అచ్చెన్నాయుడు: టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్లు ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కోటబొమ్మాళి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో వైకాపా తరఫున అచ్చెన్నాయుడి దగ్గరి బంధువు కింజరాపు అప్పన్న సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు’

ఆ సమయంలో తనపైన, తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వైకాపా టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్‌ సహా మరికొందరిపైన అచ్చెన్నాయుడి ప్రోద్బలంతో కొందరు హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ అప్పన్న కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఈనాడు పేర్కొంది.

‘ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సోమవారం 12 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో అచ్చెన్నాయుడి పేరును ఏ3గా చేర్చారు.

అప్పన్నను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం నిమ్మాడ రానున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో అత్యంత నాటకీయంగా మంగళవారం ఉదయమే అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచార’ని ఈనాడు వివరించింది.

హైదరాబాద్‌లో దక్షిణాదిలోనే అత్యధికంగా వాయు కాలుష్యం

హైదరాబాద్‌లో దక్షిణాదిలోనే అత్యధికంగా వాయుకాలుష్యం పెరిగిందని సీఎస్సీ నివేదిక ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

చలికాలంలో హైదరాబాద్‌లో వాయుకాలుష్యం అత్యధికంగా నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల రాజధానులు చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం కంటే భాగ్యనగరినే అత్యధికంగా గాలి కాలుష్యం కమ్మేసిందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్సీ) నివేదిక తెలిపింది.

2019 సంవత్సరంతో పోలిస్తే 2020లో చలికాలంలో 7.5 శాతం మేర వాయుకాలుష్యం పెరిగినట్లు పేర్కొంది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదికను మంగళవారం విడుదల చేశారని కథనంలో రాశారు.

దాని ప్రకారం.. హైదరాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో వాయు నాణ్యతను కొలిచే కేంద్రాలు ఉండగా.. వాటిలో సనత్‌నగర్‌లో అత్యధికంగా, సెంట్రల్‌ వర్సిటీలో అత్యల్పంగా వాయుకాలుష్యం నమోదైందని పత్రిక చెప్పింది.

గాలిలోని పర్టిక్యులేట్‌ మేటర్‌ (పీఎం) మోతాదు ఆధారంగా వాయు కాలుష్య స్థాయిని అంచనా వేశారు. పీఎం 2.5 స్థాయి చెన్నైలో 33, బెంగళూరులో 30, తిరువనంతపురంలో 25 ఉండగా.. హైదరాబాద్‌లో అత్యధికంగా 36గా ఉన్నట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే.. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారి ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదముందని సీఎస్సీ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అవికల్‌ సోమవంశీ తెలిపారు.

జనవరి మొదటివారంలో హైదరాబాద్‌, అమరావతి, రాజమహేంద్రవరం, చిక్‌బళ్లాపూర్‌, యాద్గిర్‌లలో వాయుకాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని, అది డర్టీయెస్ట్‌ వీక్‌గా సీఎస్సీ నివేదిక అభివర్ణించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఏలూరు అంతుచిక్కని వ్యాధిపై లోతైన పరిశోధన

ఏలూరులో అంతుపట్టని వ్యాధికి కారణం బ్యాక్టీరియా, వైరస్ కాదని పరిశోధనల్లో తేలినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

2020 డిసెంబర్‌లో జరిగిన ఏలూరు ఘటనపై విభిన్న కోణాల్లో పరిశోధన జరిగింది. వివిధ జాతీయ సంస్థలు మూర్ఛకు కారణాలను అన్వేషించి, నివేదికలిచ్చాయి.

దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూర్ఛ లక్షణాలతో సొమ్మసిల్లి పడిపోవడం అనేది బాక్టీరియా లేదా వైరస్‌వల్ల కాదని తేలింది.

నీటి నమూనాలను పరీక్షించగా, క్రిమిసంహారక మందుల అవశేషాలు కలిశాయని స్పష్టమైంది.

ఇందులో ఆర్గానో ఫాస్ఫరస్‌ పెస్టిసైడ్‌ మూలాలున్నాయని జాతీయ పోషకాహార సంస్థ చెప్పింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌ లాంటి సంస్థ ఆర్గానో ఫాస్ఫరస్‌ వల్ల మూర్ఛ రావచ్చని.. కానీ, తాము సేకరించిన నమూనాల్లో దాని మూలాల్లేవని చెప్పిందని సాక్షి రాసింది.

అందుకే అన్ని సంస్థల అభిప్రాయాలను క్రోడీకరించాక ఆర్నెల్లపాటు లోతైన పరిశోధన చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం మూడు జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం'.. అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.

ఏలూరు ఘటనపై మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏలూరులో 600 మందికి పైగా అంతుచిక్కని వ్యాధితో బాధితులు నమోదైతే ఒక్క ప్రాణనష్టం కూడా లేకుండా చేశామన్నారని సాక్షి వివరించింది.

హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు

హైదరాబాద్‌సో ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి గుండెను మెట్రోలో తరలించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త ప్రచురించింది.

నల్లగొండ జిల్లాకు చెందిన రైతు నర్సిరెడ్డి (45)బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆయన కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు.

కామినేని దవాఖానలో ఆయన గుండెను సేకరించి జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చడానికి సంబంధించి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు.

రెండు దవాఖానల అధికారులు పోలీసులను సంప్రదించి ఇందుకు ఏర్పాట్లుచేయాలని కోరారు.

సాయంత్రం సమయంలో నగరంలో ట్రాఫిక్‌ తీవ్రంగా ఉండటంతో గుండె తరలింపులో జాప్యం జరుగవచ్చని భావించిన పోలీసులు.. మెట్రో అధికారుల సహకారం తీసుకున్నారు.

తొలిసారిగా మెట్రో అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా రోడ్డు, మెట్రో మార్గాల్లో గ్రీన్‌చానల్‌ ఏర్పాటుచేశారని పత్రిక చెప్పింది.

సాయంత్రం 4.33 నిమిషాలకు ఎల్బీనగర్‌ కామినేని నుంచి గుండెను భద్రపర్చిన బాక్సుతో ప్రత్యేక అంబులెన్స్‌లో బయలుదేరిన అపోలో వైద్యుల బృందం 4.38కి నాగోల్‌ మెట్రోస్టేషన్‌కు చేరుకున్నది.

అక్కడ్నుంచి మెట్రో రైలులో 4.45 నిమిషాలకు బయలుదేరి 21 కిలోమీటర్ల మేర మెట్రోమార్గంలో 16 స్టేషన్లను నాన్‌స్టాప్‌గా దాటుకుంటూ 5.11 గంటలకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రోస్టేషన్‌కు చేరుకున్నది.

అక్కడ్నుంచి 5.13 గంటలకు మళ్లీ రోడ్డుమార్గంలో అంబులెన్స్‌ ద్వారా 5.15 గంటలకు అపోలో దవాఖానకు గుండెను చేర్చింది.

మొత్తం 45 నిమిషాల్లో విజయవంతంగా గుండెను తరలించారు. డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో అపోలో దవాఖానలో శస్త్రచికిత్స నిర్వహించారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)