ఆడపిల్లలు పుట్టారని భర్త వదిలేశాడు... ఆ తల్లి బిర్యానీ అమ్ముతూ ఐదుగురు కూతుళ్ళను సాకుతోంది

ప్రచురణ

‘‘అమ్మా ఆకలేస్తోంది. నాన్నెక్కడ… అని పాప అడిగినపుడు వచ్చేస్తారులే అని నచ్చజెప్పేదాన్ని’’ అంటూ ఐదుగురు ఆడపిల్లల తల్లి ఆమ్నా నజీర్ తన కథను బీబీసీతో పంచుకున్నారు.

ఆమ్నా నజీర్ పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ నగరంలో నివసిస్తున్నారు. ఐదో కూతురు పుట్టిన తర్వాత ఆమ్నా జీవితం పూర్తిగా తల్లకిందులైంది. భర్త ఆమెకు విడాకులిచ్చాడు.

‘‘నా భర్త ఇంట్లోనే ఉండేవాడు. పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు. పిల్లలకు కనీసం బట్టలు కూడా కొనిచ్చేవాడు కాదు. నరకం చూపించేవాడు. కానీ ఆ తర్వాత ఎవరినీ ఏదీ అడక్కూడదని, నా అంతట నేనే బతకాలని అనుకున్నా’’ అని ఆమె చెప్పారు.

‘‘మొదట్నుంచీ తనకు కూతుళ్లు కాదు, కొడుకు కావాలనేవాడు. గొడవ పడేవాడు. కొట్టేవాడు. ఇంట్లో నన్నో నౌకరులా చూసేవాడు’’ అని ఆమ్నా చెప్పారు.

చివరికి భర్తతో విడిపోవాలని ఆమ్నా నిర్ణయించుకున్నారు.

పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ నగరంలో ఒక బండిపై బిర్యానీ అమ్మడం మొదలుపెట్టారు. తన చిన్న కూతురు పుట్టిన కొన్ని రోజులకే ఆమె ఈ పని చేయాలనుకున్నారు.

‘‘అప్పటికి తను పుట్టి 20 రోజులే అయింది. పాప ఏడుస్తున్నప్పుడు నేను తన దగ్గరికి వెళ్లేదాన్ని, ఇక్కడ ఒక పాపను పెట్టేదాన్ని. తను ఏడుపు ఆపేది కాదు. పాపను ఎలాగోలా నిద్రపుచ్చి మళ్లీ ఇక్కడికి వచ్చేదాన్ని. అలా ఎన్నో కష్టాలు పడి నా పిల్లలను పెంచుకున్నాను. ఉదయాన్నే వంట చేసుకుని, ఇక్కడ అమ్మడానికి కూడా అన్నం తీసుకుని వచ్చేదాన్ని. రోజంతా ఇక్కడ నిలబడాలి. చాలా కష్టంగా ఉంటుంది. కానీ, ఈ పని ఏడాదిన్నర నుంచి చేస్తూనే ఉన్నా’’ అని ఆమె వివరించారు.

ఈ పని చేయడానికి మొదటిసారి ఇంటి బయట అడుగుపెట్టినపుడు ఆమ్నా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.

‘‘జనం ఏదేదో అంటుంటారు. విడాకులిచ్చింది, భర్తను వదిలేసిందంటారు. అలాంటి మాటలు వినీ వినీ విసిగిపోయా. విడాకులు తీసుకున్న మొదట్లో అవి విన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఐదుగురు పిల్లల్ని చంపేసి నేనూ చచ్చిపోదామనుకున్నా. కానీ, తర్వాత అలా చేయకూడదని ధైర్యం తెచ్చుకున్నా. జనం మాటలు పట్టించుకోకూడదని అనుకున్నాను’’ అంటున్నారు ఆమ్నా నజీర్‌.

‘‘బయట అడుగు పెడితే వింతగా చూస్తారు. రోడ్డు మీద ఎలా వెళ్లాలా అనిపిస్తుంది. కానీ ధైర్యం చేస్తా. నాకు నా పిల్లలే కనిపిస్తారు. నా పిల్లల కోసం ఇది చేయాలనిపిస్తుంది. అంతే నేను వేరే ఏదీ ఆలోచించను’’ అని ఆమె తెలిపారు.

ఆ తర్వాత ఆమ్నా ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.

‘‘బాగా అలిసిపోయేదాన్ని, చాలా దూరం నడవడం, పిల్లల్ని ఎత్తుకోవాల్సి రావడంతో చాలా అలసిపోయేదాన్ని. దాంతో బైక్ నేర్చుకోవాలనుకున్నా. ధైర్యం చేశాను, విడాకుల తర్వాత నేనే స్వయంగా బైక్ నడపడం నేర్చుకున్నా. నా కూతుళ్లకు కూడా నేర్పించా. ఇప్పుడు నా నాలుగేళ్ల పాపకు సైకిల్ నేర్పిస్తున్నా’’ అని వివరించారు.

‘‘తను నాకు సాయం చేయడానికి వస్తుంటుంది. ఇక్కడ బండి దగ్గర అప్పుడప్పుడు ఏవైనా అయిపోతే, తను సైకిల్ మీద తీసుకొచ్చి ఇస్తుంది. నా కూతుళ్లకు నాలాంటి జీవితం రాకూడదనే నేను ఇదంతా చేస్తున్నా’’ అని చెప్పారు ఆమ్నా.

ఆమ్నా కూతుళ్లు ఇప్పటి వరకు స్కూలుకు వెళ్లలేదు. ఇకనైనా తన పిల్లలను బడికి పంపించాలని ఆమె కోరుకుంటున్నారు. కానీ, స్కూల్లో అడ్మిషన్ కోసం వారికి గుర్తింపు పత్రాలు అవసరం.

‘‘నా పిల్లలను ఎప్పుడూ స్కూలుకు పంపించలేదు. పెద్ద పిల్లలిద్దరికీ నేనే చదువు చెప్పేదాన్ని. ఈ పని వల్ల ఇప్పుడు చెప్పలేకపోతున్నా. సాయంత్రం 3 వరకూ బిర్యానీ అమ్ముతాను. ట్యూషన్ పెట్టి వీళ్లను చదివిస్తున్నా. గుర్తింపు పత్రాలు ఏవైనా వస్తే వీళ్లను బడిలో చేర్పించాలనుకుంటున్నా’’ అని ఆమ్నా తెలిపారు.

ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కోగలననే నమ్మకం ఇప్పుడు ఆమ్నాకు వచ్చింది.

‘‘నేను చేస్తున్న పని చూసి నా పిల్లలు గర్వపడుతున్నారు. మా అమ్మ సంపాదిస్తోందని వారు చాలా సంతోషంగా ఉన్నారు’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)