George Floydను ఎందుకు చంపేశారు? ట్రంప్ బంకర్‌లో ఎందుకు దాక్కున్నారు

వీడియో క్యాప్షన్, జార్జ్ ఫ్లాయిడ్‌ను ఎందుకు చంపేశారు? ట్రంప్ బంకర్‌లో ఎందుకు దాక్కున్నారు
ప్రచురణ

పోలీసుల చేతిలో నల్లజాతి వ్యక్తి జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు హింసాత్మకంగా మారటంతో.. వాటిని అణచివేయటానికి వేలాది మంది భారీ సాయుధ బలగాలను రంగంలోకి దించుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా 40కి పైగా నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే, వీటిని లెక్క చేయకుండా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు.

చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ దశలో ట్రంప్ వైట్ హౌస్‌లో ఉన్న బంకర్‌లోకి వెళ్లిపోయారు. ఇంతటి ఆందోళనలకు, హింసకు కారణం, నేపథ్యం ఏంటి?

నల్ల జాతివారిపై పోలీసుల అరాచకత్వంపై చాలా కాలంగా వ్యక్తమవుతున్న జనాగ్రహానికి జార్జ్ ఫ్లాయిడ్ మరణం ఘటన మరోసారి ఆజ్యం పోసింది.

ఆర్థిక, సామాజిక అసమానత్వం, తారతమ్యాలపై ఏళ్లుగా కూడగట్టుకున్న అసంతృప్తి, ఆవేదన కూడా ఈ నిరసనల్లో బయటపడుతోంది.

మినియాపోలిస్‌లో మే 25 సాయంత్రం కప్ ఫుడ్స్ అనే ఓ షాపులో జార్జ్ ఫ్లాయిడ్ ఓ సిగరెట్ ప్యాకెట్ కొన్నారు. అందుకు ఆయన 20 డాలర్ల నోటు ఇచ్చారు. షాపులో పని చేసే ఉద్యోగి ఆ నోటును నకిలీదిగా భావించి, పోలీసులకు ఫోన్ చేశారు.

ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో డెరెక్ షావిన్ అనే ఓ తెల్ల జాతి పోలీస్ అధికారి ఆయన మెడపై మోకాలితో బలంగా నొక్కి కూర్చున్నారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్జ్‌తో పాటు అక్కడున్న మిగతా వాళ్లు కూడా పోలీసును అలా చేయొద్దని వారించడం అందులో కనిపించింది.

''ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు'' అంటూ జార్జ్ మొరపెట్టుకున్నారు కూడా. పోలీసు వినిపించుకోలేదు. జార్జ్‌కు అవే ఆఖరి మాటలయ్యాయి. ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఎనిమిది నిమిషాల 46 సెకన్ల పాటు షావిన్ తన మోకాలితో ఫ్లాయిడ్ మెడను అలాగే నొక్కిపట్టి ఉంచారని విచారణ నివేదికలో ఉంది.

అయితే, అది మొదలైన ఆరు నిమిషాల్లో ఫ్లాయిడ్‌లో కదలికలు ఆగిపోయాయి. వీడియోల్లో అక్కడున్నవాళ్లు పోలీసులను ఫ్లాయిడ్ నాడి చెక్ చేయాలని అడగడం కనిపించింది.

ఫ్లాయిడ్ కుడి చేతిని పట్టుకుని ఓ అధికారు పల్స్ చూశారు. నాడీ స్పందన తెలియలేదు, అయినా పోలీసులు కదల్లేదు.

తర్వాత ఫ్లాయిడ్ మెడపై నుంచి షావిన్ తన మోకాలిని పక్కకు జరిపారు. ఏ కదలికలూ లేకుండా ఉన్న ఫ్లాయిడ్‌ను అప్పుడు హెనేపిన్ కౌంటీ మెడికల్ సెంటర్‌కు అంబులెన్స్‌లో తరలించారు. ఫ్లాయిడ్ మృతి చెందినట్లు ఆ తర్వాత ఓ గంటకు వైద్యులు ప్రకటించారు.

డెరెక్ షావిన్‌పై హత్యా నేరం నమోదైంది.

