హరిహర వీరమల్లు: ‘ఓ లెజండరీ బందిపోటు వీరోచిత గాథ' - ప్రెస్ రివ్యూ

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

మహా శివరాత్రి సందర్భంగా పవన్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో తెరకెక్కే 'హరిహర వీరమల్లు' మూవీ ఫస్ట్ లుక్ రిలీజైనట్లు ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రచురించింది.

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రానికి 'హరిహర వీరమల్లు' టైటిల్‌ ఖరారు చేశారు.

రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా సూర్యా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ గ్లిమ్స్‌ను శివరాత్రి సందర్భంగా గురువారం విడుదల చేశారు. 'ఇదొక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ' అని క్రిష్‌ పేర్కొన్నారు.

''17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, విజువల్‌ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ను చూడబోతున్నాం. చార్మినార్‌, రెడ్‌ ఫోర్ట్‌, మచిలీపట్నం పోర్ట్‌ వంటి భారీ సెట్లను నిర్మించాం. 40 శాతం షూటింగ్‌ పూర్తయింది. జూలై వరకు చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెడతామం" అని క్రిష్ చెప్పారు.

పీరియాడిక్‌ డ్రామా కావడంతో వీఎఫ్ఎక్స్‌ పనులకోసం ఆరు నెలల సమయాన్ని కేటాయించాం. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన బెన్‌ లాక్‌ వీఎఫ్‌ఎక్స్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు'' అని నిర్మాత ఎ.దయాకర్‌రావు తెలిపారు.

తెలుగు సహా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చిత్ర సమర్పకులు ఎ.ఎం.రత్నం తెలిపారు.

నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త అని ఆంధ్రజ్యోతి వివరించింది.

దేశంలో 20 వేలు దాటిన కరోనా కేసులు

గురువారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటిందని, మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

దేశంలో ఉద్ధృతి తగ్గినట్టే కనిపించిన కరోనా మహమ్మారి... మళ్లీ కొమ్ములు పైకెత్తింది! 24 గంటల వ్యవధిలో కొత్తగా 22,854 మందికి వైరస్‌ సోకింది.

ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం 2021లో ఇదే తొలిసారి! చివరిసారిగా గత ఏడాది డిసెంబరు 25న అత్యధికంగా 23,067 కేసులు నమోదయ్యాయి.

కొద్ది రోజులుగా దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌లు దేశంలో వ్యాపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గురువారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,12,85,561కి చేరాయని ఈనాడు రాసింది.

కొత్తగా 126 మంది మృతిచెందడంతో కొవిడ్‌ మరణాలు 1,58,189కి పెరిగాయి. ప్రస్తుతం దేశంలో రికవరీల రేటు 96.92%గా, మరణాల రేటు 1.40%గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వేగంగా వ్యాపిస్తూ... తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నా... మహారాష్ట్రలో పరిస్థితి మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 1,86,274 క్రియాశీల కేసులుండగా, వాటిలో ఒక్క మహారాష్ట్రలోనే 99,008 ఉన్నాయి.

చాలా ప్రాంతాల్లో వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో నాగ్‌పుర్‌లో లాక్‌డౌన్‌ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 21 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. పుణె సహా మరికొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ముంబయి, నాసిక్‌, పుణె, అకోలా, నాగ్‌పుర్‌లో కేసుల ఉద్ధృతి అధికంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న 10 జిల్లాల్లో... 8 మహారాష్ట్రకు చెందినవే కావడం గమనార్హం. ఆ రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని ఈనాడు వివరించింది.

విజయా డెయిరీ ఆస్తులపై తెలంగాణ హైకోర్టు తీర్పు

తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్ ఆస్తుల వివాదం కొలిక్కి వచ్చినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

ఉమ్మడి ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌డీడీసీఎఫ్‌)కు చెందిన ఆస్తులను ఏపీ 58.32 శాతం, తెలంగాణ 41.68 నిష్పత్తిలో పంచుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లోని ఏపీఎస్‌డీడీసీఎఫ్‌ పరిపాలనా భవనం, వసతి గృహాలను, వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.54 కోట్ల సొమ్మును కూడా ఇదే నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించిందని సాక్షి చెప్పింది.

ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని.. ఆపరేషనల్‌ యూనిట్స్‌ (డెయిరీ, ఇతర తయారీ యూనిట్స్‌) మాత్రం ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రానికే కేటాయించాలని పేర్కొంది. హైదరాబాద్‌ లాలాగూడలోని విజయ డెయిరీ తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఏపీఎస్‌డీడీసీఎఫ్‌ లిమిటెడ్‌ ఆస్తులను తమకుతాము కేటాయించుకుంటూ 2016 మే, 6న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 8ను కొట్టివేసిందని సాక్షి రాసింది.

ఆ జీవో పునర్విభజన చట్టానికి విరుద్ధమని తేల్చిచెప్పింది. ఏపీఎస్‌డీడీసీఎఫ్‌ ఆస్తులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 8ను సవాల్‌ చేస్తూ ఫెడరేషన్‌ ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది.

ఏపీఎస్‌డీడీసీఎఫ్‌ లిమిటెడ్‌ పరిపాలనా భవనాన్ని జనాభా నిష్పత్తి ఆధారంగా తెలంగాణ, ఏపీ సమానంగా పంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తమ తీర్పులో పేర్కొందని సాక్షి వివరించింది.

మద్యంతాగి బండి నడిపితే, డ్రైవరుకే కాదు...

మద్యం తాగి వాహనాలు నడిపేవారితోపాటూ వారి వెంట ఉన్నవారిపై కూడా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయనున్నారని నమస్తే తెలంగాణ వార్తా కథనం ప్రచురించింది.

మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబులతోపాటు వారి వెంట వాహనంలో ఉన్నవారు కూడా ఇకనుంచి ఊచలు లెక్కపెట్టాల్సిందే.

మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్‌-188 ప్రకారం తాగి వాహనం నడిపే వ్యక్తితోపాటు ఆ వాహనంలో ఉన్నవారిపై కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేయనున్నారని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఈ విషయం చట్టంలో మొదటి నుంచి ఉన్నప్పటికీ ఇంతకాలం తాగి వాహనం నడిపిన వారిపైనే కేసులు నమోదుచేసేవారు.

తాజాగా రోడ్డుప్రమాద నివారణకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై కఠన చర్యలకు ఉపక్రమించిన పోలీసులు, వాహనంలోని అందరిపై కేసులు నమోదుచేస్తున్నారు.

దీనిపై వాహనదారులకు అవగాహన కల్పించడానికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని పత్రిక రాసింది.

వాహన డ్రైవర్‌ మద్యం సేవించాడని తెలిసి కూడా ఆ వాహనంలో ప్రయాణిస్తూ ఏదైనా ప్రమాదానికి కారణమైతే.. అందులోని ప్రయాణికులంతా అందుకు బాధ్యులవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనంలోని అందరిపై కేసులు నమోదుచేస్తామని స్పష్టంచేస్తున్నారు.

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తున్నవారితో ప్రయాణిస్తూ ఎవరి మరణానికైనా కారణమైతే చట్టంలోని 304 పార్ట్‌ 2 కింద వాహనంలోని అందరికి పదేండ్లపాటు జైలు శిక్ష పడే ప్రమాదముంది.

ఇప్పటికే చోటుచేసుకొన్న ఈ తరహా ప్రమాదాలపై పోలీసులు 304 పార్ట్‌ 2 కింద కేసులు నమోదుచేశారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)