చైనాలో వీగర్ ముస్లింలపై రేప్‌లు.. తీవ్రమైన లైంగిక హింస.. బయటపెట్టిన బాధితులు

వీడియో క్యాప్షన్, చైనాలో వీగర్ ముస్లింలపై రేప్‌లు.. తీవ్రమైన లైంగిక హింస.. బయటపెట్టిన బాధితులు
ప్రచురణ

చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింల కోసం నిర్వహిస్తున్న 'రీ ఎడ్యుకేషన్ ' శిబిరాల్లో ఒక పథకం ప్రకారం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ, హింసిస్తున్నారని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.

అక్కడ జరుగుతున్న లైంగిక దాడులు, హింస మనసులను కలచివేస్తున్నాయి.

తుర్సునే జియావుదున్ చైనా నిర్బంధ శిబిరాల్లో తొమ్మిది నెలలు గడిపారు.

"అక్కడి పురుషులు ఎప్పుడూ మాస్క్‌తోనే కనిపించేవారు. అప్పటికి కరోనా లేనే లేదు, అయినా మాస్కులు ధరించేవారు. వాళ్లు పోలీస్ యూనిఫాంలు కాకుండా మామూలు సూట్లు వేసుకునేవారు.

అర్ధరాత్రి దాటాక వాళ్లు సెల్‌లోకి వచ్చేవారు. వాళ్లకు నచ్చిన మహిళలను ఎత్తుకెళిపోయేవారు. అదే కారిడార్‌లో నిఘా కెమేరాలు లేని బ్లాక్ రూంకు తీసుకెళ్లేవారు" అని జియావుదున్ వివరించారు.

పలుమార్లు తనను కూడా ఎత్తుకెళ్లారని జియావుదున్ చెప్పారు.

"నా జీవితంలో మర్చిపోలేని విషాదం అది. దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు మనసు రావట్లేదు" అని ఆమె అన్నారు.

కొన్ని వ్యక్తిగత అధ్యయనాల అంచనాల ప్రకారం, పది లక్షలకన్నా ఎక్కువమంది మహిళలు, పురుషులను ఈ శిబిరాల్లో నిర్బంధించారు.

అయితే, ఈ శిబిరాలను వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల 'పునర్విద్య' (రీ ఎడ్యుకేషన్) కోసం ఏర్పాటు చేశామని చైనా చెబుతోంది.

చైనా ప్రభుత్వం, వీగర్ ముస్లింల మతపరమైన స్వేచ్ఛను, ఇతర హక్కులు, స్వాతంత్ర్యాన్ని క్రమక్రమంగా తొలగించేందుకు ప్రయత్నిస్తోందని, వారిపై సామూహిక నిఘా, నిర్బంధం, బలవంత బోధన, స్టెరిలైజేషన్‌కు పాల్పడుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

''2014లో జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ వేర్పాటువాదులు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు.

అనంతరం ఆ ప్రాంతాన్ని సందర్శించిన షీ జిన్‌పింగ్ ఈ శిబిరాలను ప్రారంభించారు.

న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టిన పత్రాల ప్రకారం.. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే జిన్‌పింగ్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ "ఏ రకమైన దయ, జాలి చూపవద్దని" సూచించారు.

అప్పటినుంచీ చైనా అధికారుల చర్యలు మారణహోమాన్ని తలపిస్తున్నాయ''ని గత నెలలో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.

అయితే, ఇవన్నీ "అబద్ధాలని, అసంబద్ధ ఆరోపణలని" చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)