You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పదేళ్లలో టాప్-3కి భారత ఆర్థిక వ్యవస్థ: ప్రెస్ రివ్యూ
పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ టాప్-3కి చేరుతుందని సీఈబీఆర్ చెప్పిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదు నుంచి 6వ స్థానానికి జారుకున్నట్లు అనిపిస్తోందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) పేర్కొంది.
వచ్చే ఐదేళ్లలో (2025నాటికి) మళ్లీ బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి ఎగబాకనుందని అంటోంది.
అంతేకాదు, 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని తాజా నివేదికలో సీఈబీఆర్ అంచనా వేసింది.
2019లోనే భారత్ బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ టాప్-5 ఎకానమీగా మారింది. కానీ, కరోనా సంక్షోభ ప్రభావంతో ఈ ఏడాది మళ్లీ మెట్టు కిందికి జారుకోనుందని రిపోర్టు తెలిపింది.
బ్రిటన్‌కు చెందిన సీఈబీఆర్ రిపోర్టులో పేర్కొన్న మరిన్ని విషయాలు..
వచ్చే ఏడాది (2021) భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి పుంజుకోవచ్చు. 2022లో 7 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది.
భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందాక సాధారణంగానే జీడీపీ వృద్ధి రేటు మందగిస్తుంది. 2035 నాటికి 5.8 శాతానికి పరిమితం కావచ్చు.
2028 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగే అవకాశం ఉంది. గతంలో అంచనా వేసిన దానితో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే ఇది జరగనుంది.
కరోనా సంక్షోభం నుంచి కోలుకునే విషయంలో రెండు దేశాల మధ్య అసమానతలే ఇందుకు కారణం.
కరోనా సంక్షోభానికి ముందే భారత వృద్ధి గతి తప్పింది. 2018లో 6.1 శాతానికి పరిమితమైన జీడీపీ వృద్ధి రేటు 2019లో పదేళ్ల కనిష్ఠ స్థాయి 4.2 శాతానికి పడిపోయింది.
2016లో నమోదైన 8.3 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గింది.
బ్యాంకింగ్ రంగంలో ప్రతికూలతలు, సంస్కరణలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ సర్దుబాటు, అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం ఇందుకు కారణమని సీఈబీఆర్ తన రిపోర్టులో చెప్పిందని ఆంధ్రజ్యోతి వివరించింది.
పోలవరం అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం
పోలవరం నిర్మాణం కోసం అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఈనాడు దినపత్రిక వార్త ప్రచురించింది.
పోలవరం నిర్మాణం కోసం రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.
2017-18నాటి ధరల ప్రకారం ఈ మేరకు పచ్చజెండా ఊపినట్లు శనివారం విడుదల చేసిన జలశక్తిశాఖ - 2020 పురోగతి నివేదికలో వెల్లడించిందని ఈనాడు రాసింది.
ఈ ఏడాది మార్చి వరకు పోలవరం పనుల కోసం రూ.17,327 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.
'ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లోని సెక్షన్ 90 ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అది 2014 మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
2,454 మీటర్ల ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, 1,128.4 మీటర్ల పొడవైన స్పిల్‌వేతో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగునీటితోపాటు ఇతర ప్రయోజనాలు అందించాలన్నది లక్ష్యం.
2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలివున్న ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగానికి సంబంధించిన పనులను పూర్తి చేయడానికి 100% నిధులను కేంద్రమే సమకూరుస్తుంది.
ప్రస్తుతం కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను చేపడుతోంది. 2017-18నాటి ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు ఆమోదిత వ్యయం రూ.55,548.87 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ.8,614.16 కోట్లు విడుదల చేశాం.
అందులో రూ.1,850 కోట్లు ఈ ఏడాది జనవరి నుంచి విడుదలయ్యాయి. 2020-21లో రూ.2,234 కోట్లు మంజూరు చేశాం. త్వరలో నాబార్డు ద్వారా విడుదలవుతాయి. 2020 మార్చి 31 వరకు జరిగిన పనులకు రూ.17,327 కోట్లు ఖర్చయ్యాయి' అని అని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని ఈనాడు వివరించింది.
భారత్‌లో ఆక్స్ ఫర్డ్ టీకాకే తొలి ఛాన్స్
భారత్‌లో జరిగే వ్యాక్సినేషన్‌లో మొదట ఆక్స్‌ఫర్డ్ టీకాకే అనుమతులు లభించే అవకాశం ఉందని సాక్షి పత్రిక రాసింది.
దేశవ్యాప్తంగా జనవరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఒక పక్క ముమ్మరం కాగా, అత్యవసర వినియోగానికి ఆక్స్‌ఫర్డ్ కోవిడ్-19 టీకాకు వచ్చే వారంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ టీకా డోసులను దేశీయంగా పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిషీల్డ్ టీకా వినియోగానికి యూకేలో అనుమతులు లభించిన వెంటనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) నిపుణుల సమావేశం కానుంది.
భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఈ టీకా క్లినికల్స్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను పరిశీలించి భద్రత, వైరస్ నిరోధకతపై చర్చించి, దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించే విషయం పరిశీలించనుందని అధికారులు తెలిపారు.
భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి.
అయితే, భారత్ బయోటెక్ 'కోవాగ్జిన్'ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నందున అనుమతించేందుకు మరికొంత సమయం పట్టనుంది.
ఫైజర్ సంస్థ తన టీకా పనితీరుపై నివేదిక అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ 'కోవిషీల్డ్'కే భారత్‌లో అత్యవసర వినియోగానికి తొలి అనుమతి లభించనుందని అధికారులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే 4 కోట్ల డోసుల టీకాను తయారు చేసి, సిద్ధంగా ఉంచిందని సాక్షి వివరించింది.
పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంల ద్వారా రైతు బంధు
రైతుబంధు మొత్తాన్ని ఇక నుంచి పోస్టాఫీసుల్లో ఉన్న మైక్రో ఏటీఎం ద్వారా తీసుకోవచ్చని నమస్తే తెలంగాణ పత్రిక ఒక వార్త ప్రచురించంది.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి పంపిణీ చేయనున్న రైతుబంధు మొత్తాన్ని రైతులకు నగదు రూపంలో ఇచ్చేందుకు పోస్టల్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ మేరకు రాష్ట్రంలోని 4,860 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
ఈ ఏటీఎంల ద్వారా రైతులు సులువుగా నగదును పొందవచ్చని పోస్టుమాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి తెలిపారు.
రైతుబంధు పథకంలో భాగంగా యాసంగి పెట్టుబడికి ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రైతులు ఆ సాయాన్ని నగదు రూపంలో పొందాలంటే బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద భారీ క్యూలు ఉంటాయి.
ఒకవేళ ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవాలంటే అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పోస్టల్‌శాఖ పోస్టాఫీసుల్లోనే మైక్రో ఏటీఎంలను ఏర్పాటుచేస్తున్నదని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)