You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్: ఇజ్యూమ్ నగరంలో వెయ్యికి పైగా మృతదేహాలు
ఇటీవల రష్యన్ల నుంచి తమ సేనలు స్వాధీనం చేసుకున్న ఇజ్యూమ్ నగరంలో వెయ్యికి పైగా మృతదేహాలు ఉన్నట్లు యుక్రెయిన్ ప్రభుత్వ సలహాదారు తెలిపారు. ఈ నగరం కొన్ని నెలలుగా రష్యన్ల స్వాధీనంలో ఉంది. ఇజ్యూమ్‌లో ఎంతమంది మరణించారనే దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఎవరూ ధృవీకరించలేదు. బుధవారం అధ్యక్షుడు జెలియన్‌స్కీ రష్యన్ల బాంబు దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైన ఈ నగరాన్ని సందర్శించారు. ఇజ్యూమ్ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న కథనం.
నెలల తరబడి కొనసాగిన విధ్వంసకర నష్టాల తర్వాత, తనివితీరా ఆనందించే అవకాశం వచ్చింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియెన్‌స్కీ తమ సైనికులు సాధించిన అద్భుతమైన పురోగతికి ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చారు. అందరూ సెల్ఫీ తీసున్నారు. ఇది ఇజ్యూమ్. ఈ వ్యూహాత్మక నగరం రష్యన్ల నుంచి స్వేచ్ఛ పొందింది. మిగతా ప్రాంతాల్లోంచి కూడా రష్యన్లను తరిమి కొడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
''దీనర్థం ఏంటంటే మేము వస్తామని.. ఎప్పుడనేది నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. మా వ్యూహాలు మాకున్నాయి. మేము వస్తాం. ఎందుకంటే ఇది మా భూమి, మా ప్రజలు కాబట్టి. అందుకే మేము వస్తాము'' అని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియెన్‌స్కీ అన్నారు.
అయితే ఈ స్వేచ్ఛ ఇప్పడు కొత్తగా అనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉత్కంఠ ఉంది.
మేము లిప్సీ చేరుకున్నాం. రోడ్డు పొడవునా విధ్వంసమే. కొన్ని మైళ్ల దూరంలోనే రష్యా సరిహద్దు ఉంది. ఈ ప్రాంతం ఆదివారం విముక్తిని పొందింది.
తమ శత్రువులు ఇక్కడ ఎలా బతికారో చూసేందుదకు 75 ఏళ్ల ఇవాన్ వచ్చారు. ఈ ఇంటిని వాళ్లు తమ బేస్‌గా ఎలా మార్చుకున్నారో చూశారు.
వాళ్ల ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్‌ను చూసిన తర్వాత, వాళ్లు విడిచి వెళ్లిన బట్టల్ని చూశారు. రష్యన్లు మళ్లీ వస్తారని, తనకు ఆందోళనగా ఉందని ఆయనన్నారు.
''అన్నింటి గురించి నేను ఆందోళన చెందుతున్నాను. కేవలం ప్రజల పైనే కాదు, జంతువులు, పక్షులు, నేల, అన్నింటిపైనా బాంబులు వేశారు. వాళ్లు అన్నింటిని ధ్వంసం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది'' అని ఆయన అంటున్నారు.
సమీపంలోనే రష్యన్ ఆక్రమణదారులు గురి చూసి కాల్చడాన్ని ప్రాక్టీస్ చేశారు.
ఇక్కడ రష్యన్, చెచెన్ సైనికులు ఉండేవారని స్థానికులు చెప్పారు. ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వాళ్లు చాలా మందుగుండును వదిలి వెళ్లారు. కొంతమంది తమ బూట్లు కూడా బయట వదిలేశారు. ఇక్కడ గోడ మీద ఆసక్తికరమైన అంశాలున్నాయి. వచ్చీ రానీ ఆంగ్లంలో క్షమించండి అనే పదాన్ని రాశారు.
వాళ్లు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు గలీనా. ఆమె తోటలో లిల్లీ పూలు పండించేవారు. అయితే ఇప్పుడదంతా రష్యన్లు పడేసిన శకలాలతో నిండిపోయింది. ఆక్రమణదారులు చెట్లలో దాక్కుని రేయింబవళ్లు కాల్పులు జరిపేవారని ఆమె చెప్పారు.
నేను గతంలో మాదిరిగా లేను అని ఆమె అన్నారు. తనింకా కోలుకోలేదని చెప్పారు. వాళ్లు నన్నేమీ చెయ్యలేదు. అయినప్పటికీ నేను దెబ్బతిన్నాను. నా ఆత్మను కోల్పోయాను.
ఇప్పుడు, గలీనా, ఆమె ఇరుగుపొరుగువారు ఎలాగోలా మెల్లిగా కోలుకుంటారు. అయితే ఈ ఆక్రమణ సృష్టించిన భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రివ్యూ: 'ప్రేక్షకులు చాలా మంచోళ్లు. చెత్త సినిమాలోనూ మంచే వెదుక్కొంటారు'
- 'క్వీన్‌పై ప్రేమ, క్యూపై అభిమానం': మర్యాదగా, ఓపికగా క్యూలో నిల్చోవడం అంటే బ్రిటిషర్లకు ఎందుకంత ఇష్టం?
- SCO సదస్సు: 'రక్తపాత యోధుడు' తైమూర్‌కు, సమర్‌కండ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అక్కడ మోదీ ఏం చేయనున్నారు?
- లఖీంపుర్ ఖీరీలో దళిత బాలికల హత్య: 'నా బిడ్డలను ఎందుకు చంపారు, అందరినీ ఉరి తీయాలి' - తల్లి ఆవేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)