హాంకాంగ్‌లో 'థర్డ్‌వేవ్‌' నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిందేంటి

    • రచయిత, హెలియర్‌ చెంగ్‌
    • హోదా, బీబీసీ న్యూస్‌
  • ప్రచురణ

నిన్న మొన్నటి వరకు కరోనాను కట్టడి చేయడంలో హాంకాంగ్‌ అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైన చైనాతో హాంకాంగ్‌కు సరిహద్దులు ఉన్నాయి. అయినా అక్కడ చాలా రోజులు మహమ్మారి కట్టడిలోనే ఉంది.

యూరప్‌, అమెరికా, చైనాలలోని కొన్నిప్రాంతాలలో విధించిన కఠిన నిబంధనల తరహాలో లాక్‌డౌన్‌ అమలు చేసి, కరోనాను హాంకాంగ్‌ అదుపు చేయగలిగింది.

కానీ ఇప్పుడు రెండోది కాదు, మూడో దశ కరోనా వైరస్ వేవ్‌ను ఆ దేశం ఎదుర్కొంటోంది. ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది. కొద్ది సంఖ్యలోనే అయినా ఆ దేశంలో రికార్డు స్థాయిలో ఇన్‌ఫెక్షన్లు నమోదవుతున్నాయి.

మరి హాంకాంగ్‌ ఎక్కడ తప్పు చేసింది? మహమ్మారిని, లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడంలో తంటాలు పడుతున్న దేశాలు హాంకాంగ్‌ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి ?

క్వారంటైన్‌ మిహాయింపులు, లోటుపాట్లు

హాంకాంగ్‌లో తొలికేసు జనవరిలో బయటపడింది. దీంతో ప్రజలు హడలిపోయారు. సరకులు కొనుక్కోడానికి ఎగబడ్డారు. కానీ వైరస్‌ వ్యాప్తి మాత్రం అంత ఎక్కువగా జరగలేదు.

విదేశాలలో ఉన్న విద్యార్ధులు, హాంకాంగ్‌వాసులు సొంతదేశానికి తరలి రావడంతో మార్చిలో రెండో దశ కోవిడ్‌-19 వ్యాప్తి మొదలైంది.

దీంతో సరిహద్దుల వద్ద కఠినమైన నిబంధనలు అమలు చేయడం మొదలు పెట్టింది హాంకాంగ్‌. విదేశీయులను దేశం లోపలికి రానివ్వకుండా కట్టడి చేసింది. దేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవడం, 14 రోజుల హోం క్వారంటైన్‌ పాటించడం తప్పని సరి చేసింది.

దేశంలోకి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ఇళ్లలోనే ఉన్నారా లేదా తెలుసుకోడానికి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లను కూడా తగిలించింది.

సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడాన్ని కఠినంగా అమలు చేసింది. ఇవన్నీ సవ్యంగా సాగడంతో హాంకాంగ్‌లో కొద్దిరోజులకే జనజీవనం గాడిన పడింది.

మరి వంద కొత్త కేసులతో హాంకాంగ్‌లో థర్డ్‌వేవ్‌ కరోనా వైరస్‌ ఎలా వచ్చింది?

"ఇది మమ్మల్ని చాలా నిరాశ పరిచింది. మేం వైరస్‌ను కట్టడి చేయడానికి చేయాల్సినదంతా చేశాం'' అని యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ వైరాలజీ విభాగం అధిపతి మాలిక్‌ పెరిస్‌ అన్నారు.

అయితే తాము అనుసరించిన పద్దతుల్లో రెండు లోపాలున్నాయని ఆయన అన్నారు.

బ్రిటన్‌లాంటి దేశాల మాదిరిగా విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ క్యాంప్‌లలో కాకుండా 14 రోజుల హోం క్వారంటైన్‌కు పంపడం హాంకాంగ్ చేసిన మొదటి పొరపాటని ఆయన అన్నారు.

"హోం క్వారంటైన్‌ చేశాం. కానీ ఇంట్లో ఉన్నవాళ్లకు ఎలాంటి నిబంధనలు లేవు. వారు రావడం పోవడం అంతా మామూలుగా జరిగిపోయింది'' అని పెరిస్‌ అన్నారు.

దేశంలోకి వస్తున్న వారిలో కొందరికి క్వారంటైన్‌, టెస్టింగ్‌ల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని, అది కూడా ఒక పొరపాటేనని ఆయన అన్నారు..

నౌకలు, వైమానిక సిబ్బంది, స్టాక్‌ఎక్సెంజ్‌లో నమోదైన కంపెనీలకు చెందిన ఎగ్జిక్యుటివ్‌లు ఇలా దాదాపు 2 లక్షలమందికి హాంకాంగ్‌ ప్రభుత్వం టెస్టులు, క్వారంటైన్‌ నుంచి మినహాయింపులు ఇచ్చింది.

రోజువారీ ఆపరేషన్లు నిరాటంకంగా నడిపించేందుకు, హాంకాంక్‌ ఆర్ధికరంగంపై ప్రభావం పడకుండా చూసేందుకు వీరికి మినహాయింపులు అవసరమని ప్రభుత్వం భావించింది.