భగ్గుమన్న అమెరికా - చెలరేగిన నిరసనలు

ఫ్లాయిడ్ మరణంతో అమెరికా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో తీవ్ర హింస, నిరసనలు చెలరేగాయి. చాలా చోట్ల పోలీసు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. తగులబెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్, ఫ్లాష్ గ్రెనేడ్లను ప్రయోగించారు.

''ఫిలడెల్ఫియాలో శాంతి భద్రతల పరిస్థితి ఇదీ. వాళ్లు షాపులను దోచుకుంటున్నారు. నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దించాలి. క్కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలోనూ లూఠీ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి'' అని ట్రంప్ ట్వీట్ చేశారు.

జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన మినియాపోలిస్ నగరంలో హైవేపైకొచ్చిన నిరసనకారుల వైపు ఓ వ్యక్తి పెద్ద ట్రక్కుతో దూసుకువచ్చారు. ఆ ట్రక్కు ఆగిపోయిన తర్వాత లోపలున్న వ్యక్తిని అక్కడున్న జనం బయటకు లాగారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో ఇలా చేశారో తెలియదని మినెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ అన్నారు.

డెన్వర్ నగరంలో కొలరాడో స్టేట్ క్యాపిటల్ భవనం ముందు వేల మంది శాంతియుతంగా నిరసన తెలిపారు. నేలపై పడుకుని, 'ఐ కాంట్ బ్రీత్' అంటూ నినాదాలు చేశారు. అట్లాంటా, బోస్టన్, మయామి, ఓక్లహామా సిటీ తదితర ప్రాంతాల్లోనూ భారీ నిరసనలు జరిగాయి.

కొన్ని చోట్ల నిరసనకారులపై పోలీసులు అతిగా స్పందించినట్లుగా కూడా వార్తలొచ్చాయి. జార్జియాలోని అట్లాంటాలో ఇద్దరు విద్యార్థులపై టేజర్ ప్రయోగించినందుకు ఇద్దరు పోలీసులపై వేటు పడింది.

ఈ ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు. ఈ నిరసనల్లో వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదివరకు కూడా నల్ల జాతి వ్యక్తులు పోలీసుల చేతుల్లో మరణించిన ఉదంతాలు చాలా ఉన్నాయి. మైకేల్ బ్రౌన్, ఎరిక్ గార్నర్ లాంటి వారి మరణాలు సంచలనమయ్యాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి దారితీశాయి.

బంకర్‌‌లో దాక్కున్న ట్రంప్

ఆందోళనలు హింసాత్మక రూపందాల్చడంతో కొద్దిసేపు డోనల్డ్ ట్రంప్‌ను వైట్‌హౌస్‌లోని బంకర్‌లోకి తరలించారు.

వాషింగ్టన్‌ డీసీలో నేషనల్‌ గార్డ్స్‌కు చెందిన అదనపు బలగాలను రంగంలోకి దించారు. సాయుధులైన సెక్యూరిటీ సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. వైట్‌హౌస్‌లాంటి చారిత్రక కట్టడాలకు ఎలాంటి హానీ జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

కొన్ని నగరాల్లో పోలీసులతో నిరసనకారులు ఘర్షణలకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ బుల్లెట్లు ప్రయోగించారు. పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. చాలా నగరాల్లో దుకాణాలను లూఠీ చేశారు.

దేశీయంగా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వినియోగించే అమెరికా రిజర్వు సైనిక దళం నేషనల్ గార్డ్ తమ సిబ్బందిలో ఐదు వేల మందిని 15 రాష్ట్రాల్లో క్రియాశీలం చేసినట్లు తెలిపింది.

అనేక నగరాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో.. అల్లర్లను అణచివేయటానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతానని ట్రంప్‌ హెచ్చరించారు. ఇది శాంతియుత నిరసన కాదని, ప్రశాంతతకు భంగంవాటిల్లితే సహించేది లేదని స్పష్టం చేశారు. అల్లర్లు, లూటీలు, విధ్వంసం, దాడులు, ఆస్తుల ధ్వంసాలను ఆపటానికి సాయుధ సైనికులు, పోలీసులను పంపిస్తున్నానని చెప్పారు. గవర్నర్లు, మేయర్లు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)