తెలంగాణ బడ్జెట్: 2.3 లక్షల కోట్లకు పైగా భారీ కేటాయింపులు.. నిజంగా ఖర్చు చేస్తారా లేక చివరికి కోతలు వేస్తారా?

ఫొటో సోర్స్, TELANGANA CMO
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
తెలంగాణ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కరోనా కాలంలో కూడా 2,30,825.96 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరిచారు మంత్రి హరీశ్ రావు.
కానీ వాస్తవంగా అంత ఖర్చు పెట్టే శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? ఇప్పుడు బడ్జెట్ లో పెట్టినన్నీ కేటాయింపులూ వాస్తవంగా చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు 80 వేల కోట్లు సమీకరించుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
అయితే, ఇంతకీ అంత సొమ్ము ఎక్కడ నుంచి తెస్తారో చెప్పలేదు మంత్రి.
గత సంవత్సరం, అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ పరిమాణం దాదాపు 1 లక్షా 82 వేల కోట్లు. అయితే గతేడాది ఏ అంచనాలూ సక్రమంగా పూర్తి కాలేదు. కరోనా ప్రభావం గురించి చెప్పక్కర్లేదు.
ఆర్థిక వ్యవస్థను మూడు ముక్కలుగా విభజిస్తారు. ఒకటి వ్యవసాయ రంగం. రెండు పరిశ్రమల రంగం. మూడు సేవల రంగం (బ్యాంకులు, రవాణా, ఐటి, బీపీఓ మొదలైనవి).
కరోనా దెబ్బకి వ్యవసాయ రంగం తప్ప, అటు పరిశ్రమల రంగం, ఇటు సేవా రంగం రెండూ దెబ్బతినడంతో ప్రభుత్వ ఆదాయాలు కూడా తలకిందులయ్యాయి. అయితే, ఈ పరిస్థితుల్లో కూడా గతేడాది కంటే దాదాపు 48 వేల కోట్ల రూపాయల అధిక అంచనాలతో ఈ ఏడాది బడ్జెట్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం.

ఫొటో సోర్స్, FINANCE.TELANGANA.GOV.IN
''అయితే ఇక్కడొక విషయం ఉంది. దేశవ్యాప్తంగా జీడీపీ -3.8 శాతానికి పడిపోతే తెలంగాణ మాత్రం రాష్ట్ర జీడీపీ +1.3 శాతంతో పాజిటివ్ రేటులో కొనసాగింది. అదే సందర్భంలో కరోనాకు ముందు తెలంగాణ ఎస్జీడీపీ పెరుగుదల శాతం 13 ఉంటే, ఆ తరువాత 1 ఉంది'' అంటూ తెలంగాణ ఆర్థిక పరిస్థితి వివరించారు ఆర్థికవేత్త అందె సత్యం.
ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం ఒక సాహసమేనన్న ఆయన, బహుశా రాష్ట్రం తన ద్రవ్యలోటు పరిమితి పెంచుకునే అవకాశం లభించడం ఒక కారణం కావచ్చన్నారు. అలాగే రాష్ట్రం ఈ బడ్జెట్ కోసం అదనంగా 30 వేల కోట్లు రాబట్టవచ్చని అంచనాకు వచ్చినట్టు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ఇక్కడే తెలంగాణ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ ఉంది. గతేడాది పేరుకు 1 లక్షా 82 వేల కోట్ల బడ్జెట్ పెట్టినా, వాస్తవంగా ఖర్చు చేసింది 1 లక్షా 30-40 వేల కోట్లు దాటకపోవచ్చంటున్నారు నిపుణులు.
ఆ మేరకు అంచనాల లోటు ఉండిపోయింది అనుకుంటే, అదొక 48 వేల కోట్లు, తాజాగా మరో 30 వేల కోట్లు.. కలిపి మొత్తంగా 80 వేల కోట్లు సమీకరించాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా కష్టం.
మరో పద్ధతి, అంచనాల్లో కోతలు పెట్టడం..
బడ్జెట్ ప్రసంగాల సమయంలో ఆర్థిక మంత్రులు శాఖల వారీగా వేల కోట్ల కేటాయింపులు చెబుతుంటారు. కానీ వాస్తవంగా అంత ఖర్చు చేయలేని పరిస్థితులుంటాయి. దీంతో ఆ ఏడాది బడ్జెట్లో ఉన్నదానికీ, వాస్తవంగా ఖర్చు చేసిన దానికీ పొంతన ఉండదు.
''శాఖల వారీగా వేల కోట్లు కేటాయింపులతో ఫలితం రాదు. వాస్తవంగా ఖర్చు చేసినప్పుడే ఫలితం వస్తుంది. ఏ ప్రభుత్వాలైనా అంచనా చూపిస్తారు. తరువాత కోతలు విధిస్తారు. దీంతో అనుకున్న లక్ష్యాలు చేరడం లేదు. దీనివల్ల అవే కేటాయింపులు మళ్లీ చేస్తున్నారు. ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వం తాజా లెక్లు కాస్త అతి అంచనాగా అనిపిస్తోంది'' అన్నారు సత్యం.
వాస్తవానికి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కేంద్ర నియంత్రణ పెరుగుతూ వస్తోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో భారీగా నీటి పారుదలపై ఖర్చు చేస్తున్నా, కేంద్రం నుంచి దానికి ప్రత్యేక సాయం అందినది ఏమీ లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేయాలన్న డిమాండ్ అలానే ఉండిపోయింది. తెలంగాణ సహా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలాంటి ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉన్నయి.
''ప్రభుత్వ కేటాయింపులు భారీగా ఉన్నాయి. కానీ వాటికి తగిన న్యాయం చేయాలంటే రాబడులు వెతుక్కోవాలి. కానీ ఆ అదనపు రాబడులు ఏ విధంగా వెతుకుతారో ప్రస్తావించలేదు. ఈ అదనపు వనరులు ఎలా రాబడతారో చెప్పి ఉంటే బడ్జెట్ ఇంకా పకడ్బందీగా ఉండేది'' అన్నారు సత్యం.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- సారంగ దరియా: జానపదులు పాడుకునే ఈ పొలం పాట యూట్యూబ్ సెన్సేషన్ ఎలా అయింది?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ: ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- ఇస్లామిక్ స్టేట్: పాకిస్తాన్ నుంచి సిరియాలోని మిలిటెంట్లకు నిధులు ఎలా వెళ్తున్నాయి?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























