You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ఈ మహిళల సంస్థకు పేరు కూడా లేదు, కానీ వీళ్ల ఉత్పత్తులు అమెరికా వెళ్తున్నాయి
చాలా మంది విజయసూత్రం థింక్ బిగ్, థింక్ స్మార్ట్ అయితే 'మేక్ బిగ్' విధానమే తమ సక్సెస్ మంత్రా అంటున్నారు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ గ్రామ మహిళలు.
వంటింటి విద్యకు తమదైన శైలిని జోడించి ఏటా సుమారు 4 కోట్ల రూపాయల చిరుతిళ్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వారు నిర్మించారు.
‘‘పిండి వంటలంటే పెద్ద సైజు అప్పాలు, లడ్డూలు, కర్జలు. పావు కేజీకి ఒక కర్జ, కిలో లడ్డూ. అర్ష అంటే కేజీకి 5 తూగుతాయి అంత పెద్ద సైజు ఉంటాయి. సకినాలంటే 30 లైన్స్ ఉంటాయి, కేజీకి మూడు తూగుతాయి. మా దగ్గర సారెకు అంత పెద్ద సైజువి పెడతారు కాబట్టి అదే మా ప్రత్యేకత’’ అని బీబీసీకి వివరించారు బిగ్ సైజ్ అప్పాల తయారీ మహిళల్లో ఒకరైన లక్ష్మీదేవి.
15ఏళ్ళ క్రితం ఒక స్వయం సహాయక మహిళా సంఘంతో ప్రారంభమైన చిరుతిళ్ల తయారీ ప్రస్తుతం 7 గ్రూపులకు విస్తరించి కుటీర పరిశ్రమగా మారింది. శుభముహూర్తాల సీజన్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తోంది.
‘‘పల్లెటూరు కదా ఈ విలేజీకి ఎవరిస్తరు అనుకున్నాం. బ్రాండ్ ఏమీ లేదు. ఒక నేమ్ అంటూ ఏమీ పెట్టుకోలేదు. కాకపోతే నాణ్యతగా పదార్థాలు పంపేది. ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా వచ్చాయే తప్ప దీనికంటూ నేమ్ పెట్టుకోలేదు. ఒకరి నుండి ఒకరికి చైన్ సిస్టంలాగా తెలిసిపోయిందే తప్ప అడ్వర్టైజ్ చేసుకోలేదు’’ అని లక్ష్మీ దేవి చెప్పారు.
వరంగల్ , హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా తమకు ఆర్డర్లు వస్తుంటాయని, ఇప్పుడు అమెరికాకు కూడా చేరుకున్నామని ఆమె తెలిపారు.
‘‘సంవత్సరానికి మినిమం 70 లక్షల రూపాయల విలువైన ఆర్డర్స్ వస్తాయి. అందులో 60 శాతం ఖర్చు అవుతది. 40 శాతం మిగులుతది. మేమే కాకుండా మా తోటి 50 మంది వర్కర్స్ కు ఉపయోగపడుతున్నాం. అంచెలంచెలుగా ఎదుగుతున్నరు. పిండి పట్టడానికి, కట్టెలు తెస్తరు. మా ఊరిలో ఉన్న 7-8 ట్రాన్స్ పోర్ట్స్ కి బెనిఫిట్స్ తెప్పిస్తయి. మా ట్రాన్స్ పోర్ట్ అంతా వారే చేస్తరు. పిండి గిర్నీ వారికి కూడా నెలకి 40 వేలు వస్తది’’ అని లక్ష్మీదేవి వివరించారు.
పిండివంటల తయారీ తమకు ఆర్థిక స్వావలంబన ఇచ్చిందని, తమ కాళ్లపై తాము నిలబడేలా చేసిందని సుల్తాన్ పూర్ మహిళలు చెబుతున్నారు.
నాణ్యమైన వరివంగడాల ఉత్పత్తికి పేరొందిన సుల్తాన్ పూర్ గ్రామం, ప్రస్తుతం 'బిగ్ సైజ్' పిండి వంటకాలకు కేరాఫ్ గా మారింది. ఈ ఊరి మహిళలను స్పూర్తిగా తీసుకుని చుట్టుపక్కల మరో 5 గ్రామాల్లోని మహిళలు పిండివంటల తయారీ ప్రారంభించి ఆర్డర్లు పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..
- తాజ్మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- సి విటమిన్ మన వయసు పెరగకుండా ఉండటానికి ఎంతవరకూ సాయపడుతుంది? అధ్యయనాలు, ఆధారాలు ఏం చెప్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)