తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు - టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆగ్రహం

ప్రచురణ

2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అంశం జాతీయ స్థాయిలో తాజాగా మరోసారి చర్చనీయమైంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ఈ అంశం ప్రస్తావనకు తేవడంతో నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చేసిన తీరు సక్రమంగా లేకపోవడంతో ఏపీ, తెలంగాణ రెండూ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

''తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకం కాదు. వాజపేయీ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుతంగా అన్ని పక్షాలూ కలిసి మాట్లాడుకుని ఆ మూడు రాష్ట్రాల బిల్లులను ఆమోదించుకున్నారు. కానీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ అలా జరగలేదు'' అన్నారు మోదీ.

''పార్లమెంటులో మైకులు ఆపేశారు. కాంగ్రెస్ సభ్యులు పెపర్ స్ప్రే చల్లారు. ఎలాంటి చర్చ లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. అలాంటి విభజన కారణంగా ఏపీ, తెలంగాణ రెండూ ఇప్పటికీ నష్టపోతున్నాయి. కాంగ్రెస్ అహంకారపూరిత ధోరణి ఈ విభజనలో కనిపించింది'' అని మోదీ అన్నారు.

మోదీ! అప్పుడేమైంది నీ సమాఖ్య స్ఫూర్తి?: హరీశ్ రావు

ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తంచేశారు.

తెలంగాణ వచ్చిందని ప్రజలంతా సంతోషిస్తుంటే ప్రధాని మాత్రం ఎందుకో దుఃఖపడుతున్నారని హరీశ్ రావు అన్నారు.

తెలంగాణపై ద్వేషం చిమ్ముతున్నారు మోదీ, గతంలో కూడా ఇలాగే మాట్లాడిన మోదీ ఇప్పుడు పార్లమెంటులోనూ మాట్లాడారు అన్నారు హరీశ్.

అభివృద్ధిలో తెలంగాణ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ను దాటి వెళ్తోందని మోదీకి అక్కసు ఉన్నట్లుందన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాకే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటూ ప్రభుత్వ పథకాలను ఒక్కటొక్కటిగా వివరించారు.

తెలంగాణ ఏర్పాటు సమాఖ్య స్ఫూర్తికి ఎలా విరుద్ధమో చెప్పాలని హరీశ్ రావు మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు.

'ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు. కాకినాడలో తీర్మానం చేశారు. గెలిచాక తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ, గెలిచాక తెలంగాణ ఏర్పాటు చేయలేదు'' అన్నారు.

తెలంగాణ ఏర్పడిన కొన్ని గంటల్లోనే ఏడు తెలంగాణ మండలాలను, దిగువ సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారని... ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా అని హరీశ్ ప్రశ్నించారు.

10 పైసలకే కరెంటు వచ్చే తెలంగాణకు చెందిన దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రానికి చెప్పకుండానే ఏపీకి అప్పగించి సమాఖ్య స్ఫూర్తికి మోదీ తూట్లు పొడిచారని హరీశ్ ఆరోపించారు.

కాకినాడ తీర్మానం ప్రకారం బీజేపీ తెలంగాణను ఏర్పాటు చేస్తే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని వందల మంది ప్రాణాలు పోయేవి కావని, విద్యార్థులు అమరులయ్యేవారు కారని హరీశ్ అన్నారు.

టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే: రేవంత్ రెడ్డి

మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేశారు. రెండు పార్టీలూ కూడబలుక్కుని రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

రెండు రోజుల నుంచి మోదీ చట్టసభలలో తెలంగాణ గురించి మాట్లాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదని రేవంత్ అన్నారు.

టీఆర్ఎస్ ఎంపీలు కనీసం నిరసన తెలపడానికి కూడా ముందుకు రాలేదన్నారు.

టీఆర్ఎస్, బీజేపీలు గూడుపుఠానీ చేస్తున్నాయని... టీఆర్ఎస్ బీజేపీని తిడుతుందని... బీజేపీ తెలంగాణను తిడుతుందని... ఇద్దరూ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లే వీళ్లుగా, వీళ్లే వాళ్లుగా మారి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)