మంగోలియాలో బీబీసీ ప్రతినిధిని కారులో వెంబడించిన చైనా పోలీసులు
వీగర్లు, టిబెటన్లు వంటి మైనారిటీ జాతులతో చైనా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవలి కాలంలో చాలానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చైనాలోని మంగోలియన్ జాతి ప్రజలు కూడా షీ జిన్‌పింగ్ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ సాగిస్తున్న అణచివేతను ప్రశ్నిస్తున్నారు.
చైనా కేంద్ర ప్రభుత్వంలో బహుసంఖ్యాకులైన హాన్ జాతిదే ఆధిక్యం. ఇప్పుడు మంగోలియన్ భాషాబోధనను తగ్గించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఉత్తరాది సరిహద్దు ప్రాంతంలో నిరసనలు తలెత్తుతున్నాయి. బీబీసీ చైనా ప్రతినిధి స్టీఫెన్ మాక్‌డొనెల్ అందిస్తున్న కథనం.
చైనాలోని మంగోలియన్లు తమ జాతి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్కూల్స్‌లోకి తమ పిల్లలను పంపించకుండా ఆపడం ద్వారా నిరసన తెలుపుతున్నారు.
అక్కడి స్కూళ్లలో వారి స్థానిక భాషకు ప్రాధాన్యం తగ్గించి మాండరిన్ భాషలోనే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మిగతా జాతుల విషయంలో చేసినట్టుగానే చైనా ప్రభుత్వం ఇప్పుడు మంగోలియన్ల సంస్కృతిని కూడా చిన్నచూపు చూస్తోందని స్థానికులంటున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఇది నిజం కాదంటున్నారు.
పరిస్థితిని క్షేత్రస్థాయిలో అర్థం చేసుకునేందుకు మేం మంగోలియా ప్రావిన్స్ లోపలి ప్రాంతాలకు వెళ్లాం. ఈ ప్రాంత జనాభాలో స్థానిక మంగోలియా జాతివారు ఇప్పుడు 20 శాతంకన్నా తక్కువే ఉన్నారు. వారిలో సగం మంది మాత్రమే తమ భాష మాట్లాడగలుగుతారు.
ఇక్కడి మూలవాసులు వాస్తవానికి సంచార జీవనం సాగించే పశుపాలకులు. కానీ ఆధునికీకరణ, ప్రభుత్వ కార్యక్రమాల పర్యవసానంగా అదంతా ఇప్పుడు అంతరించింది. వీళ్లది ఎంతో ఘనమైన సంస్కృతి. వీరి భాషకు చాలానే చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు తమ భాషను తమకు మిగలకుండా చేశారని ఇక్కడి వారు వాపోతున్నారు.
ఇక్కడ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. తనిఖీలు చేస్తున్నారు. మా ఐడీలు, సామాన్లు చూపించాలని అడుగుతున్నారు.
రోడ్డుపైన అధికారులు మా కోసం కాపు కాశారు.
చైనాలో విదేశీ రిపోర్టర్లకు ఇది తరచూ ఎదురయ్యే సమస్యే. ఇక మేం ఎటు వెళ్లినా సరే మా వెంట కొందరు సాదా దుస్తుల్లో మమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు.
స్కూలు భవనాలపై కట్టిన ప్రచార బ్యానర్లను మేం చూశాం. మాండరిన్ భాషను మాత్రమే ఉపయోగించాలని విద్యార్థులను కోరుతున్నారు.
స్కూలు చుట్టుపక్కల నివసించే స్థానికులతో మాట్లాడాలని మేం అనుకున్నాం. కానీ మమ్మల్ని తెల్ల కారులో కొందరు ఫాలో చేస్తున్నారు. కాబట్టి ఎవరి ఇంటి తలుపునైనా తట్టి మేం ఏదైనా ప్రశ్నిస్తే తెల్లకారులో ఉన్న వాళ్లు వారిని వదిలిపెట్టరు. అలా వాళ్లను మేం ఇబ్బందుల్లో పడేసినట్టు అవుతుంది.
ఒక ప్రభుత్వ అధికారితో ఇంటర్వ్యూ కోసం నేను ప్రయత్నించారు. కానీ ఇక్కడి ప్రజల నిరసనల గురించి అడగగానే... లైన్ కట్ అయిపోయింది. విచిత్రంగా ఉంది.
ఇదంతా మా స్నేహితులు చూస్తూ, వింటూ ఉన్నారు.
దీనిపై స్టోరీ చేయాలనుకున్న ఇతర రిపోర్టర్లను ఈ ప్రావిన్స్‌లో అడుగుపెట్టనివ్వకుండా ఆదేశాలు జారీ చేశారు.
ఇక మేం బయలుదేరదాం అనుకుంటూండగా.. మా కోసం ఓ స్కూల్ టూర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ అనేక ఇతర స్కూళ్లకు భిన్నంగా ఈ స్కూళ్లో ప్రిన్సిపాల్ సహా విద్యార్థులు, టీచర్లలో అత్యధికులు మంగోలియన్ జాతివారే అని మాకు చెప్పారు. మా పర్యటనను ఫిల్మ్ తీశారు. స్థానిక టెలివిజన్ కోసం అయి ఉండొచ్చు.
మంగోలియన్‌లో రాయడం వంటి సాంస్కృతిక విద్య చాలా ముఖ్యమని ప్రిన్సిపల్ అన్నారు. కానీ చైనాలో సంపన్నులు కావాలంటే మాండరినే కీలకమన్నారు. అయితే, ఈ మార్పులతో కొందరు తల్లిదండ్రుల్లో గందరగోళం ఏర్పడిందని ఆమె చెప్పారు.
విద్యా విధానంలోంచి మంగోలియన్ భాషను పూర్తిగానే తొలగించాలనేది వారి లక్ష్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే. మంగోలియన్లు దీన్ని సాంస్కృతిక నరమేధంగా చూస్తున్నారు.
ఆర్థికపరమైన ఆశల్ని చూపుతూ లేదా శిక్షిస్తామని భయపెడుతూ పిల్లలను మళ్లీ తరగతుల్లోకి రప్పించేలా తల్లిదండ్రులపైనా, టీచర్లపైనా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
తమ మాతృభాష భవిష్యత్తు విషయంలో జరుగుతున్న ఘర్షణలో ఈ విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇది నియంత్రణకు సంబంధించిన సమస్య. అంతేకాదు.. హాన్ జాతికి చెందని పౌరులకు ఈ దేశంలో లభించే స్థానం ఏంటనే సమస్య కూడా.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది కర్ణాటకా.. తమిళనాడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)