ఆంధ్రప్రదేశ్: మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం.. విశాఖలోనే రెండు - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

ఆంధ్ర‌ప్రదేశ్‌లో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు ఈనాడు తన కథనంలో పేర్కొంది.

వీటి ద్వారా రూ. 16,314 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 30 వేలమందికి ఉపాధి లభించే అవకాశం ఉందని ఈ కథనంలో తెలిపారు.

‘‘ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలను సమీక్షించారు.

అనంతరం ఇంటెలిజెంట్ సెజ్, అదానీ డేటా సెంటర్, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన మొదటి ఎస్ఐపీబీ సమావేశం ఇదే’’నని ఈ కథనంలో పేర్కొన్నారు.

కాలుష్య రహిత పరిశ్రమలకే విశాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు సూచించినట్లు ఈ వార్తలో రాశారు.

ఈనాడు కథనం ప్రకారం ఎస్ఐపీబీ ఆమోదం పొందిన పరిశ్రమలు:

1) చిత్తూరు జిల్లా కాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ సంస్థకు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ (చెప్పుల తయారీ) ఏర్పాటు ద్వారా రెండు దశల్లో రూ. 700 కోట్ల పెట్టుబడి వస్తుంది. సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇదే సంస్థ కడప జిల్లాలోనూ మరో సెజ్ ఏర్పాటు చేసి 2వేల మందికి ఉపాధి కల్పించనుంది.

2) విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రై లిమిటెడ్ హైవే టైర్ల తయారీ సంస్థ రూ.980 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

3) విశాఖలోని మధురవాడలో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ బిజినెస్ పార్కు, రిక్రియేషన్ సెంటర్‌తో పాటూ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా రూ. 14,634 కోట్ల పెట్టుబడులను సంస్థ పెట్టనుంది. సుమారు 24,990 మందికి ఉపాధి కల్పిస్తుంది.

ఆస్తుల వివరాల కోసం ఒత్తిడి చెయ్యొద్దని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

వ్యవసాయేతర ఆస్తుల సమాచారం కోసం ప్రజలను ఒత్తిడి చెయ్యొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్లు సాక్షి ఒక కథనంలో తెలిపింది. వ్యవసాయ భూముల వివరాల సేకరిస్తున్నప్పుడు కూడా ఆధార్ కార్డ్, కులం వివరాలు అడగొద్దని హైకోర్టు స్పష్టం చేసిందని, అంతే కాకుండా, ఇప్పటికే సేకరించిన కోటిమంది ఆస్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని ఆదేశించినట్లు ఈ కథనంలో రాశారు.

సమర్థవంతమైన చట్టాలు రూపొందించకపోతే ప్రజలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బీ. విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఈ వార్తలో రాశారు.

ప్రజలనుంచీ చట్టవిరుద్ధంగా ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఆధార్ కార్డ్, కులం వివరాలను సేకరిస్తున్నారని పలువురు న్యాయవాదులు వేసిన పిటీషన్లను ధర్మాసనం మంగళవారం విచారించింది.

ఈ సమాచారాన్ని ఇతరులతోపాటూ, ప్రభుత్వం దుర్వినియోగం చేయదన్న నమ్మకం ఏంటని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని, ఈ ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందంటూ కోర్టు మండిపడినట్లు సాక్షి కథనంలో తెలిపారు.

కాగా, రెండు వారాల గడువు ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరగా, ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చెయ్యాలని కోర్టు ఆదేశించినట్లు ఈ వార్తలో రాశారు.

వికారాబాద్‌కు జాతీయస్థాయి జలశక్తి అభియాన్ అవార్డు

వికారాబాద్ జిల్లాకు జలశక్తి అభియాన్ అవార్డు దక్కిందని నమస్తే తెలంగాణ వార్తను ప్రచురించింది.

ఈ జిల్లాలో వర్షపు నీటిని ఒడిసి పట్టడంతో పాటూ, వినియోగించిన నీటిని తిరిగి భూమిలోకి ఇంకిపోయేలాగ ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంల నిర్మాణం, పొలం గట్టు, కొండ ప్రాంతాల్లో గుంతలు తవ్వించి నీటిని సంరక్షించారు. భూగర్భ జలాలు మెరుగుపడేందుకు వికారాబాద్ జిల్లా చేసిన కృషికి జాతీయస్థాయి గుర్తింపు వచ్చిందని, ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖనుంచీ వికారాబాద్ డీఆర్‌డీఓకు సమాచారం అందిందని ఈ కథనంలో పేర్కొన్నారు.

జల సంరక్షణలో భాగంగా గత ఏడాది జిల్లాలో రూ.101.42 కోట్లతో 50,710 పనులను చేపట్టారు. వీటిలో అధిక మొత్తంలో ఇంకుడు గుంతలను నిర్మించారు. రూ. 1.98 కోట్లతో 499 చెక్‌డ్యాంలను, రూ.28.87 కోట్లతో 9,448 నీటి ఊట గుంతలను, రూ.34 లక్షలతో 134 బోరు ఊట గుంతలను తవ్వించారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు ఉండాలని అధికారులు ప్రజలకి అవహాగన కల్పించడంతో సత్ఫలితాలు వచ్చాయని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఐపీఎల్‌లో సందడి చేయనున్న మహిళా క్రికెటర్లు

ఐపీఎల్‌లో 'మహిళల టీ20 చాలెంజ్‌' మూడో అంచె బుధవారం ఆరంభం కానుందని ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది.

భారత క్రీడాకారిణులతోపాటూ ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్‌ ప్లేయర్లు కూడా లీగ్‌లో పాల్గొంటున్నట్లు ఈ కథనంలో తెలిపారు.

నాలుగు మ్యాచ్‌ల ఈ టోర్నీలో మూడు జట్లు.. డబుల్‌ డిఫెండింగ్‌ చాంప్‌ సూపర్‌ నోవాస్‌, వెలాసిటీ, ట్రయల్‌ బ్లేజర్స్‌ ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. టాప్‌లో నిలిచిన జట్లు వచ్చే సోమవారం (9న) జరిగే తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండుసార్లు విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని సూపర్‌ నోవాస్‌..ముచ్చటగా మూడో టైటిల్‌పై గురి పెట్టింది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ టీమ్‌ వెలాసిటీతో సూపర్‌ నోవాస్‌ తలపడనున్నట్లు ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)