ఝార్ఖండ్: స్కూల్ పరీక్షల్లో ఫెయిల్ చేశారంటూ.. టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

ప్రచురణ

ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రాక్టికల్స్ పరీక్షలో కొంతమంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతో ఆగ్రహించిన కొందరు విద్యార్థులు టీచర్‌ను, స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులను చెట్టుకు కట్టేసి కొట్టారని చెబుతున్నారు.

ఈ ఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా గోపీకందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మీటింగ్ పేరుతో విద్యార్థులు తమను పిలిపించి, కొట్టారని టీచర్ చెబుతున్నారు. గాయపడ్డ టీచర్‌ను చికిత్స కోసం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

‘‘నేను 9 గంటలకు స్కూలుకొచ్చా. క్లాసులోకి వెళ్తే సర్ మీటింగ్ పెట్టుకుందాం అన్నారు. మేం సరే అన్నాం. ఆ తర్వాత మేం బయటికొచ్చి నిలబడినప్పుడు 30.. 40 మంది కుర్రాళ్లొచ్చి అందరికీ కుర్చీలు వేశారు. మమ్మల్ని కూడా మీటింగుకు రమ్మని పిలిచారు. మాకు ఇలా జరుగుతుందని తెలీదు. కర్రలు లాంటివి తీసుకొచ్చారు. తప్పు మీదే అన్నారు. మేం మార్కులు ముందే పంపించేశాం. పాస్‌వర్డ్స్ అన్నీ వాళ్ల దగ్గరే ఉన్నాయి. హెడ్మాస్టరే వాటిని పంపిస్తారు. మేం అలా ఎందుకు చేస్తాం’’ అని ఒక టీచర్ కుమార్ సుమన్ పేర్కొన్నారు.

ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నామని అన్నారు.

‘‘ప్రాక్టికల్స్‌లో మార్కులు తక్కువ వచ్చాయని అడగడానికి వెళ్తే, తమను బెదిరించారని విద్యార్థులు ఆరోపించారు. దానిపై మేం విచారణ జరిపాం. విద్యార్థులు చెప్పినట్లు మార్కులు తక్కువ వేశారా లేదా అని అడిగినపుడు మాకు సరైన సమాధానం రాలేదు’’ అని గోపీకందర్ బీఈఈఓ సురేంద్ర హేంబ్రమ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

‘‘పహాడియా రెసిడెన్షియల్ స్కూల్లో బోధనపై విద్యార్థుల వ్యతిరేకత గురించి మాకు తెలిసింది. దానిపై విచారణ చేసేందుకు మా టీమ్ ఇక్కడకు వచ్చింది. దీంతో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో అందరితో ఒకసారి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అదే సమయంలో కొందరు విద్యార్థుల దగ్గర మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం. ఆ ఫోన్లు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాయి’’ అని గోపీకందర్ బీడీవో అనంత్ కుమార్ ఝా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)