ఉద్యోగులు, యాజమాన్యం అంతా మహిళలే... గుజరాత్‌లోని ఒక రబ్బర్ ఫ్యాక్టరీలో భారీ యంత్రాలపై పని

ప్రచురణ

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నగరంలో ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో మేనేజింగ్ డైరెక్టర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకూ అత్యధికులు మహిళలే. సాధారణంగా పురుషులు మాత్రమే ఆపరేట్ చేసే హెవీ మెషీన్లను సైతం ఈ ఫ్యాక్టరీలో మహిళలే నడిపిస్తున్నారు.

ఈమె పేరు జయశ్రీ పర్ఘీ. ఈమె గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో ఉంటారు. ఎక్కువగా పురుషులు మాత్రమే చేసే వృత్తిని ఎంచుకోవడం తనకు గర్వంగా ఉందంటారామె. రాజ్ కోట్ లోని ఈ రబ్బర్ ఫ్యాక్టరీ... ఈ ప్రాంతంలో ఉండే అనేక ఇతర ఫ్యాక్టరీల లాంటిదే. కానీ ఇక్కడ పనిచేసే ఉద్యోగులే ఈ ఫ్యాక్టరీ ప్రత్యేకత. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి ఉద్యోగుల వరకూ ఈ ఫ్యాక్టరీలో పని చేసే వారిలో అత్యధికులు మహిళలే.

‘‘చిన్న చిన్న పరిశ్రమల్లో జీతాలు చాలా తక్కువగా ఇస్తారు. మా ఊర్లో నేను అలాంటి ఓ చిన్న ఫ్యాక్టరీలో పని చేసేదాన్ని. అక్కడ నాకు 5 రోజుల పని దొరికితే... మరో 5 రోజులు పని ఉండేది కాదు. దాంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాది ఫుల్ టైం ఉద్యోగం. జీతం కూడా ఎక్కువే. పురుషులు మాత్రమే చేయగలిగి, స్త్రీలు చేయలేని పనులంటూ ఏవీ ఉండవు. దీన్ని నిరూపించడానికే నేను ప్రెస్ మెషీన్‌ను ఆపరేట్ చేసే పనిని ఎంచుకున్నాను’’ అని జయశ్రీ పర్ఘీ అన్నారు.

రబ్బర్ ఫ్యాక్టరీల్లో సాధారణంగా పురుషులే పనిచేస్తుంటారు. ఎందుకంటే, ఇక్కడ పని చాలా కష్టంగా ఉంటుంది. పెద్ద పెద్ద మెషీన్లతో పనిచేయాల్సి ఉంటుంది.

ఇక్కడ మహిళా ఉద్యోగులకు అవసరమైన ట్రైనింగ్‌తో పాటు సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. అలా మహిళలు తమ పనుల్ని సమర్థవంతంగా, కచ్చితంగా చేసేలా చూస్తున్నారు. ఇక్కడ మహిళా ఉద్యోగినులకు ఇంటినుంచి పనిచేయడం కంటే ఫ్యాక్టరీలో పనిచేయడమే సౌకర్యంగా ఉంటుంది.

మహిళా ఉద్యోగులనే ఎందుకు ఎంచుకున్నారు అని అడిగినప్పుడు, పురుషుల కంటే మహిళలు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తారన్నారు ఈ కంపెనీ సీఈఓ.

‘‘పురుషుల శరీర నిర్మాణం ప్రకారం, వాళ్లు ఎక్కువ పని చేస్తారని మనం కచ్చితంగా చెప్పొచ్చు. కానీ టైమ్ మేనేజ్‌మెంట్‌ను చూసినట్టయితే, చాలా రకాలుగా మహిళలే నయం. టీ తాగడం, స్మోకింగ్, కబుర్లు చెప్పుకోవడంలో పురుషులు ఎక్కువ టైం వృధా చేస్తారు. వాళ్లు ఫోన్లలో ఎక్కువ టైం మాట్లాడుతుంటారు. మహిళా ఉద్యోగుల్లో ఇది కనిపించదు. అలాగే, మహిళా ఉద్యోగులు ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారు. మనసు పెట్టి పనిచేస్తుంటారు. ఇక్కడుండే పని స్వభావాన్ని బట్టి మేం వారికి దాదాపు 15-20 రోజులపాటు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత వాళ్లు చాలా బాగా విధులు నిర్వర్తిస్తున్నారు’’ అని జెనిత్ రబ్బర్ ఫ్యాక్టరీ సీఈఓ స్నేహ గనత్రా చెప్పారు.

రాజ్‌కోట్‌లో ఇలాంటి ఫ్యాక్టరీలు దాదాపు 17వేలున్నాయి. వాటిలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు. వారిలో అత్యధికులు వలస కార్మికులే. అయితే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ఫ్యాక్టరీ ఒక ఉదాహరణగా నిలిచింది. సమాజంలో అన్ని వర్గాల వారూ ఈ ఫ్యాక్టరీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)