You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Mosquito: చిమ్మచీకట్లో, పాడుబడిన భవనాల్లో వీళ్లు చేసే పని ఎందరినో వ్యాధుల నుంచి కాపాడుతోంది
అది ఒక పాడుబడిన భవనం... ఏ గదిలోకి తొంగి చూసినా చీకటే. చేతిలో టార్చ్‌లైట్, ఒక రబ్బర్ పైప్‌తో ఆ భవనంలోకి అడుగుపెట్టాడు శ్యామ్ సక్‌పాల్.
ఆ పాడుబడిన భవనంలో శ్యామ్ సక్‌పాల్ చేస్తున్న పని చూస్తే ఆశ్చర్యపోతారు. అక్కడ ఆయన దోమలను పట్టుకుంటున్నారు.
అవును.. వ్యాధులకు కారణమయ్యే దోమలను ఆయన పట్టుకుంటారు.
ఈ భవనంలోనూ ఆయన అదే పనిచేస్తున్నారు.
రబ్బరు పైప్ నోటిలో పెట్టుకుని దోమలకు దగ్గరగా తీసుకెళ్లి గట్టిగా ఆయన శ్వాస పీల్చుతుంటే దోమలు ఆ పైప్‌లోకి వచ్చేస్తున్నాయి.
అయితే, దోమలు ఆ పైప్ నుంచి శ్యామ్ గొంతులోకి వెళ్లకుండా అందులో ఓ ఫిల్టర్ ఉంటుంది. నోట్లో పైప్ పెట్టి గాలి పీల్చినప్పుడు దోమలు గొంతులోకి వెళ్లకుండా ఆ ఫిల్టర్ అడ్డుకుంటుంది.
దోమలు అందులోకి రాగానే ఆయన పైప్ రెండో వైపు వెంటనే మూసేస్తారు శ్యామ్.
శ్యామ్ సక్‌పాల్ గ్రేటర్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ)లో 'ఇన్‌సెక్ట్ కలెక్టర్'గా పనిచేస్తున్నరు.
ఏ దోమలను పట్టుకుంటారు..
ఎన్సెఫెలైటిస్ లాంటి వ్యాధులను వ్యాపింపచేసే క్యూలెక్స్ రకం దోమలను పట్టుకునేందుకు శ్యామ్ సక్‌పాల్ పనిచేస్తున్నారు. ఈ రకం దోమల వల్ల ప్రజలకు రోగాలు వస్తాయి.
ఇలాంటి దోమలను కేవలం చీకటిగా ఉండేటప్పుడే పట్టుకోగలుగుతారు.
అందుకే తెల్లవారుజామునే ఆయన పని మొదలుపెడతారు.
దోమలను పట్టుకోవడానికి ఆయన ముంబయిలోని ధారావి ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ పాడుబడ్డ భవనాల్లో ప్రతిగదినీ ఆయన పరిశీలిస్తారు.
ఈ దోమలు ఎంత డేంజరంటే..
'ఒక పెద్ద ఆడ దోమ.. ఐదు నుంచి పది మందికి వ్యాధులను వ్యాపింపజేయగలదు.
మేం దాన్ని పట్టుకుంటే దాదాపు ఏడు నుంచి పది మందికి అనారోగ్యం రాకుండా కాపాడినట్లు అవుతోంది. అదే నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది' అంటున్నారు శ్యామ్.
''ఈ క్యూలెక్స్ దోమలు కూర్చునే విధానం భిన్నంగా ఉంటుంది. కూర్చునేటప్పుడు ఈ దోమలు కాస్త వంగుతాయి. ఆడ క్యూలెక్స్ దోమలు చాలా ప్రమాదకరం. మగవి కాస్త ఫర్వాలేదు. మగ దోమలకు కూడా రెండు పొడవైన రెండు తొండాలు ఉంటాయి. కానీ, ఇవి అంత పదునుగా ఉండవు. కానీ ఆడ దోమకు ఒకటే పొడవైన తొండం ఉంటుంది. దీని సాయంతో ఇది రక్తాన్ని పీల్చేస్తుంది' అని క్యూలెక్స్ దోమలను పట్టుకోవడంలో ఎంతో అనుభవం ఉన్న శ్యామ్ వివరించారు.
