You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తరుణ్ తేజ్‌పాల్ కేసు: అత్యాచారం తర్వాత బాధితురాలు ఇలానే నడుచుకోవాలని నిబంధనలు ఉన్నాయా?
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
అత్యాచార బాధితురాలు ఇలానే ప్రవర్తించాలని నిబంధనలు ఏమైనా ఉన్నాయా?
తెహల్కా మ్యాగజీన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై అత్యాచార ఆరోపణల కేసులో జడ్జి వ్యాఖ్యలతో ఈ ప్రశ్న తెరపైకి వస్తోంది.
‘‘అత్యాచారంగా చెబుతున్న ఘటన జరిగిన వెంటనే తీసిన ఫొటోల్లో బాధితురాలు నవ్వుతూ, సంతోషంగా మంచి మూడ్‌లో కనిపిస్తున్నారు’’ అని తీర్పు ప్రతిలో జడ్జి క్షమా జోషి రాసుకొచ్చారు.
‘‘ఆమెలో ఎలాంటి భయం, బాధ కనిపించలేదు. తనపై అత్యాచారం జరిగిందని ఆమె చెప్పిన సమయంలోనూ ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు" అని 527 పేజీల తీర్పులో జడ్జి చెప్పారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను జడ్జి నిర్దోషిగా ప్రకటించారు.
ఈ తీర్పుపై గోవా ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది.
‘‘మా ఆడ పిల్లలకు మేం అండగా నిలబడతాం. జడ్జి తప్పుగా తీర్పునిచ్చారు. దీన్ని మేం అంగీకరించట్లేదు’’ అని గోవా ప్రభుత్వం చెప్పింది.
జూన్ 2న ఈ కేసును విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది.
నమ్మశక్యంగా లేదు..
2013 నవంబర్‌లో గోవాలో తెహల్కా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎలివేటర్‌లో తరుణ్ తేజ్‌పాల్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించారు.
‘‘బలవంతంగా నిర్బంధించడం, అదుపులోకి తీసుకోవడం, దాడి, లైంగిక వేధింపులు, అత్యాచారం’’ తదితర అభియోగాలతో పోలీసులు 3,000 పేజీల అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు.
అయితే, ఈ ఆరోపణలను తేజ్‌పాల్ ఖండించారు.
ప్రముఖ భారత పాత్రికేయుల్లో ఒకరైన తేజ్‌పాల్‌పై నమోదైన ఈ కేసు పతాక శీర్షికల్లో నిలిచింది.
2000లో స్థాపించిన తెహల్కా మ్యాగజైన్ పరిశోధనాత్మక కథనాలతో సంచలనం రేపింది.
తేజ్‌పాల్.. ఇండియా ఇంక్ పేరుతో ప్రచురణ సంస్థను కూడా స్థాపించారు.
బుకర్ ప్రైజ్ విజేత అరుంధతి రాయ్, నోబెల్ గ్రహీత వీఎస్ నైపాల్ ఆయనకు ఆప్తమిత్రులు.
తేజ్‌పాల్‌పై ఆరోపణలు చేసిన మహిళ ఆయనకు కేవలం సహోద్యోగిని మాత్రమే కాదు. ఆమె ఆయన స్నేహితుడి కూతురు కూడా. అంతేకాదు ఆయన కుమార్తెకు బెస్ట్ ఫ్రెండ్.
తేజ్‌పాల్‌ను నాన్నలా భావించే దాన్నని, ఆయన్ను ఎంతో నమ్మానని ఆమె కోర్టులో చెప్పారు.
తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించారన్న వార్త చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఘటన సమయంలో పరిస్థితుల గురించి ఆయన మార్చిమార్చి చెప్పారు.
తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత, జడ్జి దృష్టి ఆరోపణలు చేసిన అమ్మాయిపై పడింది.
‘‘అత్యాచార ఘటనను తన మహిళా రూమ్‌మేట్‌కు చెప్పకుండా... ముగ్గురు పురుష ఉద్యోగులకు ఆమె ఎందుకు చెప్పింది? తన స్నేహితుల దగ్గర కనీసం ఆమె ఎందుకు ఏడలేదు? ఏమీ జరగనట్లు ఆమె సాధారణంగా ఎలా నడచుకుంది? తనను లొంగదీసుకునే క్రమంలో చాలా పోరాడానని బాధితురాలు చెబుతున్నారు కానీ ఆమె ఒంటిపై ఒక్క గాయం కూడా లేకపోవడం నమ్మశక్యంగా లేదు’’అని జడ్జి రాసుకొచ్చారు.
తీర్పుపై తీవ్రమైన విమర్శలు
ఈ తీర్పుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.
‘‘తేజ్‌పాల్ కేసును గెలిపించేందుకు ఆయన తరఫు న్యాయవాదులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జడ్జే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు’’అని దిల్లీకి చెందిన న్యాయవాది అపర్ణ భట్ అన్నారు.
