జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు కోవిడ్ పాజిటివ్... సూమోటో కేసు విచారణ వాయిదా -Newsreel

ప్రచురణ

కోవిడ్ సంక్షోభాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వస్తున్న ఆరోపణలను సూమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ అయింది.

జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసును మళ్లీ మే 13 గురువారం నాడు విచారించాల్సి ఉంది. జస్టిస్ చంద్రచూడ్‌కు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ కావడంతో రేపటి విచారణను వాయిదా వేసినట్లు సుప్రీం కోర్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం మళ్లీ విచారణ ఎప్పుడన్నది తరువాత వెల్లడిస్తారు.

జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూసేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తు ముంచుకొస్తున్నప్పుడు సుప్రీం కోర్టు 'మౌన ప్రేక్షక పాత్ర' వహించదని జస్టిస్ చంద్రచూడ్ ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేశారు.

గోవా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 26 మంది రోగుల మృతి

గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రి (జీఎంసీహెచ్)లో మంగళవారం 26 మంది కరోనా రోగులు చనిపోయారని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే చెప్పారు. ఇది ప్రభుత్వ ఆస్పత్రి.

మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో రోగులు చనిపోయారని ఆయన తెలిపారు. కానీ వారు ఎందుకు మృతిచెందారో కారణం చెప్పలేదు.

రాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో ఆక్సిజన్‌ సరఫరా పైన, కోవిడ్‌ రోగులు చనిపోవడం పైన హైకోర్టు విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ముగ్గురు నోడల్‌ ఆఫీసర్లను నియమించిందని, వారు ఏం విచారణ చేశారో చూడాలని రాణే అన్నారు.

ఆక్సిజన్‌ నిర్వహణలో లోపం ఎక్కడుందో ముఖ్యమంత్రిని అడుగుతానని చెప్పారు. జీఎంసీ హాస్పిటల్‌ సిబ్బంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కష్టపడుతున్నారని, ప్రస్తుతం ఈ ఆస్పత్రిపై భారం ఎక్కువగా ఉందని రాణే అన్నారు.

అయితే, మీడియాతో మాట్లాడిన ఆయన ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని అంగీకరించారు.

"కోవిడ్-19 వార్డులో ఆక్సిజన్ సరఫరా కాసేపు నిలిచిపోయింది. దానివల్ల రోగులకు కొంత ఇబ్బంది వచ్చుండచ్చు" అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నట్లు పీటీఐ చెప్పింది.

"హైకోర్ట్ ఈ అంశంపై విచారణ జరపాలి. హైకోర్ట్ జోక్యం చేసుకుని ఆక్సిజన్‌కు సంబంధించి ఒక శ్వేతపత్రం రూపొందించాలి. అసలు విషయం అప్పుడే బయటికొస్తుంది" అని మంత్రి రాణే అన్నారు.

ఈ ఘటనలపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ స్పందించారు.

"ప్రభుత్వం ప్రతిరోజు 600 ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తోంది. ఇది పైప్‌లైన్‌ ఆక్సిజన్‌ సప్లైకి అదనం. ఆక్సిజన్ నిరంతరం సరఫరా జరిగేందుకు మరో పది రోజుల్లో గోవా మెడికల్‌ కాలేజీలో 20 వేల లీటర్ల ఆక్సిజన్‌ ట్యాంకును ఏర్పాటుచేస్తున్నాం. ట్యాంకర్లను నడిపే డ్రైవర్ల వల్లే సమస్య ఎదురవుతోందని మాకు అర్థమైంది, అందుకే మరింత నిపుణులైన డ్రైవర్లను నియమిస్తాం" అని ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు.

గోవాలో మే 24 వరకు కఠిన లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)