పాకిస్తాన్‌లో పూజలందుకుంటున్న ఏకైక చాముండ మాత దేవాలయం.. భారత్‌కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే..

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌‌లోని ఏకైక చాముండ మాత దేవాలయం
ప్రచురణ

థార్పార్కర్ కొండపై ఉన్న ఈ దేవాలయానికి ఒక విశేషముంది. పాకిస్తాన్‌లో ఉన్న ఏకైక చాముండ మాత దేవాలయం ఇదే. అక్కడి హిందువులు చాముండ మాత అని పిలుస్తారు.

నాంగర్‌పార్కర్ పర్వతాలపై ఉన్న ఈ దేవాలయం భారత్-పాకిస్తాన్ సరిహద్దుకి కేవలం 2 కి.మీల దూరంలో ఉంది.

స్థానికంగా నివాసముండే కమల్ కుమార్ అనే భక్తుడు ప్రతిరోజూ ఇక్కడ దేవాలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు.

''చండ, ముండర్ అనే ఇద్దరు రాక్షసులుండేవారు. ప్రజలను కష్టాల పాలు చేస్తున్న చెండముండాసురులను అంతం చేసినందువల్ల ఆ దేవికి చాముండ అనే పేరు వచ్చింది. ఇది పాకిస్తాన్ లోని ఏకైక చాముండ మాత ఆలయం. భారత్‌లోని చోటీలాకట్ అనే ప్రాంతంలో మరో చాముండ దేవాలయం ఉంది. ఏడాదిలో రెండుసార్లు మహా నవరాత్రి సమయంలో ఈ దేవికి పూజలు చేస్తాం'' అని కమల్ కుమార్ అనే భక్తుడు బీబీసీతో అన్నారు.

హిందూ పురాణేతిహాసాలను అనుసరించి, చాముండ మాత రోగాలను పారదోలుతుందని చెప్తారు.

''మా ఇంట్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాం. ఆ వ్యాధి నుంచి రక్షించాలని మేం వేడుకున్నాం. మేం కోరిన కోర్కెలు తీరడమే కాదు.. ఆరోగ్యాలు కూడా కుదుట పడ్డాయి. ఇప్పుడంతా ప్రశాంతంగా జీవిస్తున్నాం'' అని హాల్ చంద్ అనే స్థానిక హిందువు ఒకరు బీబీసీతో అన్నారు.

ఈ ఎర్రని గ్రానైట్ పర్వతాలపై నిర్మించిన ఈ దేవాలయం వందల ఏళ్ళనాటి పురాతనమైంది.

రోడ్డు నిర్మాణంతో ఇప్పుడు భక్తులు సులభంగా ఇక్కడికి చేరుకుంటున్నారు.

''ఈ దేవాలయాన్ని కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించారు. గత 10-12 ఏళ్ళుగా ఇక్కడకు భక్తుల రాక పెరిగింది. స్థానిక ప్రభుత్వ చొరవతో రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఇప్పుడు వాహనాల్లో సులభంగా చేరుకునే వీలు కలిగింది. ఇప్పుడు నంగర్ పార్కర్‌ను కలిపే రోడ్డు బాగుంది. అందువల్ల వర్షాకాలంలో సైతం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ కోరిన కోర్కెలు తీరిన హిందువులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు, యాత్రలకు వస్తుంటారు. కొంతమంది సరదాగా సందర్శన కోసం కూడా వస్తుంటారు'' అని కమల్ కుమార్ తెలిపారు.

నాగర్ పార్కర్ పర్వతాల్లోని కరుంఝార్ కొండల్లో హిందూ మతానికి చెందిన అనేక పుణ్య క్షేత్రాలున్నాయి.

ప్రతి ఏడాది ఇక్కడ అనేక పండగలు, పర్వదినాలు జరుపుకుంటుంటారు.

పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి హిందువులు తమ మతపరమైన ఆచారాలను స్వేచ్ఛగా నిర్వహించుకుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)