You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కర్నూలు పోలీస్ స్టేషన్‌లో పిల్లల పెన్సిల్ పంచాయితీ వైరల్ - ప్రెస్‌రివ్యూ
'నా పెన్సిల్ ఎత్తేసినవ్, నీపై పోలీస్ స్టేషన్ల కేసు పెడతానంటూ' మూడో తరగతి పిల్లాడు ఒకరు తోటి విద్యార్థిని మిత్రుల సాయంతో ఠాణాకు లాక్కెళ్లిన ఘటనపై వీడియో ఒకటి గురువారం సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయించిందని 'ఈనాడు' కథనం రాసింది.
''ఎనిమిది, తొమ్మిదేళ్ల మధ్య వయసున్న పిల్లలు తమ గొడవను పోలీసుల ఎదుటకు తీసుకెళ్లిన తీరు వైరల్‌గా మారింది. కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన విద్యార్థి ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు.
తన ఇంటి పక్కనే ఉన్న మిత్రుడు రోజూ తన పెన్సిల్‌ను తీసేసుకుంటుండటంతో విసిగిపోయాడు.
అతడిని స్నేహితుల సాయంతో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు.
న్యాయం చేయాలని కానిస్టేబుల్ ఎదుట పంచాయితీ పెట్టాడు.
కేసు పెడితే బెయిల్ తెచ్చుకోవడం, తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడం ఉంటాయని... అవన్నీ కష్టమని, ఈ ఒక్కసారికి పెద్దమనసు చేసుకుని అతన్ని క్షమించాలని కానిస్టేబుల్ సూచించారు.
బాగా చదువుకోవాలని సూచిస్తూ... ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు.
ఈ ఘటన ఆరు నెలల కిందట చోటుచేసుకుంది. అప్పుడు ఈ పిల్లల పంచాయితీని ఒకరు సరదాగా వీడియో తీశారు. ఇటీవల వాళ్ల పిల్లలు దీన్ని పొరపాటున ఎవరికో షేర్ చేయగా... అది అలా అలా పది మందికీ చేరింది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.
టీఆర్ఎస్, వైసీపీ, మజ్లిస్‌లు బీజేపీకి బీ-టీం: రాకేశ్ టికాయత్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ పార్టీనే ఎక్కువగా మద్దతు ఇస్తోందని.. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసునని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం ప్రచురించింది.
''బీజేపీకి టీఆర్‌ఎస్ సహా వైసీపీ, మజ్లిస్ పార్టీలు బీ టీమ్ అని రాకేశ్ టికాయత్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్.. సాగు చట్టాలకు వ్యతిరేకమని చెబితే నమ్మలేమని పేర్కొన్నారు. రైతుల ఉద్యమంపై తమ వైఖరిని టీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, రైతులపై నిరంకుశంగా వ్యవహరించిందని, ఆ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ కాదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎ్‌సఎస్ నడుపుతోందని.. ఆంబానీ, అదానీ ఆదేశాలతో అది పనిచేస్తుందని విమర్శించారు.
బీజేపీకి కిసాన్ సంయుక్త్ మోర్చా మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. ఏ పార్టీకీ మద్దతివ్వబోదని, దేశం కోసమే మోర్చా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని.. రైతు ఉద్యమమే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను తిప్పికొట్టిందని పేర్కొన్నారు.
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ, దిల్లీలో రైతుల ఆందోళన చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇందిరాపార్కు వద్ద గురువారం, అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలంగాణ శాఖ మహాధర్నా నిర్వహించింది.
ఈ ఆందోళనలో తికాయత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ, అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ శివార్లలో రైతు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తామని టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. తెలంగాణాలో కూడా మరణించిన రైతు కుటుంబాలకూ పరిహారం ఇవ్వాలని కోరారు.
మద్దతు ధర చట్టం కోసం కేంద్రంతో పోరాడుతూ 750 మంది రైతులు మృతిచెందారని, వారి కుటుంబాలను ఆదుకోవడం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు.
బీజేపీ ఎక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంటే అక్కడ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన మత విభజన వ్యూహాలతో ఆ పార్టీకి సాయం చేస్తారని టికాయత్ విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రయోజనాలను కాపాడేందుకు ఒక దున్నపోతు తిరుగుతున్నదని పరోక్షంగా అసద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ దాన్ని హైదరాబాద్‌లోనే బంధించాలని పిలుపునిచ్చార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.
'అల్పపీడనం ముప్పు తప్పినట్లే'
నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారని 'సాక్షి' కథనం రాసింది.
''ఇది అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసినా.. అలాగే కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతుండడంతో అక్కడ భారీవర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని, 28, 29 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో 29వ తేదీనాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
నేడు దిల్లీకి తెలంగాణ మంత్రులు
ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం శుక్రవారం దిల్లీకి వెళ్తున్నదని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
'తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్వర్యంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో కూడిన బృందం కేంద్ర ప్రభుత్వంతో జరిగే చర్చల్లో పాల్గొననున్నది.
ఈ బృందం శుక్రవారం సాయంత్రం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నది.
ఈ నెల 23న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రు లు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
నాటి భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్పష్టత ఇవ్వని కేంద్ర మంత్రులు ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని ప్రతిపాదించారు. కేంద్రం ఇచ్చే స్పష్టతకు అనుగుణంగా యాసంగిలో అనుసరించాల్సిన విధానంపై రైతులకు మార్గ నిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ నుంచి గంజాయి స్మగ్లింగ్.. అమెజాన్ ఉద్యోగులపై పోలీసు కేసు
- రాణి కమలాపతి ఎవరు? హబీబ్‌గంజ్ స్టేషన్‌కు ఆమె పేరెందుకు పెట్టారు?
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)