ఇండోర్: అనాథ వృద్ధులు, యాచకులను ట్రక్‌లో తెచ్చి ఊరి బయట వదిలేసిన మునిసిపల్ సిబ్బంది.. సీఎం ఆగ్రహం

    • రచయిత, శురేహ్ నియాజీ
    • హోదా, బీబీసీ హిందీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 2 నిమిషాలు

దేశంలోనే స్వచ్ఛత విషయంలో నంబర్ వన్‌గా గుర్తింపు పొందిన ఇండోర్ నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో రోడ్ల పక్కన ఉండే నిరాశ్రయులు, అనాథలు, ఏ ఆదరణా లేని వృద్ధులు, యాచకులను ఇండోర్ కార్పొరేషన్ సిబ్బంది డంపర్లలోకి ఎక్కించి సిటీ బయటకు తీసుకెళ్లి వదిలేసిన వీడియో శుక్రవారం వైరల్ అయింది.

అయితే, స్థానికులు ఇలాంటి తీరుపై వ్యతిరేకత వ్యక్తంచేయడంతో వారిని మరో చోటికి తరలించారు.

ఇండోర్ వీధుల నుంచి యాచకులను, అనాథ వృద్ధులను తీసుకెళ్లి నగర పొలిమేర్లలో షిప్రా నది వద్ద వదిలేశారు.

ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరించిన ఇండోర్ మున్సిపల్ సిబ్బంది తీరును ఆ వీడియోలో చూసిన నెటిజన్లు కూడా వ్యతిరేకత వ్యక్తంచేశారు.

ప్రస్తుతం ఇండోర్ సహా మధ్యప్రదేశ్ అంతటా గడ్డ కట్టించే చలి ఉంది. అలాంటి వాతావరణంలో వృద్ధులను నైట్ షెల్టర్‌లకు తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాల్సింది పోయి ఇలా ఊరి బయట వదిలిపెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

సిబ్బందిని సస్పెండ్ చేసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

ఈ వీడియో వైరల్ అయిన తరువాత విపక్ష కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు మండిపడ్డాయి.

శుక్రవారం సాయంత్రానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలకు ఆదేశించారు.

ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఒక అధికారి, మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు.

''ఇండోర్ మునిసిపల్ సిబ్బంది వృద్ధుల విషయంలో అమానవీయంగా వ్యవహరించిన విషయం నా దృష్టికి వచ్చింది. ఇండోర్ డిప్యూటీ కమిషనర్, మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేయాలని కలెక్టరును ఆదేశించాను. వయోధికుల విషయంలో అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోను'' అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

నగరాన్ని శుభ్రంగా ఉంచడం కోసం వీరందరినీ బయటకు తరలించాలని ఆదేశించిన అధికారి ఎవరో తెలుసుకోవాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)