ఎక్కడుంటాయి ఇవి
డ్రైనేజీలు, పాడుబడిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న భవనాల్లో క్యూలెక్స్ దోమలు గుడ్లు పెడుతుంటాయి.
అందుకే ధారావిలోని నిర్మాణంలోనున్న ఇళ్లకు శ్యామ్ వెళ్తుంటారు. ఈ రోజు ఈ ఇంటిని పరిశీలించేందుకు ఆయన అనుమతులు తీసుకున్నారు.
అయితే, చాలాసార్లు ఆయన ఇలా పరిశీలనకు రావడానికి ఇంట్లోవారు అంగీకరించరు. దీంతో బీఎంసీలో ఇన్‌సెక్ట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న శ్యామ్ లాంటివారికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
'పైప్‌తో దోమలను పీల్చడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్'
'దోమలను ట్యూబ్ ద్వారా లోపలకు పీల్చేటప్పుడు.. శక్తినంతా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే, దోమలతోపాటు దుమ్ము, పురుగులు కూడా ఒక్కోసారి లోపలకు వచ్చేస్తుంటాయి.
కొన్నిసార్లు ఇవి ఫిల్టర్లను దాటుకొని గొంతులోకి కూడా ప్రవేశిస్తుంటాయి.
దీంతో మేం దోమలు పట్టడానికి వెళ్లినతర్వాత రెండు, మూడు రోజులు ఇబ్బందులు పడేవాళ్లం. అయితే, ఇప్పుడు దోమలు పట్టడానికి వెళ్లిన తర్వాత నోటిలో నీళ్లు వేసుకొని పుక్కిలించడం, మందులు వేసుకోవడం లాంటివి చేస్తున్నాం. లేకపోతే రోజూ గొంతు ఇన్ఫెక్షన్‌లతో బాధపడాల్సి వస్తుంది' అని శ్యామ్ తాను చేసిన పనిలో ఇబ్బందులు చెప్పుకొచ్చారు.
పట్టుకున్న దోమలను ఏం చేస్తారంటే..
ఉదయం 15 నుంచి 20 దోమలను శ్యామ్ పడుతుంటారు. వీటిని ట్యూబ్‌లోనే ఆయన సీల్‌చేస్తారు.
బీఎంసీ పెస్ట్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు వీటిని అప్పగిస్తారు. ఎన్సెఫెలైటిస్‌కు కారణమయ్యే వుకెరెరియా బాన్‌క్రాఫ్టీగా పిలిచే పరాన్నజీవి ఈ దోమల తల, మొండం బాగాల్లో కనిపిస్తుంది.
వీటిపై పెస్టో కంట్రోల్ విభాగం అధ్యయనం చేస్తుంది. కోవిడ్-19 వ్యాప్తి తర్వాత ఎన్సెఫైలైటిస్ కారక దోమల సంఖ్య ముంబయిలో విపరీతంగా పెరిగిందని బీఎంసీ అధికారులు చెబుతున్నారు.
క్యూలెక్స్ దోమలతోపాటు ఫైలేరియా పరాన్నజీవుల జాడలు కనిపించేచోట బీఎంసీ ఫాగింగ్ చేస్తుంది.
ఆ తర్వాత ఇన్‌సెక్ట్ కలెక్టర్లు ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. ఇంకా ఏమైనా దోమలు ఉన్నాయేమో పరిశీలిస్తారు. ఈ పనంతా పూర్తయ్యేందుకు నాలుగు వారాల సమయం పడుతుంది.
ఎన్సెఫెలైటిస్ సోకితే, బాధితుల కాళ్లు పొంగిపోతాయి. పాదాలు కూడా వంకర్లు పోతాయి. మహారాష్ట్ర ఆరోగ్య విభాగం సమాచారం ప్రకారం.. ఒక్క మహారాష్ట్రలోనే 29,000 ఎన్సెఫెలైటిస్ కేసులు ఉన్నాయి. దేశంలోని 250 జిల్లాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. అందుకే ఇన్‌సెక్ట్ కలెక్టర్ల సాయంతో ఈ దోమల నివారణకు బీఎంసీ ప్రయత్నిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో 11 కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ల పాద ముద్రలు... కరవు వల్ల బయటపడిన అద్భుతం
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)