హైదరాబాద్ శివార్లలో విద్యార్థినిపై సామూహిక అత్యాచార యత్నం: ప్రెస్ రివ్యూ

జార్ఖండ్, కిడ్నాప్, అత్యాచారం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
ప్రచురణ

హైదరాబాద్ శివార్లలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం జరిగిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త ప్రచురించింది.

హైదరాబాద్‌ శివార్లలో మరో దారుణం.. దిశను గుర్తుకు తెచ్చే ఘటన.. కాలేజీ బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిందో విద్యార్థిని. అంతే ఆటోలోని యువకులు ఆమెపై కన్నేశారు.

దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా తీసుకెళ్లారు. కీడు శంకించిన ఆ యువతి వెంటనే తాను ఆపదలో ఉన్నానని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది.

ఆమె సమయస్ఫూర్తికి తోడు పోలీసులు తక్షణమే స్పందించడంతో విద్యార్థిని సురక్షితంగా బయటపడిందని పత్రిక చెప్పింది.

ఈ ఘటన బుధవారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఓ కళాశాలలో బీ-పార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (19) సాయంత్రం 6.15 గంటలకు రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగింది.

ఆటో ఎక్కిన తర్వాత ఇంటికి వస్తున్నానంటూ తండ్రికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు.

కొంతదూరం వెళ్లాక మహిళ దిగిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తి ఫోన్‌ చేసి మరో ఇద్దరిని పిలిపించుకొని మార్గమధ్యంలో ఆటోలో ఎక్కించాడు. ఆ విద్యార్థిని దిగాల్సిన స్టేజి వచ్చింది.

ఆటోను ఆపాలని డ్రైవర్‌ను కోరగా ఆపకుండా ఘట్‌కేసర్‌ వైపు వేగంగా వెళ్లాడు. భయాందోళనకు గురైన ఆ యువతి ఇంటికి ఫోన్‌ చేసి, తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది.

వారు వెంటనే స్థానిక కౌన్సిలర్‌తోపాటు పలువురికి సమాచారాన్ని అందించారు. 100కు డయల్‌ చేశారు. సాయంత్రం 6.29 గంటలకు పోలీసులకు కాల్‌ వెళ్లింది.

వెంటనే పోలీస్‌ వ్యవస్థ అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు విద్యార్థిని ఫోన్‌ సిగ్నల్స్‌ను వెంబడించాయి. అప్పటికే ఆటోలో యమ్నంపేట వరకు వచ్చిన దుండగులు ఆమెను ఓ వ్యాన్‌లోకి మార్చారు.

ఈ క్రమంలో దాడి చేసి, దుస్తులు చింపేశారు. విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాట కొనసాగుతుండగానే వ్యాన్‌లో ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఎటు చూసినా పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్‌లతో తిరుగుతుండడంతో దుండగులు భయపడ్డారు. దాంతో యువతిని అవుటర్‌ రింగ్‌ రోడ్డు అన్నోజిగూడ పాయింట్‌ దగ్గర సర్వీసు రోడ్డు పొదల్లో విసిరేసి పారిపోయారని ఆంధ్రజ్యోతి రాసింది.

ఆస్పత్రిలో విద్యార్థినికి చికిత్స
ఫొటో క్యాప్షన్, బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది

నిమిషాల వ్యవధిలో అక్కడికి పోలీసు వాహనం వచ్చింది. పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న యువతిని చూసిన ఓ ఎస్సై వెంటనే ఆమెను భుజంపై వేసుకొని వాహనంలోకి చేర్చి, వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

7.50 గంటలకు యువతిని పోలీసులు రక్షించారు. అంటే గంటా ఇరవై నిమిషాల్లో గాలింపు ఆపరేషన్‌ పూర్తిచేసి, ఆమెను రక్షించారు.

సంఘటన వివరాలను మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి విలేకర్లకు వెల్లడించారు. విద్యార్థిని అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారు.

పోలీసులు సత్వరం స్పందించడంతోనే తమ కుమార్తెకు ముప్పు తప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

జనసేన అధినేత

ఫొటో సోర్స్, FB/JanaSena Party

ఫొటో క్యాప్షన్, దిల్లీలో పవన్ కళ్యాణ్

22 మంది ఎంపీలున్న వైసీపీ చాలా చేయచ్చు - పవన్ కళ్యాణ్

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి 22 మంది ఎంపీలున్న వైసీపీ ఏమైనా చేయచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్టు ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచించాలని కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ఉక్కు కర్మాగారంపై ప్రజల మనోభావాలను హోం మంత్రి అమిత్‌షాకు, కేంద్ర మంత్రులు మురళీధరన్‌, కిషన్‌రెడ్డిలకు స్పష్టంగా తెలియజేశామన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి వైసీపీ మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చని, చేయకూడదనుకుంటే ఏమీ చేయలేమని వ్యాఖ్యానించినట్లు ఈనాడు రాసింది.

