చంద్రబాబు నాయుడు: ‘‘14ళ్లు సీఎంగా చేశాను, కలెక్టర్‌ను, ఎస్పీని కలిసే హక్కు నాకు లేదా’’

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని రేణిగుంట ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు.

చిత్తూరులో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా ఆయన్ని అడ్డుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు.

ఇటీవల స్థానిక ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలపై అధికార పక్షం దౌర్జన్యానికి పాల్పడిందని చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆరోపించారు. దానికి కొనసాగింపుగా జిల్లా కేంద్రం చిత్తూరులో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

అయితే టీడీపీ నేతల నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తూ ఆదివారం రాత్రి పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు.

ఆందోళనకు సన్నాహాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు వెళ్లి ధర్నాలో పాల్గొంటారని టీడీపీ నేతలు ప్రకటించారు.

ఈ లోగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీడీపీ ముఖ్య నాయకుల హౌస్ అరెస్టులకు దిగారు. పలమనేరులో మాజీ మంత్రి ఎన్.అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలను అక్కడికక్కడే అరెస్టు చేశారు.

చిత్తూరులో చంద్రబాబు ధర్నా కార్యక్రమానికి అనుమతి లేనందున ఎవరినీ అనుమతించబోమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. అదేసమయంలో చంద్రబాబుని కూడా ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు రాకుండా నిరోధించారు. దాంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎయిర్ పోర్టులో నేలపై భైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల వ్యవహారశైలిని టీడీపీ నేతలు తప్పుబట్టారు.

ధర్నాకు అనుమతి లేనందున తిరిగి హైదరాబాద్ వెళ్లాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, చంద్రబాబు ససేమిరా అంటున్నారు.

ఎయిర్ పోర్ట్ వెలుపల టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన సాగిస్తున్నారు.

తన పర్యటన అడ్డుకున్న తీరుపై చిత్తూరు కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం ఇచ్చి వెళ్తానని చంద్రబాబు చెప్పగా, అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, తనకు అనుమతి ఇచ్చే వరకూ విమానాశ్రయంలోనే నిరసన కొనసాగిస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)