మోదీకి కేసీఆర్ లేఖ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు తెలుగులోనూ నిర్వహించాలి - Newsreel

పరీక్ష రాస్తున్న అభ్యర్థులు

ఫొటో సోర్స్, Getty Images/ Hindustan Times / Contributor

ప్రచురణ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అర్హత పరీక్షలను తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరుతూ ప్రధాన మంత్రికి లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు.

కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలన్నీ హిందీ లేదా ఇంగ్లీషు భాషల్లోనే జరుగుతాయి. దీంతో ఆ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఈ రెండు భాషల్లో ఏదో ఒకటి రావాలి.

''ఈ విధానం వల్ల ఇంగ్లీషు మీడియంలో చదవని వారూ, హిందీ రాష్ట్రాలకు చెందని వారూ ప్రతికూలత ఎదుర్కొంటున్నారు'' అని నవంబర్ 18న రాసిన లేఖలో పేర్కొన్నారు కేసీఆర్.

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకూ సరిసమాన అవకాశాలు కల్పించడం కోసం, కేంద్ర ప్రభుత్వ పరీక్షలన్నీ ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలనీ, ఆర్ఆర్‌బీ, యూపీఎస్సీ, ఎస్సెస్సీ, బ్యాంకులు.. ఇలా అన్ని రకాల నియామకాలకూ ఇది వర్తించాలనీ ప్రధానిని కేసీఆర్ కోరారు.

మోదీకి కేసీఆర్ లేఖ

'జాగ్రత్తగా ఉండండి.. లేదంటే కళ్లు పీకేస్తాం...': పశ్చిమ దేశాలకు చైనా హెచ్చరిక

హాంకాంగ్ నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

'మా దేశ వ్యవహారాలకు దూరంగా ఉండండి' అంటూ ఐదు కన్నుల కూటమి (ఫైవ్ ఐస్ అలయన్స్)గా వ్యవహరించే యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాల మీద చైనా మండిపడింది.

గతవారం హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా మాట్లాడిన శాసనసభ సభ్యులను బహిష్కరించిన చైనా.. విమర్శకుల గొంతు నొక్కేస్తోందంటూ ఫైవ్ ఐస్ అలయన్స్ దేశాలు ఆరోపించాయి.

హాంకాంగ్‌లో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని శాసనసభనుంచి వెనువెంటనే బహిష్కరించేందుకు వీలుగా చైనా ప్రవేశపెట్టిన కొత్త నియమాలను వెనక్కి తీసుకోవాలని ‘ఫైవ్ ఐస్’ అలయన్స్ కోరింది.

ఆ ఆరోపణలకు స్పందిస్తూ..."ఈ దేశాలు చైనా వ్యవహారాలకు దూరంగా ఉండాలి.. వారు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వారి కళ్లు పీకేస్తాం" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెచ్చరించారు.

"చైనీయులు ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టరు. దేనికీ భయపడరు. ఐదు కళ్లు కాదుగదా పది కళ్లున్నా మాకు లెక్క లేదు" అని జా లీజాన్ గురువారం నాడు విలేఖరులతో వ్యాఖ్యానించారు.

హాంకాంగ్ నిరసనలో బ్రిటన్ జెండా ప్రదర్శిస్తున్న ఓ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాంకాంగ్ నిరసనలో బ్రిటన్ జెండా ప్రదర్శిస్తున్న ఓ మహిళ

జాతీయ భద్రతకు ముప్పుగా భావించే రాజకీయ నాయకులను తొలగించడానికి అనుమతిచ్చే తీర్మానాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించిందిన తరువాత గతవారం హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతిస్తున్న నలుగురు శాసనసభ సభ్యులను తొలగించారు.

దీనికి ప్రతిస్పందనగా, హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతిచ్చే చట్టసభ సభ్యులందరూ రాజీనామా చేశారు.

1997లో యూకే, హాంకాంగ్‌ను అప్పగించాక, అక్కడ ఇంతవరకూ అసమ్మతి ఎదురవ్వలేదు.

హాంకాంగ్ స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని కాపాడవలసిన చట్టబద్దమైన కట్టుబాట్లను చైనా ఉల్లంఘించిందనీ, తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి హాంకాంగ్ ప్రజలకున్న హక్కులను నిరోధిస్తోందని ఫైవ్ ఐస్ గ్రూప్ ఆరోపించింది.

ఈ విధంగా నలుగురు శాసనసభ్యులను బహిష్కరించడం హాంకాంగ్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు వ్యతిరేకం అని పలువురు భావిస్తున్నారు. అయితే, చైనా ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)