IAS, IPS అధికారుల డెప్యుటేషన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా మధ్య వివాదం ఎందుకు?

ప్రచురణ

ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య కొద్ది రోజులుగా వార్ నడుస్తోంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అంటే ఎవరో కాదు జిల్లాల్లో ఉండే కలెక్టర్లు, ఎస్పీలే. ర్యాంకులు, సీనియారిటీ ఆధారంగా వారి హోదాలు, చేసే ఉద్యోగాలు మారుతుంటాయ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ అనే పదాలు తరచూ వార్తలో వింటూ ఉంటాం కదా... వారంతా అత్యంత సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులే. ఈ వివాదానికి మూలం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల డెప్యుటేషన్‌కు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి వారు ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు.

ఎంతమందిని పంపాలో నిర్ణయించేది కేంద్రమే

ప్రతి సంవత్సరం రాష్ట్రాలు కొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేసుకునే అఖిల భారత అధికారులకు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ వచ్చినా వారి కెరియర్‌లో కొంత కాలం కేంద్రప్రభుత్వంలో పని చేయాల్సి ఉంటుంది. దీనినే డెప్యుటేషన్ అంటారు. కేంద్ర పథకాలు అమలు చేయడానికి, అక్కడ మంత్రిత్వశాఖల్లో పని చేయడానికి, సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలను నడిపేందుకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కేంద్రానికి కావాలి.

ఇప్పుడు గొడవంతా ఈ డెప్యుటేషన్ చుట్టూనే. ఎంత మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను కేంద్రానికి పంపాలో ఇకపై తామే నిర్ణయిస్తామంటూ 1954 ఐఏఎస్ క్యాడర్ రూల్స్‌కు సవరణలు ప్రతిపాదించింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి కేంద్రానికి డెప్యుటేషన్ మీద వెళ్లే ఐఏఎస్‌, ఐపీఎస్‌ల సంఖ్య ఆ రాష్ట్రంలోని మొత్తం అధికారుల్లో 40శాతానికి మించకూడదు. అంటే కొత్త రూల్స్ ప్రకారం ఎంత మంది అధికారులను డెప్యుటేషన్ మీద పంపాలో కేంద్రమే డిసైడ్ చేస్తుంది.

మౌనం అంగీకారం

ఉదాహరణకు ఓ 10 మంది ఐఏఎస్‌లు, మరొక 10 మంది ఐపీఎస్‌లను పంపమని కేంద్రం ఆంధ్రా, తెలంగాణలను అడిగింది అనుకుందాం. కొత్త నిబంధనల ప్రకారం పలాన తేదీ లోపు అధికారులను రిలీవ్ చేసి పంపండి అంటూ రాష్ట్రాలకు గడువు ఇస్తుంది కేంద్రం. ఆ గడువులోపు తమ నిర్ణయాన్ని కేంద్రానికి ఆంధ్రా తెలంగాణ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకోకుంటే గడువు దాటిన తరువాత కేంద్రం అడిగిన అధికారులు రాష్ట్ర సర్వీసుల నుంచి ఆటోమేటిక్‌గా రిలీవ్ అయిపోతారని కొత్త నిబంధనలు చెబుతున్నాయ్. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక అధికారి కేంద్రానికి డెప్యుటేషన్ మీద వెళ్లాలంటే రాష్ట్రం అనుమతించాల్సి ఉంటుంది.

రాష్ట్రాలది ప్రేక్షక పాత్రేనా?

మొత్తానికి కొత్త నిబంధనల ప్రకారం అఖిల భారత అధికారుల డెప్యుటేషన్‌కు సంబంధించి రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఏమైనా విభేదాలుంటే కేంద్రం మాటే చెల్లుబాటు అవుతుంది. తమపై పెత్తనం చెలాయించేందుకే ఇటువంటి రూల్స్ కేంద్రం తీసుకొస్తోందంటూ చాలా రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయ్. ప్రధానంగా ప్రతిపక్షాల పాలనలోని తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, కేరళ, ఒడిశాలాంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు సమ్మతి తెలుపుతుండగా ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇంకా ఏ నిర్ణయమూ చెప్ప లేదు.

రాష్ట్రాలు కేంద్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయా?

అఖిలభారత అధికారుల్లో ప్రధానంగా ఐఏఎస్‌ల కొరతను ఎదుర్కొంటున్నట్లు కేంద్రం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ పాలన, పథకాల అమలుకు సరిపడా అధికారులు లేరని అంటోంది. డెప్యుటేషన్ విషయంలో కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయనే వాదనలున్నాయి. అధికారులను డెప్యుటేషన్ మీద పంపేందుకు అంగీకరించకపోవడం, ఒకవేళ అంగీకరించినా వారిని రిలీవ్ చేయడానికి రాష్ట్రాలు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కేంద్రంలో పాలన గాడి తప్పుతోందనేది కొందరి నిపుణుల మాట.

నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది డెప్యుటేషన్‌కు అందుబాటులో ఉన్న అధికారుల లిస్ట్‌ను కేంద్రానికి రాష్ట్రాలు పంపాలి. కానీ ఇది సవ్యంగా జరగటం లేదని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు జాబితాను పంపడం లేదని జేడీ లక్ష్మీనారాయణ వంటి మాజీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 5,200 మంది ఐఏఎస్‌లు ఉంటే, వారిలో 450 మంది మాత్రమే డెప్యుటేషన్ మీద కేంద్రంలో ఉన్నారు. దీంతో కేంద్రంలో చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయని, ఒకోసారి ప్రైవేటు వ్యక్తులను తీసుకోవాల్సి వస్తోందని లక్ష్మీనారాయణ 10టీవీతో మాట్లాడుతూ అన్నారు. ఇక అధికారుల డెప్యుటేషన్ మీద తగిన సమయంలో నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రాలు కాలయాపన చేస్తున్నాయనేది మరొక విమర్శ. అందుకే కొత్త నిబంధనల్లో కేంద్రం గడువును నిర్దేశించిందని నిపుణులు అంటున్నారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కొరత

చాలా రాష్ట్రాల్లో కూడా అధికారుల కొరత ఉందని, ఇందుకు కేంద్రం నిర్లక్ష్యమే కారణమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. 2020 జనవరి నాటికి 6,715 ఐఏఎస్ పోస్టుల్లో 1,510 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 4,982 ఐపీఎస్ పోస్టుల్లో భర్తీ చేయనవి 908. 2012 నుంచి ఏడాదికి 180 ఐఏఎస్ పోస్టులు మాత్రమే ఫిల్ చేస్తున్నారు. 2009 నుంచి ఏడాదికి 150 మంది ఐపీఎస్‌లను రిక్రూట్ చేసుకుంటూ ఉండగా 2020లో ఈ సంఖ్యను 200కు పెంచారు.

జిల్లాలు పెంచిన నేపథ్యంలో తమకు అదనంగా ఐఏఎస్‌లు కావాలంటూ గతంలో కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి ఉన్నారు. ఇటు ఆంధ్రాలోనూ కొత్త జిల్లాలు ఏర్పడితే అదనంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాల్సి వస్తుంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో శాంక్షన్ చేసిన క్యాడర్ కంటే తక్కువ మంది అధికారులే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ అనేక పథకాలు, పాలనా విభాగాలు పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటి నిర్వహణ చూడటానికి అదనంగా అధికారుల అవసరం అవుతోంది. అధికారుల కొరతకు పరిష్కారంగా రిక్రూట్‌మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి అనేదానిపై ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసేందుకు గత ఏడాది డిసెంబరులో కేంద్రం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)