Fiber Cylinder: ఫైబర్‌తో తయారైన వంట గ్యాస్ సిలిండర్లు... ఇవి ఎంత సురక్షితం?

వీడియో క్యాప్షన్, Fiber cylinder: కొత్తగా ఫైబర్‌తో తయారైన వంట గ్యాస్ సిలిండర్లు... ఇవి ఎంత సురక్షితం?
ప్రచురణ

స్టీల్‌తో తయారైన వంట గ్యాస్ సిలిండర్ల తో పోలిస్తే తక్కువ బరువున్న, సురక్షితమైనవిగా చెబుతున్న 'ఫైబర్ సిలిండర్లు' (కాంపోజిట్ సిలిండర్) ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చాయి.

ఆకర్షణీయమైన రంగు, డిజైన్,తక్కువ బరువు, వంటింట్లో మరకలు పడకుండా ఉండే స్వభావంతోపాటు, అనేక భద్రత ప్రమాణాలతో ఈ కొత్తరకం సిలెండర్‌ను తయారు చేశారని వీటి తయారీదారు, పంపిణీదారు అయిన భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెబుతోంది.

2021లో దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఈ తరహా సిలిండర్లను ఐఓసీ ప్రవేశపెట్టింది. ఈ మధ్య కాలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఫైబర్‌తో తయారైన వంట గ్యాస్ సిలిండర్లు

వీటి ప్రత్యేకత ఏంటి?

మనం ఇళ్లలోవాడే సాధారణ ఖాళీ సిలెండర్ బరువు 16 కేజీలు కాగా, అందులో నింపే గ్యాస్‌ బరువు 14 కేజీలు. మొత్తం బరువు దాదాపు 30 కేజీలు.

భారత్‌లో ఒక చిన్న కుటుంబం సరాసరి నెల గ్యాస్ వినియోగం 9 కిలోల వరకు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని 10 కేజీలు, ఐదు కేజీల చొప్పున గ్యాస్ నింపేందుకు వీలుగా ఫైబర్ సిలిండర్లు రూపొందించామని ఐఓసీ చెబుతోంది.

ఇందులో గ్యాస్ పరిమాణాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. పది కేజీల గ్యాస్ పట్టే సిలిండర్ మొత్తం బరువు దాదాపు 16 కేజీలు ఉంటుంది.

పెట్రోలియం శాఖ వారి 'పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) నివేదిక ప్రకారం 2022 జనవరి 1 నాటికి దేశంలో 30.53 కోట్ల యాక్టివ్ గృహ ఆధారిత గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

ఐఓసీ వర్గాల లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫైబర్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య సుమారు లక్ష వరకూ ఉంటుంది. ఇందులో తెలంగాణలో 12 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో ఏడు వేల మంది వరకు వినియోదారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)