చైనా మెయిన్‌లాండ్‌కు వచ్చే దిగుమతులు ఎక్కువగా హాంకాంగ్‌ పోర్టుకే వస్తాయి. అలాగే అంతర్జాతీయంగా అనేక ఎయిర్‌లైన్స్‌ సంస్థలు, నౌకల సిబ్బంది ఇక్కడే తమ డ్యూటీలు మారుతుంటారు.

"నౌకలు, విమానాల సిబ్బందిలో చాలామంది పబ్లిక్‌ ప్లేస్‌లకు వెళ్లారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించారు. వారికి మినహాయింపు ఇవ్వడమే ఇన్‌ఫెక్షన్లు అడ్డుకునే ప్రక్రియలో ప్రధానమైన లోపం'' అని అంటువ్యాధుల నిపుణులు జోసెఫ్‌ సాంగ్‌ అన్నారు.

క్వారంటైన్‌లో మినహాయింపుల వల్లే వైరస్‌ ప్రబలిందన్న వాదనతో ప్రభుత్వం మొదట ఏకీభవించలేదు. కానీ తాజాగా వైరస్‌ ప్రబలడంతో ఈ వాదనను ఒప్పుకుంది.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విమాన సిబ్బంది విషయంలో కఠిన నిబంధనలను సిద్ధం చేశారు. కానీ వాటిని అమలు చేయడం మాత్రం ఇబ్బందిగా మారింది. గతవారం విదేశానికి చెందిన ఒక పైలట్‌ కోవిడ్‌-19 టెస్టుకు శాంపిల్ ఇచ్చి, ఖాళీ సమయంలో విహార యాత్రకు వెళ్లడాన్ని ప్రభుత్వ సిబ్బంది గమనించారు.

అయితే ప్రజారోగ్యాన్నీ, ఎకానమీని సమతౌల్యం చేయడం కూడా కష్టమే. హాంకాంగ్‌ వెళ్లే విమానాలను రద్దు చేయాలని ఫెడెక్స్‌ పైలట్‌ ఒకరు తన కంపెనీని డిమాండ్‌ చేశారు. అక్కడున్న కఠిన నిబంధనలు తమను ఇబ్బంది పెడుతున్నాయన్నది వారి వాదన.

క్వారంటైన్‌ విషయంలో హాంకాంగ్‌ చేసిన పొరపాట్లు ఇతర దేశాలకు కూడా ఎదురై ఉండొచ్చని హాంకాంగ్ యూనివర్సిటీ అంటువ్యాధుల విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బెంజమిన్‌ కాలింగ్‌ అన్నారు. "14 రోజుల హోం క్వారంటైన్‌ విధానం బ్రిటన్‌లో కూడా ఉంది. అక్కడ కూడా ఇలాగే వైరస్‌ లీకయి ఉండొచ్చు'' అన్నారాయన. "ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లలో హోటల్‌ క్వారంటైన్‌ విధించారు. దాని ఖర్చులు ఎవరు భరిస్తారన్నది వేరే విషయమైనా, దీనికన్నా అది ఇంకా మంచి విధానం'' అన్నారు ప్రొఫెసర్‌ కాలింగ్‌.

హాంకాంగ్‌లాగే యూకే కూడా సరిహద్దుల్లో డ్రైవర్లు, వాహనాలు, నౌకా సిబ్బందికి అనేక మినహాయింపులు ఇచ్చింది.

సామాజిక దూరం నిబంధనల తొలగింపు

క్వారంటైన్‌కు మినహాయింపులు కొన్నినెలలుపాటు సాగినా థర్డ్‌వేవ్‌ రావడానికి జులై చివరి వరకు సమయం పట్టింది. జూన్‌లో సామాజిక దూరం నిబంధనలు సడలించడమే దీనికి ప్రధాన కారణమని ప్రొఫెసర్‌ మాలిక్‌ పెరిస్‌ అన్నారు.

"సామాజిక దూరం నిబంధనలు చాలాకాలంపాటు కొనసాగించాల్సినవి. ఒక్కసారిగా వాటికి సడలింపులు వస్తే, అప్పటి వరకు పోగై ఉన్న ఇన్‌ఫెక్షన్‌ వేగంగా వ్యాపిస్తుంది'' అన్నారు పెరిస్‌. "ఇది అందరికీ గుణపాఠం'' అన్నారాయన.

50మంది ఒకేచోట గుమిగూడటానికి జూన్‌లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఫాదర్స్‌డే, హాంకాంగ్‌ విలీన దినోత్సవాలు కూడా భారీ ఎత్తున జరిగాయని డాక్టర్‌ సాంగ్‌ గుర్తు చేశారు.

"చాలా రోజులపాటు సామాజిక దూరాన్ని పాటించి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో బంధువులు, స్నేహితులను కలుసుకోవడం మొదలు పెట్టారు. అన్ని లోపాలు ఒకేసారి బైటపడ్డాయి. ఇది దురదృష్టకరం'' అన్నారు సాంగ్‌.

