కశ్మీర్ లోయలో భయం నీడలో జీవిస్తున్న కశ్మీరీ పండితులు, కశ్మీరేతరులు
కశ్మీర్‌లో పోయినేడాది అక్టోబర్ నుంచి టార్గెటెడ్ కిల్లింగ్ కేసులు పెరిగాయి.
లోయలో నివసించే కశ్మీరీ పండితులు, కశ్మీరేతరులే ఎక్కువగా హతులయ్యారు.
బుధవారం కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన ఒక జవాబులో – ఆగస్టు 2019 నుంచి ఈ ఏడాది జులై 9 వరకు లోయ నుంచి కశ్మీరీ పండితులెవ్వరూ వలస వెళ్లలేదని తెలిపింది.
అయితే, క్షేత్రస్థాయి వాస్తవాలు మరో విధంగా ఉన్నాయని బీబీసీ పరిశోధనలో తేలింది.
లోయలో ఉద్యోగాలు చేసే వాళ్లలో అత్యధిక కశ్మీరీ పండితులు జమ్మూకు వెళ్లిపోయారు.
బీబీసీ ప్రతినిధి కీర్తి దుబే అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
కశ్మీర్ లోయలో ముప్పయ్యేళ్ల తర్వాత కశ్మీరీ పండితులు మరోసారి భయం నీడలో బతుకుతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం, అగస్ట్ 2019 నుంచి కశ్మీర్‌లో 14 మంది హిందువులు, కశ్మీరేతరులు టార్గెటెడ్ హత్యలకు గురయ్యారు. వీరిలో నలుగురు కశ్మీరీ పండితులు. కానీ మే 12న రాహుల్ భట్ హత్య జరిగిన తీరుతో... కశ్మీరీ పండితులకు 90ల నాటి రోజుల్ని గుర్తు చేసినట్టయ్యింది. సాయుధుడు చందూరాలోని తహసీల్ ఆఫీసులో చొరబడి రాహుల్ భట్‌పై కాల్పులు జరిపారు. ఇది మొట్టమొదటి టార్గెటెడ్ కిల్లింగ్ కేసు. కట్టుదిట్టమైన భద్రత మధ్యే సాయుధుడు ముందుగా రాహుల్‌ను పేరు అడిగి, ఆ తర్వాత కాల్చి చంపాడు. 2019 అగస్ట్ 5న జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35Aలను తొలగించిన తర్వాత మొదలై, పోయినేడాది అక్టోబర్ నుంచి పెరిగిన టార్గెటెడ్ కిల్లింగ్స్‌లో భాగంగానే రాహుల్ భట్ హత్య జరిగింది.
రాహుల్ భార్య మీనాక్షి... వృద్ధాప్యంలో భర్తతో కలిసి హరిద్వార్‌లో స్థిరపడటానికి ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పెళ్లయ్యి నిండా తొమ్మిదేళ్లు నిండకుండానే ఆమె రాహుల్‌ను కోల్పోవాల్సి వచ్చింది.
చందూరా తహసీల్‌లో రాహుల్ క్లర్కుగా పని చేసేవారు. ఆయనకీ ఉద్యోగం పీఎం రిహాబిలిటేషన్ ప్లాన్‌లో భాగంగా దొరికింది. ట్రాన్జిట్ క్యాంపులో ప్రభుత్వం నుంచి క్వార్టర్ పొందిన అతి కొద్ది కశ్మీరీ పండిత్ కుటుంబాల్లో రాహుల్ కుటుంబం ఒకటి. ఆయన బడ్‌గామ్‌లోని షేఖ్‌పురా క్యాంపులో ఉంటుండే వారు. దాన్ని అన్నింటికన్నా హై సెక్యూరిటీ క్యాంపుగా భావిస్తారు.
2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కశ్మీరీ పండితుల కోసం పునరావాస ప్యాకేజ్ ప్రకటించింది.
2010లో ఈ ప్యాకేజీలో భాగంగా మొదటిసారి రిక్రూట్‌మెంట్ జరిగింది. పన్నెండేళ్ల తర్వాత ఈరోజు ఈ ప్యాకేజీలో భాగంగా దాదాపు 5 వేల మంది లోయలో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వీరిలో 12 శాతం మందికి మాత్రమే భద్రత గల అకామడేషన్ దొరికింది.
వాళ్లలో ఒకరి అమిత్ రైనా. ఈయనకు ట్రాన్జిట్ క్యాంప్‌లో చోటు లభించలేదు. ఈయన తన కుటుంబంతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే... అమిత్, ఆయన కుటుంబం ఇంట్లోంచి బయటకు కూడా రావడం లేదు.
2008లో యూపీఏ ప్రభుత్వం ఈ ప్యాకేజీని ముందుకు తెచ్చింది. అందులో 3 వేల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం మరో 3 వేల ఉద్యోగాలు అదనంగా ప్రకటించింది. అలా మొత్తం 6 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని, సురక్షితమైన ఆవాసాలు ఇస్తామని వీరికి హామీ ఇచ్చారు.
కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించాక, దీని ద్వారా పండితులకు కశ్మీర్‌లో పునరావాసం కల్పించడం సులువవుతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
కానీ అసలు కశ్మీరీ పండితులు దీంతో ఏ మేరకు ఏకీభవిస్తున్నారు?
టార్గెటెడ్ కిల్లింగ్ కేసులు పెరుగుతుండటంతో తమకు లోయ బయట పోస్టింగ్ ఇవ్వాలని కశ్మీరీ పండితులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం వీరికి హెడ్‌క్వార్టర్ ఆఫ్ సేఫ్ జోన్‌లో పోస్టింగ్ ఇస్తోంది.
కొన్ని డిపార్ట్‌మెంట్లలో పీఎం ప్యాకేజీలో భాగంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆదారబాదరాగా ప్రమోషన్లు కూడా ఇచ్చేస్తున్నారు.
ట్రాన్జిట్ క్యాంపులో క్వార్టర్ దొరికిన వాళ్లకు కూడా జీవితం అంత సులువుగా ఏమీ లేదు. ఇక్కడ ఉంటున్న వాళ్లు క్యాంపు బయటి ప్రపంచాన్ని చూడక నెలలు దాటింది.
ఇక్కడ ఉంటున్న కశ్మీరీ పండితులు కేవలం ఒకే ఒక్క డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలనేదే ఆ డిమాండ్.
ఈ కేసు విచారణ కోసం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా మే 13న ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఏర్పాటు చేశారు.
కానీ ఆ విచారణ ఎంత వరకు వచ్చిందనే సమాచారం మీడియాకు లేదు, రాహుల్ కుటుంబానికి కూడా లేదు.
కశ్మీరీ పండితులు గత రెండు నెలలుగా ఆఫీసులకు వెళ్లడం లేదు. వీరిలో దాదాపు 80 శాతం మంది జమ్మూకు వెళ్లిపోయారు. లోయలో ఉండిపోయిన వారు తమ ఇళ్లలోంచి బయట అడుగుపెట్టలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ముస్లింలు మైనారిటీలుగా ఉన్న దేశాలకు వెళ్లి పిల్లల్ని కనండి’ అని పాకిస్తాన్ మంత్రి ఎందుకు అన్నారు?
- పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక: గోదావరి వరదల్లో చిక్కుకున్న వీటిని ఆదుకునేది ఎవరు?
- చైనా: పిచ్చుకలపై యుద్ధం కోట్లాది మంది ప్రజల చావుకు ఎలా కారణమైంది? దేశం నరకంలా ఎందుకు మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)