తామే ఇంత ప్రయత్నం చేస్తుంటే 22 మంది ఎంపీలున్న వాళ్లు చాలా చేయొచ్చని పవన్‌ అన్నారు.

దిల్లీలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

'కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దేశంలోని ఇతర సంస్థల్లా పరిగణించవద్దని, ప్రజలకు దానితో ముడిపడిన భావోద్వేగాలను వివరించాం. కర్మాగారంలో దాదాపు 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది ఒప్పంద ఉద్యోగులుండగా పరోక్షంగా లక్ష మంది జీవిస్తున్నారని తెలిపాం. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణ విషయంలో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలని కోరాం" అని చెప్పారని ఈనాడు వివరించింది.

ఇంటింటికీ రేషన్

ఫొటో సోర్స్, FB/ANDHRA PRADESH CM

మొబైల్ రేషన్ వాహనాలు ఇంటింటికీ వెళ్లాల్సిందే-ఏపీ పౌరసరఫరాల శాఖ

ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలపై వస్తున్న ఫిర్యాదులపై ఏపీ పౌరసరఫరాల శాఖ స్పందించినట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ రేషన్‌ పంపిణీ' పథకం కోసంవినియోగిస్తున్న మొబైల్‌ వాహనాలు ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.

వాహనదారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి ప్రతినెలా చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.16 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విదితమే.

ప్రస్తుతం పట్టణాల్లో ఈ పథకం అమలవుతోంది. అయితే పట్టణాల్లో కొందరు ఒకేచోట వాహనాన్ని నిలిపేసి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైందని పత్రిక చెప్పింది.

వెంటనే లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవడంతోపాటు సరుకుల పంపిణీ స్పీడును మరింత పెంచాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.

లోపాలను వెంటనే సరిదిద్దుకునేలా వాహనదారులకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారని సాక్షి వివరించింది.

గుగులోతు సౌమ్య

ఫొటో సోర్స్, All india national football

ఫొటో క్యాప్షన్, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ పెడరేషన్ వెబ్‌సైట్‌లో సౌమ్య పేరు

భారత ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు తెలంగాణ నుంచి సౌమ్య

తెలంగాణ నిజామాబాద్ జిల్లా యువ క్రీడాకారిణి సౌమ్యకు భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ టీంలో చోటు దక్కిందని నమస్తే తెలంగాణ దిన పత్రిక కథనం ప్రచురించింది.

అవకాశాలను అందిపుచ్చుకుంటూ బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో సత్తాచాటిన యువ స్ట్రైకర్‌ సౌమ్య తాజాగా భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్‌ జట్టులో చోటు దక్కించుకుంది.

ఈనెల 14 నుంచి 24 తేదీ వరకు టర్కీలో జరిగే అంతర్జాతీయ టోర్నీలో భారత్‌ తరఫున సౌమ్య బరిలోకి దిగనుంది.

జాతీయ సీనియర్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న తొలి తెలంగాణ ప్లేయర్‌గా మహిళా ప్లేయర్‌గా ఈ ఇందూరు బిడ్డ అరుదైన రికార్డును సొంతం చేసుకుందని నమస్తే తెలంగాణ రాసింది.

రెంజల్‌ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు గోపీ, ధనలక్ష్మి దంపతుల కూతురైన సౌమ్య..భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రీడాభిమానులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

కర్నూలులో 2012లో జరిగిన అండర్‌-14 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ద్వారా ఫుట్‌బాల్‌ కెరీర్‌ ప్రారంభించిన ఈ యువ స్ట్రైకర్‌ గోల్స్ చేయడమే లక్ష్యంగా ఎంచుకుంది.

2015లో కాఠ్‌మాండూలో జరిగిన ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫడరేషన్‌ టోర్నీలో భారత అండర్‌-14 బాలికల జట్టుకు ఈ అమ్మాయి ఎంపికైంది.

అయితే భారీ భూకంపం కారణంగా టోర్నీ నుంచి భారత్‌ అర్ధాంతరంగా వైదొలుగాల్సి వచ్చింది. తృటిలో గాయాల నుంచి బయటపడ్డ సౌమ్య..ఆ మరుసటి ఏడాదే అండర్‌-16 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌ తరఫున అత్యధిక గోల్స్‌(4)చేసింది.

2018లో జొహాన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన బ్రిక్స్‌ అండర్‌-17 చాంపియన్‌షిప్‌లో భారత్‌ జట్టుకు సౌమ్య సారథ్యం వహించింది.

వియత్నాం అండర్‌-19 టోర్నీతో సహా పలు జాతీయ స్థాయి టోర్నీల్లో మెరిసిన సౌమ్య ఇటీవలే గోవాలో జరిగిన భారత సీనియర్‌ మహిళల ఫుట్‌బాల్‌ టీమ్‌ క్యాంప్‌నకు ఎంపికైందని నమస్తే తెలంగాణ వివరించింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)