ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి కారణం ఇదేనా?

వీడియో క్యాప్షన్, ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి కారణం ఇదేనా?
ప్రచురణ

వి శంకర్, బీబీసీ కోసం

ఏలూరు నగరం, పరిసరాల్లో హఠాత్తుగా అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నాలుగు రోజులుగా బాధితులు పెరుగుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రానికి మొత్తం 561 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 450 మందిని డిశ్చార్జి చేశారు.

ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ప్రాధమిక నివేదిక చేరింది. బాధితుల శాంపిళ్లలో లెడ్, నికిల్ వంటి మెటల్స్ గుర్తించినట్టు ఎయిమ్స్ వెల్లడించింది. మోతాదుకి మించి వాటిని గుర్తించిన తరుణంలో వాటితో పాటుగా ఇంకా ఏమయినా కారణాలున్నాయా అనేది ఆరా తీసేందుకు వైద్య నిపుణులు, పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ బృందాలతో పాటుగా డబ్లూహెచ్ఓ ప్రతినిధులు కూడా ఏలూరులో పర్యటనలు చేస్తున్నారు. అయితే ప్రాధమిక నివేదిక వచ్చినప్పటికీ తుది నివేదిక కోసం ఇంకా అధికార యంత్రాంగం ఎదురుచూస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, ఏలూరులో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ హరిచందన్ విశ్వభూషన్ ఆదేశించారు. ఆయన నేరుగా సీఎంతో మాట్లాడారు.

ఇంటింటికీ వెళ్లి శాంపిళ్ల సేకరణ

కేంద్ర ప్రభుత్వ బృందాలు ఏలూరులో తాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. క్లోరినేషన్ , ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకున్నారు. పైప్ లైన్ పరిస్థితులను కూడా మునిసిపల్ కార్పోరేషన్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలు డివిజన్లలోనే ఇంటింటికీ వెళ్లారు. తొలుత ఏలూరు ఆస్పత్రిలో బాధితుల నుంచి శాంపిళ్లు సేకరించారు. అనంతరం ఇళ్లకు వెళ్లి ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన వారితో పాటుగా కొందరు ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి కూడా శాంపిళ్లు సేకరించారు. వారి ఇళ్లల్లోని పప్పులు, కూరగాయలు, తాగునీరు, వంట నూనెలు సహా పలు ఆహార పథార్థాలను శాంపిళ్లుగా తీసుకున్నారు. వాటన్నింటినీ పరీక్షించాల్సి ఉందని ఎన్ఐఎన్ బృందానికి ఇన్ఛార్జ్ గా ఉన్న బాబు బీబీసీకి తెలిపారు.

ఎక్కువ ప్రభావానికి గురయిన పది ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. ఈ సమస్య ఎదుర్కొన్న వారితో పాటుగా, సమస్య బారిన పడకుండా పక్క పక్క ఇళ్లల్లో ఉన్న వారి నుంచి శాంపిళ్లు సేకరిస్తున్నాం. వాటిని హైదరాబాద్, పూణేలలో ఉన్న ఉన్నత స్థాయి ప్రయోగశాలలకు పంపిస్తాం. శుక్రవారం నాటికి ప్రాధమిక నివేదిక వస్తుంది. ఎయిమ్స్ ఢిల్లీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్నాం. అయితే ఇంకా ఏమేమీ ఉన్నాయన్నది సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే అసలు కారణాలు కనుగొనే అవకాశం ఉంటుంది..అంటూ ఆయన వివరించారు.

సీసం, నికెల్ ఎలా చేరాయో తెలుసుకోవాలి...

ఏలూరులో అస్వస్థతకు గురైనవారికి ఎయిమ్స్‌ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల ప్రాధమిక నివేదికపై సీఎం తన కార్యాలయ అధికారులతో సమీక్షించారు. సీసం, నికెల్‌ లాంటి మూలకాలు ఉన్నట్టుగా నిర్ధారణ జరిగిందని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు సీఎంకి వివరించారు. అలాగే ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని, నివేదిక రావాల్సి ఉందని వెల్లడించారు. బాధితులకు నిర్వహించిన పరీక్షలు, అలాగే ఆప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షలు.. వీటన్నింటి ఫలితాలపై తుది రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టు వివరించారు.

ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాల ప్రకారం సీసం లాంటి మూలకాల సమస్య ఎందుకు ఎదురయ్యిందన్నది నిర్ధారించాలని సీఎం ఆదేశించారు. ఏ ప్రాంత ప్రజల శరీరాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉందన్నది వీలయినంత త్వరగా గుర్తించాలని ఆదేశించారు. బాధితులకు కొనసాగుతున్న వైద్య చికిత్స, వారికి అందుతున్న సదుపాయాలపై కూడా సీఎం అధికారులతో సమీక్షించారు.

కేంద్రంతో సమన్వయం చేసుకోండి అంటూ గవర్నర్ సూచన

కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రజలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ కి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సూచించారు. ఏలూరులో కొనసాగుతున్న సమస్యపై ఆయన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఫోన్లో మాట్లాడారు. ఏలూరులో న్న తాజా పరిస్ధితులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి చేరుతున్న వారందరికీ పూర్తి స్దాయి వైద్యం అందిస్తున్నామని, అత్యవసర పరిస్ధితిలో ఉన్న వారిని విజయవాడ తరలించామని ముఖ్యమంత్రి వివరించారు. వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు జాతీయ స్దాయి వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్ధల సహకారం తీసుకుంటున్నామని, ఎయిమ్స్, ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్ వంటి సంస్ధలు బాధితుల రక్త నమూనాలతో పాటు అవసరమైన ఇతర అన్ని నమూనాలను పరిక్షిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వింత వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించే క్రమంలో, ప్రభుత్వపరంగా మరింత అప్రమత్తత అవసరమని, వేగవంతమైన పనితీరు కనబరిచేలా స్ధానిక, వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని, ప్రజలకు అన్ని విధాల ధైర్యం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు

పెరుగుతున్న బాధితుల సంఖ్య

వరుసగా నాలుగో రోజు కూడా ఏలూరు ఈ సమస్యతో ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే మొదటి రెండు రోజులతో పోలిస్తే బాధితుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టడం ఉపశమనం కలిగించే చర్యగా భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి బాధితుల సంఖ్య 560 దాటింది. వారిలో 460 మందిని డిశ్చార్జ్ చేసినట్టు ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 68 కాగా, 29 మందిని విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు మెరుగైన చికిత్స కోసం తరలిచినట్టు తెలిపారు.

మొదటి రెండు రోజుల్లో 200 మంది చొప్పున బాధితులు నమోదు కాగా, ఎట్టకేలకు వారి సంఖ్య తగ్గుముఖం పడుతుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీత బీబీసీకి తెలిపారు. తుది నివేదిక వస్తే నిర్ధారణ తర్వాత మరింత అదుపులోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)