You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెరూ: లాక్‌డౌన్‌ను కాదని నైట్ క్లబ్‌లో పార్టీ.. పోలీసుల దాడి.. తొక్కిసలాట లో 13 మంది మృతి
పెరూలో కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఒక నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నవారిపై పోలీసులు దాడి చేసారు. అక్కడివారంతా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా తొక్కిసలాటలో 13 మంది చనిపోయారు.
పెరూ రాజధాని లీమాలోని లాస్ ఒలివోస్ జిల్లాలో థామస్ రెస్టోబార్‌లో కొందరు పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేసారు. టియర్ గ్యాస్ ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్న 23 మందిని అదుపులోకి తీసుకుని కోవిడ్-19 టెస్ట్ చేయగా 15 మందికి పాజిటివ్ వచ్చిందని పెరూ అధ్యక్షుడు మార్టిన్ విజ్‌కారా తెలిపారు.
కరోనావైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో పెరూ కూడా ఒకటి.
పెరూలో 576,000 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 27,000లకు పైగా చనిపోయారు.
అక్కడ మార్చినుంచీ రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉండగా, ఈ నెల ప్రారంభంలో ప్రజలను గుంపులుగా గుమికూడవద్దని కోరుతూ సమూహ సమావేశాలపై నిషేధం విధించారు.
శనివారం నైట్‌క్లబ్‌లో చట్టవిరుద్ధంగా జరిగిన పుట్టినరోజు వేడుకలో దాదాపు 120 మంది పాలుపంచుకున్నారని పెరూ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు.
"క్లబ్ మీద పోలీసులు దాడి చేసాక, అక్కడ ఉన్న ఒకే ఒక్క మార్గం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తొక్కిసలాట జరిగింది. తోపులాటలో కొందరు మెట్ల మీద చిక్కుకుపోయారు. 20-30 ఏళ్ల వయసు గల 11 మంది పురుషులు, 2 స్త్రీలు చనిపోయారు" అని మంత్రి తెలిపారు.
పోలీసులు ఎలాంటి ఆయుధాలుగానీ, టియర్ గ్యాస్‌గానీ ప్రయోగించలేదని వారి మంత్రిత్వ శాఖ చెబుతోంది. కానీ పోలీసులు అక్కడకు ప్రవేశించాక టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని నిర్భందించారని స్థానికులు చెబుతున్నారు.
ఆ క్లబ్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు గాయాలు పాలయ్యారు. అందులో ముగ్గురు పోలీసులు.
ఇలా గుంపులుగా గుమికూడడం ప్రజారోగ్యానికి మంచిది కాదని, వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని ఆ దేశాధ్యక్షుడు విజ్‌కారా అన్నారు.
"చనిపోయినవారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. జరిగినదానికి చింతిస్తున్నాను కానీ ఈ సమయంలో ఇలాంటి వేడుకను ఏర్పాటు చేసినవారిపై కోపంగా ఉంది. ఇది వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది" అని అధ్యక్షుడు విజ్‌కారా అన్నారు.
"బాధ్యతగా ఉండండి. నిర్లక్ష్యం కారణంగా మరిన్ని ప్రాణాలు పణంగా పెట్టొద్దు" అని విజ్‌కారా ప్రజలను కోరాకు.
దాడి చేసిన 60 మంది పోలీసులకు కూడా కోవిడ్-19 పరీక్ష జరిపిస్తామని ఆయన తెలిపారు.
పెరూలో మొదటినుంచీ కఠినమైన లాక్‌డౌన్ విధించినప్పటికీ కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరిగాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)