తెలంగాణ: కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్య... మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు

వీడియో క్యాప్షన్, తెలంగాణ: కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్య... మున్సిపల్ చైర్మన్ సహా ఏడుగురిపై కేసు
ప్రచురణ

తెలంగాణలోని కామారెడ్డిలో శనివారం తల్లీకొడుకుల మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభ్యం అయ్యాయి. ఈ ఘటనలో మెదక్ జిల్లా రామాయంపేట్‌కు చెందిన తల్లీకొడుకులు గంగం సంతోష్ (35), పద్మ (65) నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కామారెడ్డి పోలీసులు చెప్పారు.

చనిపోవటానికి ముందు మృతులు సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోలో రామాయంపేట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తుల వేధింపులవల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పారు.

ఉదయం 6 గంటల ప్రాంతంలో లాడ్జీలోని 203 నంబర్ గది నుండి పొగలు రావడంతో లాడ్జ్ సిబ్బంది పోలీస్, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

ఈ తల్లీకొడుకులు వైద్యచికిత్స కోసం ఈ నెల 11వ తేదీన కామారెడ్డికి వచ్చినట్టు లాడ్జ్‌లోని లాగ్ బుక్‌లో వివరాలు నమోదై ఉన్నాయి.

కామారెడ్డిలో పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను పోలీసులు రామాయంపేట్‌కు తరలించారు. రామాయంపేట్‌లో మృతదేహాలతో కుటుంబసభ్యులు మున్సిపల్ చైర్మన్ జితేందర్‌ గౌడ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఈ తల్లీకొడుకులు వీడియోలో ఆరోపించిన పేర్లలో రామాయంపేట్ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాప్ యాదగిరిలతో పాటు గతంలో అక్కడ సీఐగా పనిచేసిన నాగార్జునగౌడ్‌ల పేర్లు ప్రధానంగా పేర్కొన్నారు. వీరితో పాటు ఐరేని పృథ్వీరాజ్, తోట కిరణ్, కన్నాపురం కృష్ణాగౌడ్, స్వరూప్‌ల పేర్లు వీడియోలో చెప్పారు.

చేయని తప్పుకు తన కొడుకును జితేందర్ జైలు పాలు చేశాడని, అతని సెల్‌ఫోన్ పది రోజుల పాటు ఉంచుకున్నారని, అందులోని డాటాను కాపీ చేసుకుని తరచూ వేధిస్తున్నారని, వారి కారణంగానే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని, వారిని శిక్షించాలని పద్మ తన వీడియోలో కోరారు.

కామారెడ్డి

గత 18 నెలలుగా ఏడుగురు వ్యక్తుల వల్ల తమ కుటుంబం మనశ్శాంతి కోల్పోయిందని, ఆస్తులు కోల్పోయానని, అప్పుల పాలయ్యానని మృతుడు గంగం సంతోష్ వీడియోలో ఆరోపించారు. గతంలో ఓ కేసు విషయంలో తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అందులోని డాటాను కాపీ చేసుకుని అప్పటి సీఐ నాగార్జునగౌడ్ మున్సిపల్ చైర్మన్ జితేందర్‌ గౌడ్‌కు ఇచ్చారని ఆ డాటా ఆధారంగా తరచూ వేధింపులకు పాల్పడుతున్నారని వీడియోలో ఆరోపించారు. ఈ విషయంలో గతంలో మెదక్ జిల్లా ఎస్పీతో పాటు పలువురు నాయకులకు ఆయన ఆర్జీ పెట్టుకున్నారు.

మృతుల సెల్ఫీ వీడియో ఆధారంగా, వీడియోలో ఆరోపించిన ఏడుగురిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.

''మృతులు ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియో ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో మరిన్ని వివరాలు తేలుతాయి'' అని కామారెడ్డి డీఎస్‌పీ సోమనాథం మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)