‘‘ఇది ఆ మహిళ పరువు, ప్రతిష్ఠలను దెబ్బ తీయడమే. ఈ తీర్పు బాధితురాలిపై దాడి చేసినట్లు కనిపిస్తోంది’’
‘‘కొన్నిసార్లు ఆమెను గురించి చాలా తప్పుగా రాశారు. ఆమె తగిన విధంగా ప్రవర్తించలేదని చెప్పారు. ఆమెకు ఇదివరకు లైంగిక సంబంధాలు ఉన్నట్లుంది అని కూడా ప్రస్తావించారు’’
‘‘ఆ మొత్తం తీర్పును పరిశీలిస్తే, బాధితురాలు పరిచయంలేని వ్యక్తులతో లైంగిక చర్యల్లో పాల్గొనే స్వభావమున్న అమ్మాయిగా చిత్రీకరించారు’’అని న్యాయవాది అపర్ణ భట్ అన్నారు.
‘‘ఇది కేవలం ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం మాత్రమే కాదు. ఆమె వ్యక్తిత్వాన్ని ఊచకోత కోశారు’’అని మరో న్యాయవాది పాయల్ చావ్లా వ్యాఖ్యానించారు.
‘‘బార్‌లో ఆమె పార్టీ చేసుకోవడం, చేతిలో గ్లాస్‌తో డ్యాన్స్ చేయడం లాంటి పనులు జడ్జికి కోపం తెప్పించినట్లు ఉన్నాయి. ఇది అత్యాచార కేసు విచారణలా అనిపించడం లేదు. ఓ యువతి నైతిక విలువలపై విచారణలా ఉంది’’ అని అన్నారు.
‘‘మహిళలు స్పందించే తీరు ఇదికాదు’’
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ జడ్జిలు తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు.
గత ఏడాది ఓ అత్యాచార బాధితురాలు సముచితంగా ప్రవర్తించలేదని కర్ణాటకలో ఓ జడ్జి వ్యాఖ్యానించడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
‘‘దాడి జరిగిన తర్వాత అలసిపోయి, నిద్రపోయానని ఆమె చెబుతోంది. భారత మహిళలు ఎవరూ ఇలా ప్రవర్తించరు. భారత మహిళలు తమపై అత్యాచారం జరిగితే ఇలా అసలు స్పందించరు’’అని జడ్జి వ్యాఖ్యానించారు.
ఈ తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టులోని ముగ్గురు మహిళా న్యాయమూర్తులకి న్యాయవాది అపర్ణ భట్ బహిరంగ లేఖ రాశారు.
‘‘అత్యాచారం తర్వాత మహిళలు ఇలానే నడుచుకోవాలని చట్టంలో ఏమైనా ప్రోటోకాల్ ఉందా?’’ అని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు ఈ తీర్పుపై ప్రముఖ కళాకారుడు పెన్‌పెన్సిల్డ్ డ్రా.. ఒక బొమ్మను వేశారు. అత్యుత్తమ మహిళా బాధితురాలు ఎలా ఉండాలో జడ్జి చెబుతున్నట్లుగా బొమ్మ గీశారు. ఇది ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.
ఇలాంటి తీర్పులు మరికొన్ని కూడా వచ్చాయి.
సామూహిక అత్యాచార బాధితురాలు బీరు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, తన ఇంట్లో కండోమ్‌లు పెట్టుకోవడాన్ని విమర్శస్తూ... ఆమె చాలా మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు అనిపిస్తోందని ఒక జడ్జి వ్యాఖ్యానించారు.
ఇలాంటి ప్రశ్నలు, వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది.
లైంగిక ఆరోపణల కేసుల్లో మహిళల వ్యక్తిగత అంశాలు, వారి లైంగిక చరిత్రతో సంబంధంలేదని చెబుతూనే వస్తోంది. నిందితుడు అత్యాచారం చేశాడా? లేదా? ఇది మాత్రమే వారి ముందున్న ప్రశ్న అని స్పష్టంచేసింది.
‘‘సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్నప్పటికీ, బాధితురాలి వ్యక్తిత్వంపై జడ్జిలు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధితురాలి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తున్నారు’’ అని న్యాయవాది పాయల్ చావ్లా అన్నారు.
తాజా తీర్పును చూస్తుంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోనట్లు కనిపిస్తోంది. బాధితురాలి తల్లి వ్యక్తిత్వంపైనా తీర్పులో జడ్జి జోషి ప్రశ్నలు సంధించారు.
‘‘విచారంలో ఉన్న కూతురికి తోడు ఉండాలని కొంచెం కూడా ఆలోచించకుండా ఆమె తన పనులు చూసుకోవడానికి వెళ్లిపోయారు’’ అని తీర్పులో జోషి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)