ట్విటర్: ‘భారత్‌లో మా ఉద్యోగుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నాం’ - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

భారత్‌లో తమ ఉద్యోగుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నామని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ పేర్కొంది.

టూల్‌కిట్ వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వానికి, ట్విటర్‌కు మధ్య కొద్ది రోజులుగా వాతావరణం వేడెక్కింది.

బీజేపీ నేతలు చేసిన కొన్ని ట్వీట్లకు 'మేనిపులేటెడ్ మీడియా' అనే ట్యాగ్ తగిలించినందుకు తమపై పోలీసులను ప్రయోగిస్తారని ట్విటర్ ఆందోళన చెందుతున్నట్లు వార్తాఏజెన్సీ పీటీఐ తెలిపింది.

మే 24న ట్విటర్ ఇండియా కార్యాలయానికి పోలీసులు వెళ్లారు. నోటీసులు ఇవ్వడానికే వెళ్లినట్లు పోలీసులు చెప్పారు.

తాజాగా ట్విటర్ ఈ పరిణామాలపై స్పందిస్తూ ''ట్విటర్ భారత ప్రజలకు సేవలందించడానికి కట్టుబడి ఉంది. మా సేవలను అందుబాటులో ఉంచడానికి వీలుగా మేం భారత్‌లో వర్తించే చట్టాలకు లోబడి ఉండేందుకు ప్రయత్నిస్తాం. అయితే, ప్రపంచంలోని మిగతా దేశాలలో మేం అనుసరిస్తున్న విధానాల ప్రకారమే ఇక్కడా భావప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతలకు భంగం కలగకుండా పారద్శక సూత్రాల నిర్దేశానుసారం పనిచేస్తాం'' అని తెలిపింది.

తమ ఉద్యోగుల భద్రత, తమ సర్వీస్ ఉపయోగించుకుంటున్న వినియోగదారుల ప్రైవసీ, భావప్రకటన స్వేచ్ఛల విషయంలో ఆందోళన చెందుతున్నట్లు చెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌: పదో తరగతి పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జులైలో పరిస్థితులను సమీక్షించిన తరువాత నిర్ణయం తీసుకుంటారు.

ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.

షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పలుమార్లు చెప్పింది. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గకపోవడంతో వాయిదా వేయాలని నిర్ణయించింది.

మరోవైపు పరీక్షలు వాయిదా వేయాలంటూ కోర్టులో వేసిన పిటీషన్లు విచారణలో ఉన్నాయి.

కోవిడ్: కరోనావైరస్ పుట్టుక వెనుక గుట్టు కనిపెట్టండి.. యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు బైడెన్ ఆదేశాలు

కోవిడ్-19 మూలాలపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వైరస్ పుట్టుక మొదట ఎక్కడన్నది శోధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించారు.

''మీ ప్రయత్నాలను వేగవంతం చేయండి. 90 రోజుల్లో నాకు నివేదిక ఇవ్వండి'' అని యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను బైడెన్ కోరారు.

2019 చివర్లో చైనా నగరం వుహాన్‌లో మొట్టమొదట ఈ ప్రాణాంతక కరోనావైరస్‌ రకాన్ని గుర్తించారు.

ఆ తరువాత ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి విలయం సృష్టిస్తోంది.

వుహాన్‌లోని ఒక చేపల మార్కెట్‌లో తొలుత ఈ వైరస్ కేసులు బయటపడ్డాయని అధికారులు చెబుతుండగా.. జంతువుల నుంచి మనుషులకు ఇది సోకినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే, చైనాలోని ప్రయోగశాలలో ఈ వైరస్ తయారైందనడానికి ఆధారాలున్నాయంటూ ఇటీవల అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ ఆరోపణలను చైనా ఖండిస్తూ బహుశా అమెరికా ల్యాబ్‌లలోనే తయారై ఉంటుందంటూ ప్రత్యారోపణలు చేసింది.

అమెరికా: కాలిఫోర్నియాలో రైల్వే యార్డ్‌ ఉద్యోగి కాల్పులు.. 8 మంది మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక రైల్వే యార్డ్ ఉద్యోగి తుపాకీతో కాల్పుల జరపడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడని స్థానిక మీడియా చెబుతోంది. కానీ అధికారులు దీనిని ధ్రువీకరించలేదు.

ఈ కాల్పుల ఈ ఘటన శాన్‌ జోస్‌లోని శాంటా క్లారా వాలీ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ(వీటీఏ) రైల్వే యార్డులో జరిగింది.

మృతుల్లో రైల్వే యార్డు ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. వారిపై కాల్పులు జరిపిన నిందితుడు అక్కడే పనిచేస్తున్నాడు.

ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.45కు జరిగింది. ఉద్యోగుల సమావేశంలో నిందితుడు కాల్పులు ప్రారంభించాడు.

నిందితుడిని 55 ఏళ్ల శామ్యూల్ కాసిడీగా గుర్తించినట్టు అధికారులు చెప్పారు.

"తన సహోద్యోగులను చంపాలని అనుకుంటున్నట్లు కాసిడీ నాతో అనేవాడు. కానీ ఆయన అలా చేస్తాడని నేను ఎప్పడూ అనుకోలేదు" అని నిందితుడి మాజీ భార్య సిసిలియా అన్నారు.

"ఒంటరిగా ఉండే అతడు వింతగా ప్రవర్తించేవాడు" అని నిందితుడి పొరుగునే ఉంటున్న డో సూ మెర్కురీ న్యూస్‌కు చెప్పారు.

నిందితుడికి పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల్లాంటివి జరగలేదు. అతడు తనను తాను కాల్చుకుని చనిపోయాడని ప్రాథమికంగా భావిస్తున్నాం" అని శాంటా క్లారా పోలీసు అధికారి రస్సెల్ డేవిస్ చెప్పారు.

అతడు ఈ కాల్పులు జరపడానికి ముందు తన ఇంటికి నిప్పుపెట్టాడని స్థానిక మీడియా చెప్పింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనను భయంకరమైన విషాదంగా పేర్కొన్నారు. జెండాలను సగానికి అవనతం చేయాలని, గన్ కంట్రోల్ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

"బుల్లెట్ ద్వారా పోయే ప్రతి ప్రాణం మన దేశం ఆత్మను గుచ్చుతోంది. మనం దీన్ని అడ్డుకోవడానికి ఎంతో చేయగలం" అన్నారు.

గన్ వయలెన్స్ ఆర్కైవ్ వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే అమెరికాలో 230 'మాస్ షూటింగ్' ఘటనలు జరిగాయి.

నలుగురు అంతకంటే ఎక్కువ మంది కాల్పుల ఘటనల్లో చనిపోయినపుడు దానిని 'మాస్ షూటింగ్' ఘటనగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)