తీయాలి' - తల్లి ఆవేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)