రష్మి: ‘నేనొక పోల్ డాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌ని.. స్ట్రిప్ టీజ్ నేర్చుకోవడానికి గానీ, స్ట్రిపర్‌గా మారడానికి గానీ ఇక్కడికి ఎవ్వరూ రారు’
బీబీసీ ప్రతినిధి సారికా సింగ్ అందిస్తున్న కథనం.
భర్తతో విడిపోయాక ఎంతో ఒత్తిడి, భయాల మధ్య కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి పోల్ డాన్స్ ఎంచుకున్నారు రష్మి.
ముంబయిలో ఉండే రష్మి, తన లాంటి ఎంతో మంది ఒంటరి మహిళలతో పాటు.. అన్ని వయసుల వారికి పోల్ డాన్స్ నేర్పిస్తున్నారు.
భారత్‌లో పోల్ డాన్స్‌ని స్ట్రిప్ క్లబ్‌లో భాగంగా కాకుండా.. ఒక కళగా అంగీకరించాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు రష్మి.

నా పేరు రష్మి జాఠన్. నాకు 40 ఏళ్ళు. నేను ముంబయిలో ఉంటాను. నేనొక ప్రొఫెషనల్ పోల్ డాన్సర్‌ని. కొరియోగ్రఫర్‌ని కూడా. పోల్ డాన్స్ నేర్పిస్తుంటాను.
నా భర్త, ఇద్దరు పిల్లలే నా జీవితం అన్నట్టుగా ఉండేది. ఆయన నాకంటే 10ఏళ్ళు పెద్దవాడు. పెళ్ళైన 3నెలలకే ఆయనకి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అతని ఉద్యోగం పోయింది. అది తట్టుకోలేక తాగుడు ప్రారంభించాడు. ప్రతిరోజూ తాగివచ్చి రాత్రంతా గొడవ పడేవాడు. అలా నాలుగేళ్ళు గడిచాయి. 25 ఏళ్ల వయసులో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రజలేమనుకుంటారో అని ఆలోచించడం మానేయాలని అనుకున్నాను. ఆ నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది.
నేను డాన్స్‌ను వృత్తిగా ఎంచుకున్నాను. అందులోనే నాకు రాజిందర్ సింగ్ పరిచయమయ్యారు. మేం పెళ్ళి చేసుకున్నాం. ఆయన నాకు చాలా సాయంగా నిలబడతాడు. తనే నా చీర్ లీడర్. ఆయన నాకంటే ఆరున్నరేళ్ళు చిన్నవాడు.
పోల్ డాన్స్‌ని ఒలింపిక్స్‌లో భాగం చేయాలని ఉద్యమం చేస్తున్న వాళ్లలో నేను కూడా ఉన్నాను. మా లాంటి వారు చాలామంది ఈ ఆందోళనలో భాగమయ్యారు.

ఫొటో సోర్స్, instagram/rashmijathan82
నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న వారిలో 40, 50ఏళ్ళ వయసువారు కూడా ఉన్నారు. వాళ్లు డాన్స్ వీడియోలు తమ పిల్లలకు షేర్ చేస్తున్నారు. పిల్లలు వారిని ప్రోత్సహిస్తున్నారు.
ఈ మహిళలు ఇక్కడికొచ్చి.. తమ ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అన్నిటినీ పక్కన పెట్టి డాన్స్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఎవరేమనుకుంటారో అన్న భయాలతో వారు చాలా కాలంగా తమలోనే దాచేసిన ఒక కొత్త కోణాన్నిఇక్కడ బయటికి తీస్తారు.
భారత్‌లో మార్పు వస్తోందని నేను నూరు శాతం నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక తండ్రి నాకు ఫోన్ చేసి తన 18ఏళ్ళ కూతురికి పోల్ డాన్స్ నేర్పించాలని అడిగారు. చాలా మంది టీనేజ్ అమ్మాయిలు నా క్లాసులకు వస్తుంటారు. మొదట్లో సిగ్గుపడతారు, వాళ్ళు తమను తాము అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడరు.
నిన్ను నువ్వు ఒప్పుకోవడం మొదలుపెట్టిన తర్వాతే నిజమైన మార్పు వస్తుంది. డాన్స్ క్లాసుకి వచ్చినవారు శరీరంతో పాటు మనసుపై ఏకాగ్రత సాధిస్తారు. అలాంటి వారిని చాలామందిని నేనిక్కడ చూశాను.
భారత్‌లో ఇప్పటివరకూ స్ట్రిప్ క్లబ్‌లు లేవు. స్ట్రిప్ క్లబ్ అనేది విదేశాల నుంచి వచ్చిన కాన్సెప్ట్. మహిళలు రకరకాల కారణాలతో ఇక్కడికి వస్తుంటారు. కొందరు బాడీ షేమింగ్‌ను తిప్పికొట్టడానికి వస్తే, మరి కొందరు బ్రేకప్ బాధను మర్చిపోవడానికి వస్తుంటారు. స్ట్రిప్ టీజ్ నేర్చుకోవడానికి గానీ, స్ట్రిపర్‌గా మారడానికి గానీ ఎవ్వరూ ఇక్కడికి రారు.
ఇవి కూడా చదవండి:
- రిషి సునక్: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రితో భారత్‌కు మేలు జరుగుతుందా.. ఇరు దేశాల సంబంధాలు బలపడతాయా?
- 50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి - స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి
- యుక్రెయిన్-రష్యా: ఇతర దేశాల్లో శరణార్థులుగా ఉన్న పౌరులను ఈ చలికాలంలో తిరిగి రావొద్దన్న యుక్రెయిన్
- బ్రిటన్, అమెరికా మాత్రమే కాదు.. పోర్చుగల్, మారిషస్, సింగపూర్ సహా 8 దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే
- 'డర్టీ బాంబ్' అంటే ఏంటి? దీనిని యుక్రెయిన్ ఉపయోగిస్తుందా? రష్యా ఆరోపణలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)