మొదటి రెండు దశల సందర్భంగా నిబంధనల విషయంలో హాంకాంగ్‌వాసులు చాలా నిబద్ధతతో వ్యవహరించారని, ప్రభుత్వం తప్పనిసరి చేయక ముందే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించారని, సామాజిక దూరాన్ని పాటించారని, పరిశుభ్రతా చర్యలు చేపట్టారని ప్రొఫెసర్‌ పెరిస్‌ అన్నారు.

ఇప్పుడు మళ్లీ సామాజిక దూరం నిబంధనలు కఠినతరం చేశారు. కాబట్టి రాబోయే నాలుగు నుంచి ఆరు వారాల్లో హాంకాంగ్‌లో పరిస్థితులు మళ్లీ మామూలు అవుతాయని డాక్టర్‌ పెరిస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒకసారి సామాజిక దూరం నిబంధనలు తీసేశాక, ఇన్‌ఫెక్షన్‌ దేశంలోకి రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం అన్నారు పెరిస్‌. " జనంలో వ్యాప్తిని అడ్డుకున్నా, బైట నుంచి వైరస్‌ వస్తుంటే అది ఒక డిజాస్టర్‌లా మిగిలిపోతుంది'' అన్నారు డాక్టర్ పెరిస్‌.

ప్రజాస్వామ్య ఉద్యమం కూడా వ్యాప్తికి కారణమా ?

గత ఏడాది కాలంగా రగులుతున్న ప్రజాస్వామిక ఉద్యమాలు కూడా కోవిడ్‌ విషయంలో హాంకాంగ్‌కు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి.

అధికారులు అనుమతి ఇవ్వకపోయిన జులై 1న హాంకాంగ్‌లో వేలమంది ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారులు వీధుల్లోకి వచ్చారు. ఆ సమయంలో ఎక్కడా సామాజిక దూరం నిబంధనలు పాటించలేదు. ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ప్రతిపక్షాలు నిర్వహించిన ఓటింగ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హాంకాంగ్‌లో థర్డ్‌వేవ్‌కు ఇదే కారణమని చైనా ప్రభుత్వం ఆరోపించగా, ఇది అవివేకమైన, బాధ్యతారహితమైన చర్య అని ఒక రాజకీయవేత్త వ్యాఖ్యానించారు.

అయితే వైరస్‌ వ్యాప్తి పెరగడానికి ఇది కారణంగా చెప్పలేమని వైద్యనిపుణులు అంటున్నారు.

వ్యాప్తి గొలుసును సైంటిస్టులు గుర్తించగలరని, అయితే ప్రస్తుత పరిస్థితికి ఆ ఉద్యమంతో లింకు ఉందని చెప్పలేమని ప్రొఫసర్‌ కాలింగ్‌ అన్నారు. " దీనివల్ల కొంత వరకు ప్రభావం ఉండవచ్చు. అయితే ఇదే పూర్తి కారణమని చెప్పలేం'' అని ప్రొఫెసర్‌ పెరిస్‌ అన్నారు.

"మొదటి రెండు దశల్లో కరోనా వైరస్‌కు, మూడోదశలో కనిపించిన వైరస్‌కు కొంచెం తేడా ఉంది. ఫిలిప్పీన్స్‌, కజకిస్థాన్‌ల నుంచి వచ్చిన వైమానిక సిబ్బంది, నౌకాసిబ్బందిలో బైటపడ్డ వైరస్‌ను ఇది పోలి ఉంది. బహుశా ఇది విదేశాల నుంచి దిగుమతి అయ్యుంటుంది'' అని డాక్టర్‌ సాంగ్‌ అభిప్రాయపడ్డారు.

ఉద్యమాలు, నిరసనల కారణంగా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందా అన్న విషయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య తరవాత వచ్చిన నిరసనల సమయంలో దీనిపై చర్చ జరిగింది. అయితే మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సందర్బాలలో వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

వైరస్‌వ్యాప్తి భయంతో ప్రపంచవ్యాప్తంగా 68 దేశాలలో ఎన్నికలు వాయిదా పడగా, కొన్నిదేశాలలో అత్యధిక పోలింగ్‌ శాతంతో పోలింగ్‌ జరిగింది. హాంకాంగ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిని సెప్టెంబర్‌ వరకు వాయిదా వేయవచ్చన్న మాట ఆ దేశంలో వినిపిస్తోంది.

"ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు ఆలస్యం చేస్తే ప్రభుత్వం తనకు అనుకూల పరిస్థితి కోసం ఎదురు చూస్తోందని అంటారు.

ఎన్నికలు జరిపితే ప్రజల ప్రాణాలు తీసిందని ఆరోపిస్తారు'' అని సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ న్యాయవిభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న యూజిన్‌ టాంగ్‌ వ్యాఖ్యానించారు.

అయితే ఎన్నికలంటూ జరిగితే దాని వల్ల కేసులు పెరుగుతాయని, ప్రాణనష్టం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)