You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్యన్ ఖాన్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ - BBC Newsreel
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
డ్రగ్స్ కేసులో అరెస్టయని ఆర్యన్ ఖాన్ సహా 8 మంది నిందితులకు ముంబయి సిటీ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
అక్టోబరు 11 వరకు తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోరగా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
కాగా కోర్టు ఈ నిర్ణయం వెలువరించగానే ఆర్యన్ తరఫు న్యాయవాది మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు.
ఈ బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని కోర్టు చెప్పింది.
టాంజానియా రచయితకు సాహిత్యంలో నోబెల్ బహుమతి
టాంజానియా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాకు సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది.
గుర్నాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటించిన స్వీడిష్ అకాడమీ ఈ సందర్భంగా.. వలసవాద ప్రభావాలపై రాజీపడని రీతిలో ఆయన రచనలు చేశారంటూ ప్రశంసించింది.
నోబెల్ పురస్కారంతో ఆయనకు ఒక కోటి స్వీడిష్ క్రోనా(సుమారు రూ. 8.5 కోట్లు) ప్రైజ్ మనీ దక్కుతుంది.
73 ఏళ్ల గుర్నా 10 నవలలు రాశారు. ఆయన నవలలో 'ప్యారడైజ్ అండ్ డిజర్షన్' ప్రఖ్యాతి గాంచింది.
1948లో జాంజిబార్‌లో జన్మించిన 1960లలో శరణార్థిగా ఇంగ్లండ్ వచ్చారు.
గుర్నా రాసిన ప్యారడైజ్ అండ్ డిజర్షన్ నవల 1994లో ప్రచురితమైంది. 20వ శతాబ్దంలో టాంజానియాలో పెరిగిన ఒక బాలుడి జీవితాన్ని ఆ నవలలో వర్ణించారు గుర్నా.
ఆ నవలకు ఆయన బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు.
తూర్పు ఆఫ్రికా సాంస్కృతిక వైవిధ్యాన్ని ఆయన నవలలు మిగతా ప్రపంచానికి పరిచయం చేస్తాయని స్వీడిష్ అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది.
టీఆర్ఎస్ జెండా చోరీ.. డాగ్ స్వ్వాడ్‌తో పోలీసుల తనిఖీ
పోయిన టిఆర్ఎస్ పార్టీ జెండాను వెతకడం కోసం డాగ్ స్క్వాడ్ ని ఉపయోగించారు వికారాబాద్ జిల్లా పోలీసులు.
ఒక అంతుచిక్కని హత్య కేసు దర్యాప్తు తరహాలో జెండా కోసం విచారణ జరిపారు.
వికారాబాద్ జిల్లా పరిగి మునిసిపాలిటీలోని మల్లెమోనిగూడలో నిన్న రాత్రి టిఆర్ఎస్ జెండా కనపడకుండా పోయింది.
దీంతో టిఆర్ఎస్ నాయకులు పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా సఫారీ యూనిఫాం వేసుకుని జాగిలాలను తీసుకుని వచ్చిన పోలీసు ఒకరు, టీఆర్ఎస్ పార్టీ జెండా స్తంభం దగ్గర ఆ జాగిలాన్ని తిప్పారు.
తరువాత ఆ ప్రాంతం అంతా తిరిగారు. పోలీసులు జాగిలాలతో అలా హడావుడి చేస్తే, వారి వెనుకే మొత్తం జనం ఆసక్తిగా పరుగుపెట్టారు.
పోలీసులు, జాగిలాలు, జీపులతో ఆ ప్రాంతంలో ఏదో భయంకర నేరానికి సంబంధించిన విచారణ జరిగిన తరహా దృశ్యం ఏర్పడింది.
ఈ సంఘటనపై మరింత సమాచారం కోసం వికారాబాద్ ఎస్పీని బీబీసీ సంప్రదించింది. అయితే, వారి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా రాలేదు.
బతుకమ్మల మధ్య గ్యాస్ సిలిండర్ పెట్టి మహిళల నిరసన
మహాలయ అమావాస్య తో తెలంగాణలో బతుకమ్మ సంబరాలకు తెరలేచింది.
ఈ పండుగ తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించడంతో పాటు వివిధ అంశాలపై మహిళలు తమ నిరసన , అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వేదికగా నిలుస్తోంది.
ఈ నిరసన బతుకమ్మ లు రాజకీయరంగు పులుముకుంటున్నాయి.
వంటగ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా వినూత్నంగా నిరసన తెలిపారు.
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా స్థానిక శివాలయంలో, బతుకమ్మల మధ్య వంటగ్యాస్ సిలెండర్లను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ మహిళలు ఆడిపాడారు.
పెరిగిన ధరలు, నిరుధ్యోగం అంశాలను తమ పాటల్లో ప్రస్తావిస్తూ బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. అబద్దాలతో బీజేపి ప్రభుత్వం మోసం చేస్తోందని , కార్పోరేట్లకు దేశాన్ని అమ్మేయాలని చూస్తోందని, ఉన్న ఉధ్యోగాలను ఊడగొడుతుందని పాటల రూపంలో నిరసన తెలియజేసారు.
హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, వైస్ చైర్మన్ నిర్మల, కౌన్సిలర్ ప్రతాప మంజుల ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ఈ ' రాజకీయ నిరసన బతుకమ్మ'లో పాల్గొన్నారు.
బతుకమ్మను పార్టీలు రాజకీయంగా వాడుకుంటే, కరీంనగర్ పోలీసులు..'షీటీమ్' ప్రచారానికి వాడుకున్నారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలకు షీటీమ్స్, డయల్ 100, బహిరంగ ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియాలో వేధింపులు మొదలైన వాటిపై అవగాహన కల్పించారు.
ఇవి కూడా చదవండి:
- Brahmin Corporation: ఒక కులం గొప్పదని ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటించవచ్చా, బ్రాహ్మణ కార్పొరేషన్ పై విమర్శలు ఎందుకు?
- మోదీని భారత మిలీనియల్స్ తరం ఎందుకు ఇష్టపడుతోంది? - అభిప్రాయం
- వరంగల్: చిన్నపాటి వర్షాలకే ఈ నగరం ఎందుకు ముంపు ప్రమాదంలో పడుతోంది?
- లఖీంపుర్ ఖీరీ: ‘జీపుతో రైతులను తొక్కించిన వారినెందుకు అరెస్ట్ చేయరు’- ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్న
- పాండోరా పేపర్స్: తాము ఏ తప్పూ చేయలేదంటున్న పలువురు దేశాధ్యక్షులు
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా? రాజకీయ నేతల అడ్డాగా టీటీడీ ఎప్పుడు మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)